Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నూతన అధ్యాయం మొదలైంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి వైసీపీ సర్కార్ తెచ్చిన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ కొద్దిసేపటి క్రితం ఆమోద ముద్ర వేశారు. గత నెలలో జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ రెండు బిల్లులను శాసన సభ ఆమోదించిన విషయం తెలిసిందే. మండలికి పంపగా.. ఏ నిర్ణయం తీసుకోకుండానే సభ వాయిదా పడింది. 14 రోజుల తర్వాత ఆ బిల్లులు యథావిధిగా ఆమోదం పొందాయి. ఆ తర్వాత వాటిని గవర్నర్ ఆమోదం కోసం జగన్ సర్కార్ పంపింది. తాజాగా ఈ రోజు ఆ రెండు బిల్లులపై రాజ ముద్ర పడింది. దీంతో ఇక ఏపీలోని మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఉండనున్నాయి. అమరావతి శాసన రాజధానిగా ఉంటే.. విశాఖ కార్యనిర్వాహఖ, కర్నూలు న్యాయరాజధానిగా బాసిల్లనున్నాయి.
ఈ బిల్లులపై ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం నానా రాద్ధాంతం చేసింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ఆ రెండు బిల్లులను ఆమోదించవద్దని నానా యాగీ చేశారు. అడగకుండానే ఉచిత సలహాలు ఇస్తూ లేఖలు రాశారు. లేఖ రాసిన తర్వాత కూడా న్యాయ సలహా తీసుకోవాలని, రాజ్యాంగంలోని వివిధ అధికరణలను ప్రస్తావిస్తూ మీడియాకు ప్రకటనలు విడుదల చేసేవారు. తాజాగా బీజేపీ మాజీ అధ్యక్షుడైన కన్నా లక్ష్మీనారాయణ రెండు బిల్లులను ఆమోదించవద్దని లేఖ రాశారు. మరో బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదిరి కూడా గవర్నర్ ఏమి చేయాలో ప్రెస్‌మీట్ పెట్టి సలహాలు కూడా ఇచ్చారు. సుప్రిం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహా తీసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు.
ఆది నుంచి మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం, బీజేపీలోని ఓ వర్గం నేతలు.. ఆ బిల్లులను అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. మొదటి సారి మండలికి పంపినప్పుడు ఆమోదించకుండా.. నిబంధనలకు విరుద్ధంగా వాటిని సెలెక్ట్ కమిటీకి పంపుతున్నాం అంటూ మండలి చైర్మన్ షరీఫ్ ప్రకటించారు. అయితే నిబంధనలకు విరుద్ధం అంటూనే చైర్మన్ తీసుకున్న నిర్ణయం మండలి కార్యదర్శి ఆచరణలో పెట్టలేదు. దీంతో టీడీపీ ప్లాన్ బెడిసి కొట్టింది. మళ్లీ గత నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో సీఆర్‌డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులను శాసన సభ ఆమోదించి పంపగా.. ఎప్పటిలాగే మండలిలో అధిక్యం ఉన్న టీడీపీ వాటిని అడ్డుకుంది. ఆ బిల్లులే కాకుండా చర్రితలో తొలిసారి రాష్ట్ర బడ్జెట్‌ను కూడా ఆమోదించకుండా మండలిని నిరవధిక వాయిదా వేశారు. ఫలితంగా ఉద్యోగులకు జూలై నెల జీతాలు 5 రోజులు ఆలస్యమయ్యాయి. ఇన్ని కుట్రలు చేసినా చివరకు రాష్ట్ర ప్రజలు కోరుకున్నట్లుగా మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటుకు నాంధి పడింది.