iDreamPost
iDreamPost
అప్పుడెప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం బాలకృష్ణ హీరోగా సమరసింహారెడ్డి వచ్చినప్పుడు అది సృష్టించిన ప్రభంజనానికి చిన్నా పెద్ద తేడా లేకుండా అందరు హీరోలు ఫ్యాక్షన్ బాట పట్టారు. చిరంజీవి ఇంద్ర, జూనియర్ ఎన్టీఆర్ ఆది, బాలయ్య చెన్నకేశవరెడ్డి, రాజశేఖర్ భరతసింహారెడ్డి, వెంకటేష్ జయం మనదేరా లాంటివన్నీ ఈ కోవలో వచ్చినవే. కొన్ని ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్ అయితే కొన్ని సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఈ ట్రెండ్ చాలా కాలం కొనసాగింది.
ఒకదశలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు రాయలసీమలో పగలు ప్రతీకారాలు ఇప్పుడు కూడా ఇంత దారుణంగా ఉన్నాయా అని చర్చించుకునేలా చేసింది. తరువాత ఈ ఫార్ములా మూసగా మారిపోవడంతో దర్శకులు వీటి జోలికి వెళ్లడం మానేశారు. కానీ గత ఏడాది త్రివిక్రమ్ అరవింద సమేత వీర రాఘవతో మరోసారి దీనికి తెరతీశారు. మితిమీరిన రక్తపాతం హింస ఉన్నప్పటికీ బొమ్మ ఆడింది. ఇప్పుడు తాజాగా సరిలేరు నీకెవ్వరు వంతు వచ్చింది.
ఒక్కడు తరహాలో ఇందులో కూడా కర్నూల్ బ్యాక్ డ్రాప్ లో ప్రకాష్ రాజ్ ని విలన్ గా ప్రోజెక్ట్ చేసి కథను నడిపించారు. హింస లేనప్పటికీ ఈ రోజుల్లో కూడా సీమ పట్టణాలు పల్లెల్లో జనం లారీల్లో వందలాదిగా కత్తులు కటార్లు పట్టుకుని తిరుగుతారు అనేలా చూపించారు. నిజానికి సీమలో ఫ్యాక్షన్ జాడలు ఏనాడో తగ్గిపోయాయి.
ఏవో ఒకటి రెండు మారుమూల పల్లెల్లో తప్ప కర్నూల్ లో జనం రోడ్ల మీదకొచ్చి నరికి చంపుకునేంత సీన్ ఇప్పుడు లేదు. సినిమాటిక్ లిబర్టీ కోసం ఇదంతా కల్పించి రాసుకుని తీసినట్టు చెప్పుకోవచ్చు కానీ కక్షలను ఒక ప్రాంతానికి పరిమితం చేసి కేవలం రాయలసీమల్లోనే కక్షలు రాజ్యమేలుతాయి అని చూపించడమే ఇతర ప్రాంతాల ప్రజలకు ఇలాంటి అభిప్రాయం బలపడేలా చేస్తాయి. కాకపోతే సరిలేరు నీకెవ్వరులో కత్తులతో నరికి చంపడాలు చూపకుండా ఒక రౌడీ మినిస్టర్ లో మార్పు తీసుకు వచ్చేందుకు హీరో ప్రయత్నించడమే కొత్త ట్విస్ట్.