వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు!

సామాన్యంగా ఇంధన ధరలు పెరిగితే.. సామాన్యుడి జేబుకు భారీ చిల్లు పడుతుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగితే.. కూరగాయలు మొదలు బస్‌ ఛార్జీల వరకు ప్రతి దాని ధర పెరుగుతుంది. ఇక గత కొంత కాలంగా మన దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప.. దిగి రావడం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరలు తగ్గినా.. మన దేశంలో మాత్రం ఇంధన ధరలను తగ్గించలేదు. కానీ త్వరలోనే లోక్‌ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం.. ఇంధన ధరలు తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంది. దాంతో త్వరలోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా దిగివచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఆ వివరాలు..

కేంద్ర ప్రభుత్వం త్వరలోనే వాహనదారులకు శుభవార్త చెప్పనుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించేందుకు రెడీ అవుతోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వచ్చే ఆగస్టు నెల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలపై రూ. 4 నుంచి 5 మేర తగ్గించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇదే ఏడాది చివర్లో నవంబర్ లేదా డిసెంబర్ నెలలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తీసుకోనున్న ఈ నిర్ణయం వాహనదారులకు భారీ ఊరట కలిగించనుంది.

2023-24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు భారీ లాభాలు చవిచూశాయని.. ఈ కారణంగానే ఆగస్టులో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేందుకు సుముఖత వ్యక్తం చేశాయని నివేదికలు చెబుతున్నాయి. త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు ఉండనుండటంతో.. ఇంధన ధరలు తగ్గిస్తారని.. కానీ ఎలక్షన్‌లు ముగిసిన తర్వాత.. తిరిగి పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. ప్రస్తుతం ఉన్న క్రూడ్ ఆయిల్ ధరలతో పాటు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల బ్యాలెన్స్ షీట్స్‌ని పరిశీలించి చూస్తే.. ఆగస్టు నుంచి పెట్రోల్, డీజిల్ ధరలుపై రూ. 4 నుంచి 5 రూపాయల వరకు ధరలు తగ్గించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Show comments