iDreamPost
iDreamPost
పాలనలో మానవతా దృక్పథం ఉండాలి, నిబంధనలు పాటిస్తూనే అర్హులకు గరిష్ట లబ్ది చేకుర్చాలి. ఆ ప్రక్రియ కూడా పారదర్శకంగా ఉండాలి. జగన్ వీటిని దృష్టిలో పెట్టుకుని ఇళ్లస్థలాల పంపిణీకి మార్గదర్శకాలు ఇచ్చారు.
మార్చ్ నెల 25 ఉగాది నాడు ఒకేసారి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయటం లక్ష్యంగా పెట్టుకొన్న ముఖ్యమంత్రి జగన్ , అందుకు అవసరమైన భూసేకరణపై నిన్న సచివాలయంలో సమీక్ష నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులకు పలు సూచనలు చేశారు. భూసేకరణ కార్యక్రమంలో భూమి ఇచ్చే ఎవరికీ అన్యాయం జరగకూడదని , అవసరమైతే భూమి ఇచ్చే రైతుకి ఓ రూపాయి అదనంగా ఇచ్చి అయినా భూసేకరణ చేయండని సూచించారు .
ఫలానా కలెక్టర్ మాకు అన్యాయం చేశాడని ఒక్కచోట కూడా మాట రాకుండా మానవతా దృక్పధంతో వ్యవహరించమని , ఏ ఒక్క రైతు ఉసురూ ఈ ప్రభుత్వానికి తగలకుండా జాగ్రత్తలు తీసుకోమని ఆదేశించారు . ప్లాట్లు సిద్ధం చేసిన పిదప నిష్పక్షపాతంగా లాటరీ నిర్వహించి ప్లాట్లు కేటాయించమని , ఈ విషయంలో ఏ విధమైన అలసత్వానికి తావు లేకుండా యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసి లక్ష్యాన్ని చేరుకొమ్మని తేల్చిచెప్పారు .
అలాగే గోదావరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో బెల్ట్ షాప్స్ నడుస్తున్నాయని , ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని తన దృష్టికి వచ్చిన విషయాలను అధికారులకు చెప్పి పార్టీలకతీతంగా కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేయమని చెప్పారు .
ముఖ్యమంత్రిగా తాను , మంత్రులు , ప్రధాన అధికారుల నుండి కృషి చేస్తే అవినీతి యాభై శాతం తగ్గుతుందని , ప్రజలు ముందుకు వచ్చి 14400 లాంటి టోల్ ఫ్రీ నంబర్స్ ద్వారా కంప్లైట్ చేసి సహకరించడం ద్వారా ఏసీబీ వంటి సంస్థల సహకారంతో మిగతా యాభై శాతం అవినీతిని కూడా తగ్గిస్తామని స్పష్టం చేశారు .
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించి , సూచనలు ఆదేశాలు ఇచ్చిన పై అంశాల్ని గమనిస్తే ఆయా సమస్యల పట్ల ఆయనకున్న అవగాహన , చిత్తశుద్ధి , ప్రజల పట్ల , సమాజం పట్ల భాధ్యతాయుత ప్రవర్తన స్పష్టంగా గోచరిస్తాయి .
ఓ వైపు సంక్షేమ కార్యక్రమాలు నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలనే లక్ష్యాన్ని విధిస్తూనే మరో వైపు భూమి ఇచ్చే రైతుకు అన్యాయం జరగకూడదని అవసరమైతే ఓ రూపాయి అదనంగా ఇవ్వమని సూచించడం ప్రజల పట్ల జగన్ కి ఉన్న బాధ్యతకి నిదర్శనం .
లబ్ధిదారులకు కేటాయించే ప్లాట్లు కూడా రాజకీయ , బంధు ప్రీతికి తావు లేకుండా లాటరీ ద్వారా నిర్వహించమనడం అందరి పట్ల సమ దృష్టికి తార్కాణం .
అక్రమ ఇసుక తవ్వకాలు , బెల్ట్ షాప్స్ లాంటివి క్షేత్ర స్థాయిలో ఎక్కడున్నాయో గుర్తించి అధికారుల్ని హెచ్చరించడం ఉన్నత సమాజ నిర్మాణం పట్ల నాయకునికి ఉన్న చిత్తశుద్దిని సూచిస్తుంది .
రాష్ట్ర స్థాయిలో పలు సమస్యలున్నా రాబోయే కాలంలో జగన్ పరిపాలనలో వాటిని అధిగమించి రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తుందని పలువురు విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు .