iDreamPost
android-app
ios-app

వ‌చ్చే నెలలో టోటల్ ఫ్రీ?

  • Published May 20, 2020 | 4:15 AM Updated Updated May 20, 2020 | 4:15 AM
వ‌చ్చే నెలలో టోటల్ ఫ్రీ?

మార్చి 22 జ‌న‌తా క‌ర్య్ఫూతో మొద‌లుపెడితే.. నేటి వ‌ర‌కూ దేశం లాక్ డౌన్ లోనే (స‌డ‌లింపులు ప‌క్క‌న పెడితే) ఉంది. 22వ తేదీన ప్ర‌జలంతా ఇళ్ల‌లోనే ఉండాల‌ని.. సాయంత్రం క‌రోనా వారియ‌ర్స్ కు చ‌‌ప్ప‌ట్ల‌తో కృత‌జ్ఞ‌త‌లు తెల‌పాల‌ని క‌రోనా నేప‌థ్యంలో మొట్ట‌మొద‌టి సారిగా మాట్లాడిన ప్ర‌ధాని మోదీ .. అనంత‌రం.. మార్చి 24న దేశంలో మర్నాడు నుంచి అంటే మార్చి 25 నుంచి 21 రోజుల పాటు తొలిసారి లాక్ డౌన్ విధించారు. ఏప్రిల్ 14 వ‌ర‌కు అది కొన‌సాగింది. ఎమ‌ర్జెన్సీ స‌ర్వీసులు త‌ప్ప మొత్తం అన్నీ బంద్ చేయాల‌ని ఆదేశించారు. దేశంలో తొలి లాక్ డౌన్ క‌ఠినంగా అమ‌లు జ‌రిగింది. రైళ్లు, విమాన‌యాన స‌ర్వీసుల‌తో పాటు మొత్తం అన్ని కార్య‌క‌లాపాల‌నూ నిలిపేశారు.

ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా.. మే 3 వ‌ర‌కు అవే నిబంధ‌న‌ల‌తో మ‌రోసారి లాక్ డౌన్ 2.0 పొడిగించారు. అది 19 రోజుల పాటు కొన‌సాగింది. అయిన‌ప్ప‌టికీ క‌రోనా పాజిటివ్ కేసుల తీవ్ర‌త త‌గ్గ‌క‌పోవ‌డంతో.. మ‌రో రెండు వారాలు అంటే మే 17 వ‌ర‌కూ లాక్ డౌన్ 3.0 కేంద్రం ప్రకటించింది. అయితే కొన్ని స‌డ‌లింపులు ఇచ్చింది. అనంతరం మే 18 నుంచి 31 వరకూ లాక్ డౌన్ 4.0 ప్రకటించింది. నాలుగో విడత లోనే చాలా వరకూ మినహాయింపులు ఇచ్చింది. అంక్షల అమలులో ఆయా రాష్ట్రాలకు అధికారాలు ఇచ్చింది. కేంద్ర మార్గ దర్శకాలకు అనుగుణంగా.. తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు నిర్ణయాలు తీసుకోవడం తో సినిమా హాళ్లు, హోటళ్ళు, ప్రార్థన మందిరాలు, క్లబ్బులు, పబ్బులు మినహా దాదాపు అన్ని కార్యకలాపాలు ఈ నెల 19 నుంచే ప్రారంభమయ్యాయి.

ఇదిలా ఉండగా.. ఇదే రోజు సాయంత్రం రైల్వే శాఖ నుంచి కీలక ప్రకటన విడుదల అయింది. జూన్ ఒకటో తేదీ నుంచి 200 నాన్ ఏసీ ప్యాసింజర్ రైళ్లు దేశ వ్యాప్తంగా నడపనున్నట్లు రైల్వేమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. త్వరలో ఆన్ లైన్ బుకింగ్ ప్రారంభమవుతుందని ఆయన ట్వీట్ చేశారు. అదే విధంగా వలస కార్మికుల కోసం మరో 200 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వెల్లడించారు. తర్వాత దశలవారీగా రైలు సర్వీసుల సంఖ్యను పెంచనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే షెడ్యూల్ టైం టేబుల్ చెబుతామని పేర్కొన్నారు. ఈ ప్రకటనతో ఇక లాక్ డౌన్ పొడిగింపు ఉండదనే సంకేతాలు వెలువడుతున్నాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులు తప్ప అన్నీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఈ నెల 31 తర్వాత లాక్ డౌన్ నుంచి పూర్తి విముక్తి లభించినట్లే.

ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి.ఒకవేళ లాక్ డౌన్ నుంచి విముక్తి లభించినా కరోనా నుంచి కాదని ప్రజలు గుర్తుంచు కోవడం మంచిది.