ఒకపక్క దేశ వాణిజ్య రాజధాని ముంబాయి తో సహా మహారాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు రాజకీయంగా కాస్తా ఊరట లభించింది. ప్రభుత్వం కొవిడ్-19 నియంత్రణ చర్యలు చేపడుతున్న ఈ తరుణంలో ఎటువంటి రాజకీయ అనిశ్చితి కి తావులేకుండా.. పెండింగ్ లో ఉన్న రాష్ట్ర శాసనమండలి ఎన్నికలను వెంటనే నిర్వహించాలని కోరుతూ గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యల పై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ప్రధాని మోదీతో మాట్లాడిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల అనంతర రాజకీయ పరిణామాలలో సంకీర్ణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఉద్దవ్ థాక్రే కు మహారాష్ట్ర శాసనసభలో గానీ, శాసనమండలిలో గానీ సభ్యత్వం లేదు.
కాగ, రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరిగిన ఆరు నెలల్లో ఆయన ఉభయ సభల్లో ఏదో ఒకదానిలో సభ్యత్వం పొందాల్సి ఉంటుంది. ఆ గడువు మే 28తో ముగియనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్-19 కేసులు అధికంగా నమోదవుతున్న ఈ పరిస్థితుల్లో రాజకీయ అస్థిరత ఏర్పడకుండా ఉద్ధవ్‌ను ఎమ్మెల్సీగా నియమించాలని కోరుతూ ఇటీవలే మంత్రి మండలి తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని గవర్నర్‌కు పంపింది. ఆ అంశం పెండింగ్‌లో ఉండడంతో ఉద్ధవ్ ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని వివరించినట్టు తెలుస్తుంది.
ఖాళీగా ఉన్న 9 మండలి స్థానాలకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ఈసీకి రాసిన లేఖలో గవర్నర్ పేర్కొన్నారు. వాస్తవానికి ఏప్రిల్‌లోనే ఎన్నికలు జరగాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ఈనెపధ్యంలొ ఒకప్పుడు ప్రాణ స్నేహితుల గా ఉన్న బీజేపీ-శివసేన మధ్య స్నేహం మళ్లీ చిగురిస్తుందా?? అన్న ఆసక్తికర చర్చ మళ్లీ తెరపైకొచ్చింది.