ఈ రోజు పత్రికల్లో ప్రధాన శీర్షికగా వచ్చిన వార్త అక్రమ క్వారీయింగ్ పై గొట్టిపాటికి 303 కోట్లు ఫెనాల్టీ , భారీగా బాదేసిన సర్కార్ .
ఎవరీ గొట్టిపాటి . ప్రకాశం,గుంటూరు జిల్లాలలో పరిచయం అవసరం లేని పేరు . గొట్టిపాటి,కరణం బలరాం కుటుంబాల మధ్య నడిచిన రెండు దశాబ్దాల పోరులో గొట్టిపాటి హనుమంతరావ్ చిన్నకొడుకు కిషోర్ ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యాడు… మంత్రిగా ఉన్న హనుమంత రావ్ మరణంతో ఆయన పెద్దకొడుకు నరసయ్య రాజకీయ రంగప్రవేశం చేశాడు . 1999 ఎన్నికల్లో కరణం బలరాం టీడీపీ లో చేరటంతో నరసయ్య కుటుంబంలో విబేధాలు మొదలయ్యాయి.
కరణం బలరాం ఉన్న టీడీపీలో కొనసాగొద్దని నరసయ్య మీద కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చారు. అప్పటికి కేవలం 20 సంవత్సరాల యువకుడైన గొట్టిపాటి రవి (హనుమంతరావు తమ్ముడు శేషగిరిరావు కొడుకు) అన్న నరసయ్యతో తీవ్రంగా విభేదించాడు. 2004 ఎన్నికల నాటికి రవి కాంగ్రెసులో చేరి మార్టూరు నియోజకవర్గం నుంచి అన్న నరసయ్యను ఓడించి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ ఎన్నికల్లో నరసయ్య సొంత తల్లి కూడా రవి పక్షాన నిలిచి ప్రచారం చేశారు. రవి గెలిచిన తరువాత “కిషోర్ అన్నయ్య ప్రత్యర్థులను రాజకీయంగా ఓడించాం”అని ఇచ్చిన పేపర్ ప్రకటన గురించి ఇప్పటి మాట్లాడుకుంటారు.
నాటి నుండి నేటి వరకూ ఓటమి ఎరగని రవికుమార్ 2004 , 2009 లలో కాంగ్రెస్ తరుపున , 2014 లో వైసీపీ తరుపున, 2019 లో టీడీపీ తరుపున వరుస విజయాలు సాధిస్తూ నియోజక వర్గంలో తిరుగులేని ఆధిపత్యాన్ని సంపాదించుకున్నాడు . మార్టూరు నియోజక వర్గం రద్దయ్యి అద్దంకి నియోజక వర్గంగా మారినాక అక్కడ కూడా రవి హవా కొనసాగింది .
గత దశాబ్దంగా అవినీతి రూపం మారింది.. ప్రత్యక్ష అవినీతి స్థానంలో వ్యాపారంలో అక్రమ మార్గాలు చొరబడ్డాయి … ఇందులో వందల కోట్ల డబ్బు కనిపిస్తుండటంతో నాయకులే ప్రజలకు ఎదురు ఖర్చు పెడుతున్నారు.. గొట్టిపాటి రవి తీరు దీనికి నిదర్శనం రవి హవాకి ,తిరుగులేని ఆధిపత్యానికి కారణం రాజకీయం కోసం విరివిగా డబ్బు ఖర్చు పెట్టటమే కాక నియోజక వర్గంలో ఎవరి నుండి రూపాయి ఆశించకుండా పనులు చేయడం , సామాజిక వర్గంలో గట్టి పట్టు సాధించుకోవడం అనేది బహిరంగ సత్యం .
రాజకీయ రంగప్రవేశం చేసిన 2004 నుంచి 2014 వరకు అధికారపార్టీలో ఉన్న రవి ప్రభుత్వ అండదండలతో గ్రానైట్ వ్యాపారంలో, అక్రమ మైనింగ్ , జీరో బిజినెస్, అక్రమ వేబిల్లులతో ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడిచి వేల కోట్లు సంపాదించాడని జిల్లా వ్యాపార వర్గాల్లో అనుకుంటారు .
ఈ అక్రమ మైనింగ్ పై జరిమానా కూడా నేటిది కాదు . 2012 లో అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మైనింగ్ అక్రమాలని గుర్తించి 80 కోట్ల మేర ఫెనాల్టీ విధించింది . అప్పటి నుండీ రవి కుమార్ మెడ పై వేలాడుతున్న ఫెనాల్టీ కత్తి 2015 లో టీడీపీకి ఆయుధం అయ్యింది . అప్పట్లో టీడీపీలో చేరతారా లేదా ఫెనాల్టీ కడతారా అంటూ టీడీపీ చేసిన ఒత్తిడికి చినబాబుని కలిసి సర్దుబాటు చేసుకున్నారని రాజకీయ వర్గాల్లో గుప్పుమంది . ఇంతటితో రవి కష్టాలు తీరలేదు . కొంత కాలం స్తబ్దుగా ఉన్న టీడీపీ 2016 లో మళ్లీ ఒత్తిడి చేయనారంభించింది .
ఈ క్రమంలో 2016 ఏప్రిల్ 10 వ తారీఖు ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ ని కలిసిన రవి తాను టీడీపీ వత్తిడి తట్టుకోలేక పోతున్నా అని పార్టీ మారకపోతే 100 కోట్ల పైగా కట్టాల్సి వచ్చేట్టు ఉందని చెప్పాడట . దానికి జగన్ అక్రమ మైనింగ్ చేసి ఉంటే కట్టేయండి , ఒకవేళ చేయకపోతే న్యాయస్థానంలో పోరాడదాం అనగా రవి స్పందించకుండా ముభావంగా వెళ్ళిపోయాడు అని చెబుతారు .
రెండ్రోజుల తర్వాత నియోజక వర్గంలో ముఖ్య అనుచరులతో సమావేశమైన రవి ఇప్పుడు వంద కోట్లు కట్టే కంటే ఆ డబ్బులతో ఐదు సార్లు ఎన్నికలు ఎదుర్కోవచ్చని ఇప్పుడు పార్టీ మారితే తన వ్యాపారాలకు అడ్డంకులు లేకపోగా మీరూ ఆర్ధికంగా స్థిర పడొచ్చని ఒప్పించి అనుచరులతో కలిసి అదే నెల 23 వ తారీఖు అనుచర గణంతో టీడీపీలో చేరాడు .
రవి కలిసిన రోజునే మధ్యాహ్నం మూడు గంటలకు జగన్ ని కలిసిన అప్పటి మార్కాపురం ఎమ్మెల్యే జంకే వెంకట రెడ్డి పార్టీ మారమని తనకూ టీడీపీ నుండి వత్తిడి ఉందని అది కూడా రవి ద్వారానే జరుగుతుందని తననే కాకుండా , ముత్తమాల అశోక్ రెడ్డి , పోతుల రామారావు , డేవిడ్ రాజులతో కూడా పార్టీ మారే విషయంగా రవి సంప్రదించాడని అయితే తాను మారనని తేల్చి చెప్పానని మిగతా వారు మారే సూచనలు ఉన్నాయని వెల్లడించారని ఆ రోజు రాజకీయ వర్గాల్లో గుప్పుమంది .
అంతేకాక గత ఎన్నికల్లో ఆర్ధికంగా నష్టపోయానని అయినా నిన్ను మోసం చేసి పార్టీ మారే ఉద్దేశం లేదని కానీ 2019 ఎన్నికల్లో పోటీ చేయలేనని జంకే వెంకట్ రెడ్డి చెప్పడంతో ఆయన ఆర్ధిక పరిస్థితి అర్థం చేసుకున్న జగన్ ఆయనకు సహాయం చేసి తాకట్టులో ఉన్న జంకే వెంకట రెడ్డి ఆస్తులు విడిపించాడని ఇప్పటికీ జిల్లాలో కథలుగా చెప్పుకొంటారు .
గొట్టిపాటి రవి మొన్నటి ఎన్నికల ముందు వైసీపీలోకి వస్తాడని ప్రచారం జరిగినా జగన్ తలుపులు తెరవకపోవడంతో టీడీపీ తరుపున పోటీచేసి గెలిచాడు. రెండు మూడు నెలల కిందట కూడా గన్నవరం వంశీ తరహాలో టీడీపీ నుంచి బయటపడతాడని కూడా ప్రచారం జరిగింది.
2012 నాటి అక్రమ మైనింగ్ జరిమానా కట్టకుండా ఇంతకాలం తప్పించుకున్న రవి ని తాజాదాడులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. మొత్తం దాడుల్లో పలువురి అక్రమాలను గుర్తించి ఫెనాల్టీలు విధిస్తూ నోటీసులు జారీ చేయగా కొన్ని పత్రికల్లో రవికి , టీడీపీ నాయకులకి మాత్రమే ఫెనాల్టీ విధిస్తున్నట్టు భారీగా బాదేసిన సర్కార్ అని ఆంధ్రజ్యోతిలో వార్తలు రావడం విశేషం .
ఈ రాతలు రవికి ఏమాత్రం ఊరటనిచ్చేవి కావు.. కొండత పెనాల్టీ కళ్ళ ముందు కనపడుతుంటే కాళ్ళ కింద తానూ తొవ్వినంత గ్రానైట్ క్వారీ అంత లోతు కనిపిస్తుంది…