iDreamPost
iDreamPost
విశాఖ నగర పరిధిలో పెను ప్రమాదం సంభంవించింది. ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకేజీ కలకలం రేపింది. తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో పలువురు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఇంకా అనేక మంది నిద్రలోనే ఉన్న సమయంలో వారి పరిస్థితి ఏమిటన్నది అంతుబట్టడం లేదు. ఇప్పటికే విశాఖ కేజీహెచ్ కి తరలించిన వారిలో ఐదేళ్ల బాలిక సహా ముగ్గురు మరణించినట్టు వైద్యులు ప్రకటించారు మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. ఈ ఘటన పట్ల ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ముఖ్యమంత్రి జగన్ నేరుగా జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గ్యాస్ లీకేజీ ఘటన సమాచారం అందగానే రంగంలో దిగిన సహాయక సిబ్బందిలో పలువురు గ్యాస్ ప్రభావానికి గురయ్యారు. కళ్ల మంటలు, శ్వాస సమస్యలతో సతమతం అవుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువ మంది బాధితులుగా ఉన్నట్టు చెబుతున్నారు. ఆర్ ఆర్ వెంకటాపురంలో ఉన్న ఈ పరిశ్రమకు ఆనుకుని చుట్టూ మూడు కిలోమీటర్ల వ్యవధిలో ప్రమాదకర రసాయానాలతో కూడిన గ్యాస్ ప్రభావం ఉందని అధికారులు నిర్ధారించారు.
అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నారు. జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్.కె.మీనా, ఎమ్మెల్యే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు, వైద్య సిబ్బంది ఆర్.ఆర్. వెంకటాపురం ప్రాంతానికి చేరుకుని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకైనట్టు అధికారులు గుర్తించారు. లీకేజీని అరికట్టేందుకు అధికారులు, సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఈ ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడారు.ఎల్.జీ పాలిమర్స్ సౌత్‌కొరియా కంపెనీ అని, లాక్‌డౌన్ నుంచి పరిశ్రమలకు మినహాయింపు తర్వాత తిరిగి ప్రారంభించినట్టు వెల్లడించారు. . సుమారు 3గంటల సమయంలో పరిశ్రమ నుంచి స్టెరైన్ వాయువు లీకైందని ప్రమాదవశాత్తు జరగడంతో నష్టం ఏమేరకు అన్నది నిర్దారరణ కకాలేదన్నారు. లీకైన గ్యాస్ వల్ల ప్రాణ నష్టం ఉండదని ఆయన అంటున్నారు. స్పృహతప్పి పడిపోవడం ఈ గ్యాస్ సహజ లక్షణం అని నిద్రమత్తులో ఉండి వాయువు పీల్చడం వల్ల ఎక్కువ మంది అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. వారికి ఆక్సిజన్ ఇస్తే వెంటనే కోలుకునే అవకాశం ఉంటుందన్నారు. దాదాపు 200 మంది వరకు అస్వస్థతకు గురై ఉంటారని అంచనా వేస్తున్నాంమని వివరించారు. ప్రభావిత ప్రాంతాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించామని, మరో రెండు గంటల్లోగా అదుపులోకి వస్తుందని ఆయన తెలిపారు.