iDreamPost
android-app
ios-app

మళ్ళీ తెరపైకి కాంగ్రెస్ ‘ట్రేడ్ మార్క్ గాంధీభవన్’ రాజకీయాలు..

మళ్ళీ తెరపైకి కాంగ్రెస్ ‘ట్రేడ్ మార్క్ గాంధీభవన్’ రాజకీయాలు..

చింత చచ్చినా పులుపు చావలేదు అన్న చందంగా తయారయ్యింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. తెలంగాణ ఇచ్చింది మేమే.. తెచ్చింది మేమే.. అని ఘనంగా చెప్పుకొనే కాంగ్రెస్ నేతలు గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటకట్టుకున్నాకూడా ఆ పార్టీ నేతల వ్యవహారశైలిలో ఏ మాత్రం మార్పు రాలేదు. పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ సాక్షిగా నిత్యం అంతర్గత కుమ్ములాటల్లో మునిగి తేలే ఆ ఆపార్టీ నాయకుల వ్యవహార శైలితో పార్టీ ఇప్పటికే భారీ మూల్యం చెల్లించుకుంది. నేతల వ్యవహార శైలి తో క్రమంగా ప్రజల్లో ఉన్న ఆ కాస్తా విస్వాసం కోల్పోయే ప్రమాదం దాపురించింది.

అయితే మొదటి నుండి గ్రూప్ ల మధ్య ఈ కుమ్ములాటల సంస్కృతీ కాంగ్రెస్ లో కాస్తా ఎక్కువే. దానిని ఆపార్టీ నేతలు తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని కవర్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. అయితే రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రెండు బలమైన ప్రాంతీయ పార్టీల దెబ్బకి జాతీయ పార్టీ కాంగ్రెస్ మనుగడే ప్రశ్నార్థకమైంది. తెలంగాణ లో మాత్రం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం పై ప్రజలోకి వెళ్ళి పోరాటం చెయ్యడంలో ఘోరంగా విఫలమౌతుంది. ఇదే సమయంలో తెలంగాణ వ్యాప్తంగా బిజెపి మాత్రం చాప కింద నీరులా విస్తరిస్తోంది.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న విస్వాసం కార్యకర్తల్లో సైతం కనుచూపు మేరలో లేకపోయినప్పటికీ విచిత్రంగా పార్టీలో గ్రూపు తగాదాలకు తెరపడకపోగా ఇంకా రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే భూకబ్జాలతో వార్తల్లో నిలిచి, అనధికారికంగా డ్రోన్ ఎగురవేత కేసులో జైలుకెళ్లోచ్చిన ఆ ఆపార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి వ్యవహారంలో పార్టీ నేతల మధ్య గ్రూపు తగాదాలు మరోమారు రచ్చకెక్కాయి. తాజాగా రేవంత్ రెడ్డి అనుచరులు కొందరు సోషల్ మీడియాలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కామెంట్లు పోస్ట్ చెయ్యడంతో, దీనిపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పార్టీలో కొందరు నేతలు రేవంత్ వ్యవహార శైలి పై మండిపడుతున్నారు. రేవంత్ ఒక్కడే కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నాడని సీనియర్లు ఆయనపై కస్సుమంటున్నారు.

మరోవైపు ఉత్తమ్ రెడ్డిని టార్గెట్ చేస్తే ఊరుకునేది లేదని జగ్గారెడ్డి రేవంత్ కు తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారు. రేవంత్, కుంతియా లు ఇద్దరే కాంగ్రెస్ పార్టీని నడిపించలేరని, కాంగ్రెస్ పార్టీ ఎవడి జాగీర్ కాదని తీవ్రంగా విరుచుకుపడ్డాడు. మరో కాంగ్రెస్ నేత వీహెచ్ కూడా ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించాడు. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి తానొక్కడినే పోరాడుతున్నట్టుగా.. తానూ తప్ప కాంగ్రెస్ లో పోరాడేవాళ్ళే లేనట్టుగా కలరింగ్ ఇస్తున్నాడని మండిపడ్డాడు. సాధారణ కార్యకర్తల స్థాయి నుండి అందరు కలసి పనిచేస్తేనే పార్టీ ముందుకెళ్తుందని వీహెచ్ అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారం మొత్తం పార్టీ కొర్ కమిటీ సమావేశంలో చర్చించాలని మిగతా కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఒక వైపు రేవంత్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రూప్ ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలోనే మరోవేపు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీ లో సోనియాగాంధీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా, ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే త్వరలో ప్రారంభం కాబోయే తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశాలు వాడి వేడిగా జరిగే అవకాశం వుంది. ఆ సమావేశంలో నేతల మధ్య సిగపట్లు.. ముష్టి యుద్దాలు తప్పేట్టులేవు. అదే జరిగితే మరోసారి గాంధీ భవన్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ పరువు బజారున పడటం ఖాయం..!