Idream media
Idream media
కొన్ని సినిమాలు ముందే పసిగడుతాం. వాటికి దొరక్కుండా , థియేటర్ల వైపు వెళ్లకుండా తప్పించుకుంటాం. అయితే ఒక్కోసారి అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. జర్నీలో వెంటపడుతాయి.
అనంతపురం వెళ్లాలని నిన్న రాత్రి హైదరాబాద్‌లో బస్సు ఎక్కాను. సీటులో కూచోగానే “హలో” సినిమా వేశారు. అఖిల్ గొప్పతనం ఏమంటే చిన్నవయస్సులో సిసింద్రీగా మనల్ని ఆనందపరచాడు. కానీ హీరో అయిన తర్వాత ఆడుకుంటున్నాడు. ఫస్ట్ సినిమాలోనే ఈ ప్రపంచాన్ని సంరక్షించే ఫాంటసీ కథతో భయభ్రాంతుల్ని చేశాడు. తప్పు తెలుసుకుని హలో అనే ప్రేమ కథలోకి వచ్చాడు.
బస్సులో దీనికి చిక్కుకున్నాను. చూడకుండా ఉండటానికి వీల్లేదు. సౌండ్ మోగిపోతూ ఉంది. నిద్రరాదు. టేకింగ్ ఫొటోగ్రఫీ బాగున్నా దీంట్లో కథలేదు. బాల్య స్నేహితుడు ఉన్నాడని ఆ అమ్మాయి ఒక మాట చెబితే అయిపోయే సినిమాకి రెండు గంటలు లాగి పడేశారు. కుర్ర హీరోలతో ఉన్న సమస్య ఏమంటే సినిమా అంతా తామే మోయాలనుకుంటారు. చుట్టూ చాలా మంది ఉంటే బావుంటుంది కానీ లేరు. రమ్యకృష్ణ, జగపతిబాబు ఉన్నా ఏదేదో మాట్లాడి బోర్ కొట్టిస్తూ ఉంటారు. చివరికి ప్రేమికులు కలుసుకున్నారు. రిలీఫ్‌గా కళ్లు మూసుకుంటే పెద్ద సౌండ్. హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమా వేశారు. ఇది బీపీ వెడ్డింగ్‌లా మారింది.
సినిమాలో చాలా మంది ఉంటారు. ఏదో కామెడీకి ప్రయత్నిస్తుంటారు. హీరోయిన్‌కి ఎందుకు కోపం వస్తుందో తెలియదు. నరేష్ హర్మోనియం పట్టుకుని పాత పాటలు పాడి బుర్ర తింటుంటాడు. థియేటర్ అయితే బయటకు వెళ్లొచ్చు. టీవీ అయితే ఆఫ్ చేయవచ్చు. మరి బస్సు నుంచి దూకలేం కదా!
ఈ సారి జర్నీలో టీవీ లేని బస్సు ఎక్కండి. లేదంటే మెరుపు దాడి జరుగుతుంది.