Idream media
Idream media
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా జరిగిన ప్రచారానికి అనుగుణంగానే పోలింగ్ రోజున కూడా రాజకీయం వాడీవేడీగా సాగుతోంది. టీఆర్‌ఎస్, బీజేపీలు నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికల ప్రచారం సాగించాయి. ఆరోపణలు, విమర్శలతో హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు దేశం దృష్టిని ఆకర్షించాయి. బీజేపీ తరఫున అమిత్ షా, యూపీ సీఎం యోగి, మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవిస్ వంటి అతిరథ మహారధులు ప్రచారం సాగించారు. టీఆర్‌ఎస్ తరఫున సీఎం కేసీఆర్ సభ నిర్వహించగా.. ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ కాలికి బలపం కట్టుకుని హైదరాబాద్ అంతా తిరిగాయి. మేయర్ పదవి మాదంటే.. మాదంటూ ఈ రెండు పార్టీలు ధీమా వ్యక్తం చేశాయి.
ప్రచారంలో తలపడినట్లుగానే పోలింగ్ రోజున కూడా బీజేపీ, టీఆర్‌ఎస్ శ్రేణులు ఢీకొంటున్నాయి. గ్రేటర్ వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద టీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణలు మధ్యనే వివాదాలు, తోపులాటలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రలోభపెడుతున్నారని, డబ్బులు పంచుతున్నారని టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలతో బీజేపీ కార్యకర్తలు తలపడుతున్నారు. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కారులో డబ్బులు ఉన్నాయంటూ.. బీజేపీ కార్యకర్తలు కారును అడ్డుకున్న ఘటన వివాదాస్పదంగా మారింది. పలు బూత్‌లలో ఓట్లు గల్లంతవడంతో ఓటర్లతో కలసి బీజేపీ శ్రేణలు ఆందోళన లు చేస్తున్నాయి. కావాలనే ఓట్లను తొలగించారంటూ బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
గ్రేటర్‌లో కీలక పార్టీ అయిన ఎంఐఎం.. పాత బస్తీకే పరిమితం అయింది. బీజేపీ, ఎంఐఎం పార్టీ కార్యకర్తల మధ్య ఎలాంటి వివాదాలు చోటుచేసుకోవడంలేదు. ప్రధానంగా టీఆర్‌ఎస్, బీజేపీల మధ్యనే గ్రేటర్ పోరు సాగుతున్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ప్రధాన ప్రతిక్షమైన కాంగ్రెస్ పార్టీ.. గ్రేటర్ ఎన్నికల్లో అసలు పోటీలో లేనట్లుగా వ్యవహరిస్తోంది. ఆ పార్టీ నేతలు, కార్యకర్తల హడాహుడి ఎక్కడా కనిపించడం లేదు. ఎన్నికల ప్రచారంలోనే.. మేయర్ పదవి కోసం పోటీలో లేమనేలా కాంగ్రెస్ నేతలు చేసిన ప్రకటనలు ఆ పార్టీ కార్యకర్తల్లో నిస్తేజాన్ని, ఓటర్లలో ఆలోచనను కలిగించాయని చెప్పవచ్చు. గెలిచే పార్టీకి 80 సీట్లు ఇచ్చి.. తమకు 25 – 30 సీట్లు అయినా ఇవ్వాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో పోలింగ్‌కు ముందే చెప్పాయి.
ప్రచారంలోనూ, పోలింగ్ రోజున హోరా హోరీగా తలపడిన/తలపడుతున్న టీఆర్‌ఎస్, బీజేపీలలో ఏ పార్టీ గ్రేటర్ హైదరాబాద్‌పై తమ జెండాను ఎగురవేస్తాయన్నది ఈ నెల 4వ తేదీన తేలనుంది.