iDreamPost
android-app
ios-app

ఆర్థిక వ్యవస్థను పట్టించుకోవడం అంటే.. అప్పులు చేయడమేనా యనమలా..?

ఆర్థిక వ్యవస్థను పట్టించుకోవడం అంటే.. అప్పులు చేయడమేనా యనమలా..?

తెలుగుదేశం పార్టీ మేథావి, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మరోసారి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టారు. చంద్రబాబు పాలన గుప్తుల స్వర్ణయుగంలా ఉంటే… జగన్‌ పాలన తుగ్లక్‌ పాలన మాదిరిగా ఉందంటూ తన మేధావితనం చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. తుగ్లక్‌ పాలన మాదిరిగా జగన్‌ పాలన.. ఆర్థిక వ్యవస్థకు ఏ మాత్రం సహకరించడంలేదంటూ విమర్శించారు. సీఎం జగన్‌ ఆర్థిక వ్యవస్థను ఏ మాత్రం పట్టించుకోవడం లేదంటూ గత చరిత్రను మరిచి యనమల మాట్లాడుతున్నారు.

చంద్రబాబు గత ప్రభుత్వ హాయంలో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన యనమల రామకృష్ణుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రంపై కొండంత అప్పులు పెట్టిన విషయం మరచిపోతున్నారు. విభజన తర్వాత ఏపీ 70 ఏళ్లకు గాను వచ్చిన అప్పు 90 వేల కోట్లు అయితే.. చంద్రబాబు హయాంలోని ఐదేళ్లలో చేసిన అప్పుల దాదాపు 1.50 లక్షల కోట్లు. దీనికి అధనంగా మరో లక్ష కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌ పెట్టి వెళ్లారు. దీంతో మొత్తం చంద్రబాబు హాయంలో చేసిన అప్పులు 2.50 లక్షల కోట్లు. 1953 నుంచి 2014 వరకు ఏపీ అప్పు దాదాపు 90 వేల కోట్లు కాగా.. చంద్రబాబు ఐదేళ్ల పాలన తర్వాత ఏపీ అప్పు దాదాపు 3.50 లక్షల కోట్లకు చేరుకుందంటే.. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన యనమల రామకృష్ణుడు ఏ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి సహకరించారో ఈ గణాంకాలే చెబుతున్నాయి.

అవకాశం ఉంది కాబట్టే అప్పులు చేస్తున్నాం అని విలేకర్ల ప్రశ్నకు సమాధానం చెప్పిన యనమల రామకృష్ణుడు ఆర్థిక వ్యవస్థపై మాట్లాడడం విడ్డూరంగా ఉంది. అయిన కాడికి దొరికిన చోటల్లా అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం పాలన.. గుప్తుల స్వర్ణయుగంతో పోల్చని యనమల రామకృష్ణడు.. అసలు అప్పులే లేకుండా పాలన చేసే వారి ప్రభుత్వాన్ని ఏ యుగంతో పోలుస్తారో భవిష్యత్‌లో చూడాలి. ఒకరిపై విమర్శలు చేసే ముందు తాము వెలగబెట్టిన ఘన కార్యాలు మాటలై సూదుల్లా పోడుస్తాయన్న విషయం యనమల గుర్తుపెట్టుకుంటే హుందాగ ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. లేదంటే తాము చేసిన విమర్శలు తిరిగి బూమరాంగ్‌లా మారి మనకే తగులుతాయని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.