iDreamPost
android-app
ios-app

గ్రేటర్‌ పోలింగ్‌ : ఏం జరిగినా రికార్డే..!

గ్రేటర్‌ పోలింగ్‌ : ఏం జరిగినా రికార్డే..!

ఓటు వజ్రాయుధం లాంటిదంటారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రజల తల రాతలను వారే రాసుకునేందుకు భారత రాజ్యాంగం ఎలాంటి వివక్షకు తావులేకుండా ప్రతి ఒక్కరికీ కల్పించిన ఓటు హక్కు వినియోగించుకోవడంలో హైదరాబాద్‌వాసులు మునుపటి పంథానే అవలంభిస్తున్నారు. తమ కన్నా గ్రామీణ ప్రజలే పవిత్రమైన ఓటు హక్కును వినియోగించుకోవడంలో ముందు ఉంటారని మరోసారి హైదరాబాద్‌వాసులు రుజువు చేయబోతున్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఈ రోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల పోలింగ్‌ అత్యంత మందకొడిగా సాగుతోంది. బ్యాలెట్‌పేపర్‌లో సీపీఐ, సీపీఎం గుర్తులు తారుమారు కావడంతో ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌ (26)లో పోలింగ్‌ ఈ నెల 3కు వాయిదా వేశారు. మిగతా 149 డివిజన్లలో పోలింగ్‌ జరుగుతోంది. మధ్యాహ్నం ఒంటకు గ్రేటర్‌లో సరాసరి 18.2 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైంది. సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్‌కు సమయం ఉంది. ఆరు గంటల లోపు క్యూలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు నిర్వహిస్తుండడంతో ఒక గంట అదనంగా సమయం కేటాయించారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ.. అంటే మొత్తం 11 గంటల పాటు పోలింగ్‌ జరగబోతోంది. 11 గంటలలో ఇప్పటికే ఆరు గంటల సమయం ముగిసిపోయింది. ఇక ఐదు గంటల సమయం మాత్రమే ఉంది.

మిగిలిన ఐదు గంటల సమయంలో ఎంత మేర పోలింగ్‌ నమోదవుతుందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు హైదరాబాద్‌వాసులకు పదే పదే విజ్ఞప్తి చేశాయి. విద్యావంతులకు అన్నీ తెలిసినా.. ఓటు హక్కు విలువను మళ్లీ తెలియజేశాయి. ఈ రోజు ఓటు వేసిన సినీ నటుడు చిరంజీవి సహా పలువురు ప్రముఖులు, కవి, ప్రజా గాయకుడు గద్దర్, సీనియర్‌ ఐఎఎస్, ఐపీఎస్‌ అధికారులు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయినా ఎప్పటిలాగే హైదరాబాదీలలో స్పందన అంతంత మాత్రంగానే కనిపిస్తోంది.

2016లో జరిగిన గ్రేటర్‌ ఎన్నికల్లో 45 శాతం పోలింగ్‌ నమోదైంది. లోక్‌సభ, అసెంబ్లీ, కార్పొరేషన్‌.. ఇలా ఏ ఎన్నికల్లోనైనా హైదరాబాద్‌లో పోలింగ్‌ శాతం 50 శాతానికి అటు ఇటుగా ఉంటోంది. ప్రతి ఎన్నికల సమయంలోనూ, పోలింగ్‌ ముందు ఓటు వేయాలంటూ ప్రముఖులు చేస్తున్న విజ్ఞప్తులను హైదరాబాద్‌ ఓటర్లు పెద్దగా పట్టించుకోవడంలేదు. ఈ సారి ఎన్నికలు గతానికి భిన్నంగా సాగాయి. మేయర్‌ పీఠం కోసం కొత్త ప్రతర్థిగా బీజేపీ బరిలో నిలిచింది. టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. మతం, అభివృద్ధి, వరదలు, శాంతిభద్రతలు.. ఎన్నికల ప్రచారంలో ప్రధానాంశాలయ్యాయి.

ఇటీవల వరదల వల్ల హైదరాబాద్‌లోని బస్తివాసుల నుంచి సంపన్నలు వరకూ ఇబ్బందులు పడ్డారు. వరదలు, ఆ తర్వాత గోతులు తేలిన రోడ్లు, మౌలిక వసతుల లేమితో తాము పడిన ఇబ్బందులు, కలిగిన ఆస్తి నష్టంతో హైదరాబాదీలలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సోషల్‌ మీడియా వేదికగా తమ గళాన్ని వినిపించారు హైదరాబాదీలు. ఈ గళం ఓటు రూపంలో పోటెత్తుతుందని అందరూ భావించారు. స్థానిక సమస్యలకు పరిష్కారానికి, అభివృద్ధికి ప్రధానమైన కార్పొరేషన్‌ ఎన్నికల్లో నగర ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటారని వేసిన అంచనాలు తప్పాయి. పాలపొంగులా.. హైదరాబాదీల ఆవేశం కూడా చల్లారిపోయిందని ఇప్పటి వరకూ నమోదైన పోలింగ్‌ శాతంతో స్పష్టమవుతోంది. ఇప్పుడు మిగిలి ఉన్న ఆసక్తికర అంశం గత ఎన్నికల పోలింగ్‌ శాతం 45 కన్నా ఈ సారి ఎక్కువ నమోదవుతుందా..? ఇంకా తగ్గుతుందా..? అనేదే. ఏది జరిగినా.. గ్రేటర్‌ ఎన్నికల్లో రికార్డుగా మిగులుతుంది.