Idream media
Idream media
కరోనా వైరస్ వల్ల స్తంభించిన భారత ఆర్థిక వ్యవస్తను తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీలో రెండో భాగాన్ని కొద్దిసేపటి క్రితం దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. నిన్న మొదటి విడతలో చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు సంబంధించిన ప్యాకేజీని ప్రకటించిన ఆర్థిక మంత్రి ఈ రోజు రైతులు, పేదలు, వలసకూలీలు, అసంఘటిత రంగాల కార్మికులకు సంబంధించిన ప్యాకేజీ వివరాలను వెల్లడించారు.
గత రెండు నెలల్లో 25 లక్షల కిసాన్ కార్డులు జారీ చేసి 25 వేల కోట్ల రూణాలు ఇచ్చామని చెప్పారు. నాబార్డు మార్చి లో 29 వేల కోట్ల రూపాయలు రుణాలు గ్రామీణ బ్యాంకులకు ఇచ్చిందని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు పెట్టుబడి కోసం 6,700 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. దేశంలో 3 కోట్ల మంది రైతులు తీసుకున్న 4.22 లక్షల కోట్ల రూణాలపై మూడు నెలల మారటోరియం విధిస్తున్నట్లు తెలిపారు. మార్చి 31 నాటికి చెల్లించాల్సిన రుణాలను ఆగస్టు వరకూ వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. రుణాలు సకాలంలో చెల్లించే వారికి మే నెల వరకూ వడ్డీ రాయితీ ఇస్తున్నట్లు చెప్పారు.
ఒకదేశం ఒక రేషన్‌కార్డు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆగస్తు వరకూ ఈ విధానం కింద కార్మికులు, వలస కూలీలు రేషన్ పొందవచ్చని చెప్పారు. రాబోయే రెండు నెలలు కూడా పేదలకు తలకు ఐదు కేజీల బియ్యం లేదా గోదుమలు, కార్డుకు ఒక కేజీ శెనగలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సంఘటిత రంగంలో మాదిరీగా అసంఘటిత రంగ కార్మికులకు కూడా కాల్ లెటర్లు, కనీస వేతనం, ఆరోగ్య పరీక్షలు తప్పని సరి చేస్తున్నామని చెప్పారు.
పట్టణాలు, నగరాలకు వలస వచ్చే కూలీలకు, పేదలకు తక్కువ మొత్తంలో అద్దె ఇళ్లు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఇందు కోసం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో గృహ సముదాయాలు నిర్మిస్తామని చెప్పారు. హై వేలు నిర్మించినట్లు, వాటి వద్ద టోల్ గేటు ఫీజు వసూలు చేసిన మాదిరిగా ఈ విధానం ఉంటుందని, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు సంబంధిత మంత్రిత్వ శాఖ వెల్లడిస్తుందని చెప్పారు.
ముద్ర పథకం కింద శిశు విభాగంలో 50 వేలు కన్నా తక్కువ లోన్ తీసుకున్న వారికి వచ్చే ఏడాది పాటు 2 శాతం వడ్డీ తగ్గిస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెలలో 6 వేల కోట్లతో గిరిజనుల కోసం కంపా పథకం ప్రారంభిస్తామని చెప్పారు. గ్రామీణ మౌలిక సదుపాయాల కోసం 4,200 కోట్లు కేటాయించారు. 6 నుంచి 18 లక్షల రూపాయల మధ్య ఆదాయం ఉన్న వారికి గృహ రుణాలపై వడ్డీ రాయితీ ప్రకటించారు.
వర్షాకాలంలోనూ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశంలో ఉన్న 50 లక్షల రోడ్డు వెంబడి వ్యాపారులకు రుణాలు ఇచ్చేందుకు 5 వేల కోట్లు కేటాయించారు. వసల వెళ్లిన వారు స్థానికంగా రేషన్ తీసుకుంటే.. కార్డులోని మిగతా సభ్యులు వారి స్వగ్రామాల్లో రేషన్ తీసుకునే విధంగా ఒన్ నేషన్ ఒన్ రేషన్ కార్డు విధానం అమలు చేస్తామని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వలస కూలీలు భయాందోళనలకు గురికావద్దని, ఎక్కడి వారు అక్కడే ఉండాలని, వారికి కావాల్సిన అన్నిసదుపాయాలు చేస్తున్నామని నిర్మలా సీతారామన్ విజ్ఞప్తి చేశారు.