సంక్రాంతి అనగానే బలవంతపు ఫ్యామిలీ సినిమా తియ్యాలనే ఆలోచన ఎంత ప్రమాదకరమో “ఎంత మంచివాడవురా” చెబుతుంది. పండగ రోజు ఫ్యామిలీలందరూ జాతరకి వచ్చినట్టు సినిమా హాళ్లకు వస్తారనేది వాస్తవమే. కానీ వాళ్లకి బంధాలు, బంధువులు, స్నేహాలు, సాయాలు అంటూ టీవీ సీరియల్ మెటీరియల్ని వడ్డించాలనుకోవడం పొరపాటు. సెన్సిబిల్ సినిమాలకన్నా రెడిక్యులస్ కామెడీకే ఫ్యామిలీ ప్రేక్షకులు పట్టం కడతారనేది పోయినేడు సంక్రాంతికి వచ్చిన “ఎఫ్-2” రుజువు చేసింది. ఆ టైములో వచ్చిన “ఎన్.టి.ఆర్ కథానాయకుడు”, “వినయ విధేయ రామ” రెండూ “ఎఫ్-2” ముందు వెలవెలబోయాయి.
అంతకుముందెప్పుడో ఒక సంక్రాంతికి వచ్చిన “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” కి కూడా భారీ క్యాస్టింగ్ వల్ల ఓపెనింగ్స్ బాగానే ఉండి లాంగ్ రన్నులో లాగేసినా కంటెంట్ పరంగా ప్రేక్షకుల మొట్టికాయలు చాలానే పడ్డాయి.
ఈ ఏడు “సరిలేరు నీకెవ్వరు”, “అల వైకుంఠపురంలో” ఈ రెండింటిలోనూ సెన్సిబుల్ సీరియస్ కంటెంట్ కంటే విమర్శకుల చేత “సెన్స్ లెస్” అనిపించుకునే కామెడీయే డామినేట్ చేసింది. దానికే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. “సరిలేరు నీకెవ్వరు”లో ట్రైన్ కామెడీ కావొచ్చు, “అల వైకుంఠపురంలో” లో బోర్డురూం కామెడీ కావొచ్చు…రెండింటికీ ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్న థియేటర్సులో నవ్వులతో గోడలు బద్దలవుతున్నాయి. కానీ “ఎంత మంచివాడవురా” అంటూ తీసిన సీరియస్ ఫ్యామిలీ బంధాల సినిమాకి మాత్రం ఆ ఫ్యామిలీ ఆడియన్సే నిట్టూర్పులు విడుస్తున్నారు.
ఎప్పుడో ఈ సీజన్లో ఒక “శతమానం భవతి” ఆడిందని ఆ ఫ్యామిలీ సెంటిమెంటు రుద్దుడుకి ప్రేక్షకులు సిద్ధంగా ఉంటారనుకోవడం కాస్ట్లీ మిస్టేక్ కు దారి తీయొచ్చు. ఈ మధ్య వచ్చిన “ప్రతిరోజూ పండగే”లో బంధాల సెంటిమెంటు ఉన్నా దానికి పూర్తి కామెడీ ట్రీట్మెంటు ఇవ్వడంతో గట్టెక్కింది. లేకపోతే ఫ్యామిలీ ప్రేక్షకులనే బెదరగొట్టేది.
అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, తాత, బామ్మ కూడా సినిమా హాళ్లదాకా వచ్చి సినిమా చూడాలనుకునేది పెద్ద హీరోల డ్యాన్సు స్టెప్పులు చూస్తూ పకపకా నవ్వుకోవడానికి తప్ప ఆల్రెడీ వాళ్ల ఇళ్లల్లో ఉన్న సెంటిమెంటుని కళ్లకు పూసుకుని ఏడవడానికి కాదు అనేది ఈ సినిమాలన్నిటినీ పరిశీలిస్తే అర్థమవుతుంది.
ఏ కథ ఎత్తుకున్నా దానికి ఎంత సెన్స్ లెస్ కామెడీ అద్దితే ఫ్యామిలీ ప్రేక్షకులు అంత హత్తుకుంటారు అనేది మేధావులైన దర్శకులు గుర్తించాలేమో.