iDreamPost
android-app
ios-app

కరోనాకి వ్యాక్సిన్‌ వస్తేనే అంతర్జాతీయ హాకీ పోటీలు నిర్వహిస్తామని ప్రకటించిన ఎఫ్‌ఐహెచ్‌

కరోనాకి వ్యాక్సిన్‌ వస్తేనే అంతర్జాతీయ హాకీ పోటీలు నిర్వహిస్తామని ప్రకటించిన ఎఫ్‌ఐహెచ్‌

ప్రాణాంతక కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తేనే అంతర్జాతీయ హాకీ పోటీలను నిర్వహిస్తామని ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (ఎఫ్‌ఐహెచ్‌) ప్రకటించింది. హాకీ క్రీడా పోటీలను 5 దశలలో పునరుద్ధరిస్తామని ఎఫ్‌ఐహెచ్‌ తెలిపింది.

మొదటిదశలో సామాజిక దూరం పాటిస్తూ నెదర్లాండ్స్‌,బెల్జియం దేశాలలో శిక్షణతో అంతర్జాతీయ హాకీ కార్యకలాపాలు ప్రారంభిస్తాము.తదుపరి దశలో ప్రాంతీయ టోర్నీల నిర్వహణ ఉంటుంది. అలాగే మూడో దశలో పొరుగు దేశాలలో జరిగే టోర్నీలలో మ్యాచులు జరుగుతాయి. తర్వాత ఖండాంతర టోర్నీలు నిర్వహిస్తూ, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక పూర్తి స్థాయిలో అన్ని రకాల టోర్నీల నిర్వహణ ఉంటుంది.

ప్రస్తుతం ప్రపంచంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో ఒక్కొక్క దశ ఎన్ని రోజులు ఉంటుందనేది ఇప్పుడే నిర్ధారించలేమని అంతర్జాతీయ హాకీ సమాఖ్య తెలిపింది.అలాగే కరోనా వైరస్ కట్టడిపై ఆధారపడే తమ భవిష్యత్ ప్రణాళిక ఉంటుందని పేర్కొంది.దీనితో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటూ అంతర్జాతీయ హాకీని పునరుద్ధరిస్తామని ఎఫ్‌ఐహెచ్‌ ప్రకటించింది.