Idream media
Idream media
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం పోలీస్ స్టేషన్‌లో దళిత యువకుడికి ఎస్‌ఐ చేయించిన శిరోముండనం వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. ఈ అమానుష ఘటనలో నిందితులైన ఎస్‌ఐ, ఇద్దరుకానిస్టేబుళ్లపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకున్నా కూడా మాజీ ఎంపీ హర్షకుమార్ ఈ వ్యవహారంపై సరికొత్త అనుమానులు వ్యక్తం చేస్తూ అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. సస్పెండ్ లాంటి సదాసీదా చర్యలతో సరిపెట్టకుండా జగన్ సర్కార్ ఈ ఘటనకు బాధ్యులైన సీతానగరం ఇంచార్జి ఎస్.ఐ ఫిరోజ్‌పై ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టం కింద కేసు పెట్టి రిమాండ్‌కు కూడా తరలించింది. ఇక ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి వారి పాత్రపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. ప్రభుత్వం వేగంగా, నిష్పక్షపాతంగా ఈ కేసులో వ్యవహరించిందని నిందులపై తీసుకున్న చర్యలే చెబుతున్నాయి.
అయితే హర్షకుమార్ మాత్రం.. ఈ ఘటనలో అదృష్య హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. సీతానగరం స్టేషన్‌కు ఇంచార్జిగా శిరోముండనం ఘటన జరగడానికి రెండు రోజుల ముందు ఇంచార్జిగా వెళ్లిన ఫిరోజ్.. స్థానిక పరిస్థితులపై, గ్రామ స్థాయి నాయకులపై ఎలాంటి అవగాహనలేదని చెబుతున్నారు. ఫిర్యాదు చేయించిన కవల కృష్ణమూర్తికి పోలీసులను ఆదేశించేంతటి శక్తిలేదని.. ఈ ఘటన వెనుక అదృష్య శక్తుల ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు. స్టేషన్‌లో బాధితుడును ఉంచి రోజు రాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ ఎస్‌ఐకు ఫోన్‌లో ఆదేశాలు వస్తూనే ఉన్నాయని, ఎస్‌ఐ, ఇతర పోలీసుల కాల్ రికార్డుపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ కాల్ చేసింది ఎవరో తేల్చాలంటూ కోరుతున్నారు. పదే పదే అదృష్య శక్తి అంటూ మాట్లాడుతున్న హర్షకుమార్ అది ఎవరో మాత్రం చెప్పడం లేదు. పోలీసులు, కేసులు, జైలు శిక్షలకు, అధికారంలో ఉన్న బడా రాజకీయ నాయకులు.. ఇలా దేనికీ, ఎవరికీ భయపడని హర్షకుమార్ ఈ విషయంలో మాత్రం చీకటిలో ఉండి రాయి వేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. హర్షకుమార్ చేస్తున్న విమర్శల్లో నిజం ఉంటే.. ఆ అదృష్య శక్తి పేరు ఎందుకు చెప్పడం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి.
తాను లేవనెత్తిన అనుమానాలు, చేసిన డిమాండ్ల వరకూ హర్షకుమార్ పరిమితం అయితే.. ఆయన వ్యాఖ్యలకు విశ్వసనీయత ఉండేది. కానీ ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేయడంతోనే ఆయన లేవనెత్తిన అనుమానాలపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. శిరోముండనం కేసులోని అదృష్య శక్తికి సీఎం జగన్ ఆశీస్సులు ఉన్నాయని హర్షకుమార్ ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఈ ప్రభుత్వం మా వల్లే నెగ్గిందనే ఆలోచనతో దళితులు పేట్రేగిపోతున్నారనే భావనతో సీఎం ఉన్నారంటూ అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారు. అందుకే దళితులను అణచివేయాలని సీఎం జగన్ చూస్తున్నరంటూ హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారు. దళితులకు వ్యతిరేకంగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఘటన వెనుకా సీఎం ఉన్నారంటూ వైఎస జగన్‌మోహన్ రెడ్డిపై తనకు ఉన్న హర్షకుమార్ వెళ్లగక్కారు.