iDreamPost
android-app
ios-app

రెండు నాలుగయ్యాయి.. అసలుకే ఎసరొచ్చేలా ఉంది..!

రెండు నాలుగయ్యాయి.. అసలుకే ఎసరొచ్చేలా ఉంది..!

గత ఏడాది నవంబర్‌ 26వ తేదీన నూతనసాగు చట్టాలు రద్దు చేయాలంటూ రైతులు మొదలుపెట్టిన ఉద్యమం కీలక మలుపు తిరిగింది. గత నెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలు, ఎర్రకోట వద్ద చోటు చేసుకున్న పరిణామాల తర్వాత రెండు రోజులు ఉద్యమ తీవ్ర తగ్గినట్లు కనిపించినా.. భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత (బీకేయూ) రాకేష్‌ టికాయత్‌ రాకతో రైతు ఉద్యమం కొత్త పుంతలు తొక్కుతోంది. మునుపటి కన్నా ఉద్యమ తీవ్రత పెరిగింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాకేష్‌ టికాయత్‌ ఆధ్వర్యంలో ప్రస్తుత ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. అంతకు ముందు ఈ ఉద్యమం కేవలం పంజాబ్‌ రైతులు, సిక్కులకు పరిమితమనే వ్యాఖ్యలు వినిపించాయి. ఇప్పుడు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల రైతులు ఉద్యమంలో భారీ స్థాయిలో భాగస్వాములయ్యారు.

టికాయత్‌ రాకతో …

నిన్న మొన్నటి వరకు దాదాపు 40 రైతు సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమం జరిగింది. ఢిల్లీ శివార్లలో భైటాయించిన రైతులు శాంతియుతంగా నిరసన తెలిపారు. సాగు చట్టాల రద్దు, మద్ధతు ధరకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్లతో కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. డజను సార్లు చర్చలు జరిగినా.. ఏ మాత్రం ఫలితం లేకపోయింది. రైతు సంఘాల్లో స్వల్పంగా ఉన్న అనైక్యతను ఆసరాగా చేసుకున్న కేంద్రం.. రైతుల డిమాండ్లకు ససేమిరా అంది. రాకేష్‌ టికాయత్‌ రాక తర్వాత.. రైతు ఉద్యమం ఏక నాయకత్వంలో సాగుతోంది. పైగా.. వివిధ ప్రాంతాల్లో రోజు మహా పంచాయత్‌లు, ఖాప్‌ పంచాయత్‌లు నిర్వహిస్తూ.. తమలోని ఐఖ్యతను, రైతు ఉద్యమం తీవ్రతను కేంద్రానికి తెలియజేస్తున్నారు.

ఇక చర్చల్లేవ్‌..

టికాయత్‌ రాక తర్వాత.. కేంద్ర ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఇకపై చర్చలు జరపబోమని రాకేష్‌ టికాయత్‌ తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు చేస్తున్న డిమాండ్లకు అదనంగా మరికొన్ని జోడించారు. సాగు చట్టాల రద్దు, మద్ధతు ధరకు చట్టబద్ధతతోపాటు వ్యవసాయ రుణాల రద్దు, స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల అమలు చేయాలని రాకేష్‌ టికాయత్‌ డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే గద్దె దింపాల్సి వస్తుందని పరోక్ష హెచ్చరికలు చేస్తూ కేంద్ర పెద్దలకు చెమటలు పట్టిస్తున్నారు. ఉత్తర భారత దేశంలో బలంగా ఉన్న బీజేపీకి.. ఈ పరిణామాలు భారీ నష్టం చేసేలా ఉన్నాయి. డిమాండ్లను అమలు చేయకపోతే ఉద్యమాన్ని దేశం మొత్తం విస్తరిస్తామని, త్వరలో 40 లక్షల ట్రాక్టర్లతో దేశ వ్యాప్తంగా ర్యాలీ నిర్వహిస్తామని రాకేష్‌ టికాయత్‌ హెచ్చరిస్తున్నారు. రోజుల గడిచే కొద్దీ రైతు ఉద్యమం పెరగడం తప్పా.. తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇంకా పట్టుదలకు పోతే.. అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ అగ్రనాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి.