టీడీపీని వీడబోతున్న మాజీ మంత్రి శిద్ధా.. రాజకీయం జీవితం ఎలా మొదలైందంటే..?

తెలుగుదేశం పార్టీకి మరోపెద్ద ఎదురుదెబ్బ తగలడం ఖాయమైంది. ఆ పార్టీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉన్న గ్రానైట్‌ వ్యాపారి, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు టీడీపీని వీడబోతున్నారు. తనయుడు  శిద్ధా సుధీర్‌తో కలసి రేపు శిద్ధా రాఘవరావు వైసీపీలో చేరబోతున్నారని సమాచారం. ఈ మేరకు స్పష్టమైన నిర్ణయం తీసుకున్న శిద్ధా అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిసింది.

శిద్ధా రాఘవరావు టీడీపీని వీడడం ఆ పార్టీకి, చంద్రబాబుకు పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. ప్రకాశం జిల్లాలో ఆ పార్టీకి ఇప్పటి వరకూ పెద్ద దిక్కుగా శిద్ధా రాఘవరావు ఉన్నారు. ఇప్పటికే సీనియర్‌ నేత, బలమైన నాయకుడు, ప్రస్తుత చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావులు పార్టీని వీడడంతో టీడీపీ పూర్తిగా బలహీనపడింది. తాజాగా శిద్ధా రాఘవరావు కూడా ఆదే బాటలో పయనించడం ఖాయమైన నేపథ్యంలో టీడీపీకి ఇది కోలుకోలేని దెబ్బగా అభివర్ణించవచ్చు.

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏ లక్ష్యంతో అయితే శిద్ధా రాఘవరావును పార్టీలోకి తీసుకొచ్చారో.. ఆ లక్ష్యం నెరవేరిందని చెప్పవచ్చు. 1999 ఎన్నికల సమయంలో తటస్థుల కింద ఆర్థికంగా బలమైన వ్యాపారస్థులను టీడీపీ తరఫున పోటీ చేయించాలని చంద్రబాబు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో ఆర్థికంగా బలమైన, వైశ్య సామాజిక వర్గానికి చెందిన శిద్ధా రాఘవరావు, యక్కలి తులసీరావులను పార్టీలోకి తీసుకొచ్చారు.

1994లో ఒంగోలులో భారీ మెజార్టీతో గెలిచిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఈదర హరిబాబును కాదని 1999 ఎన్నికల్లో యక్కలి తులసీరావుకు టీడీపీ టిక్కెట్‌ ఇచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి, ప్రస్తుత విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మొదటిసారి గెలుపొందారు. తర్వాత జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసిన యక్కలి తులసీరావు.. ఒంగోలు మున్సిపల్‌ చైర్మన్‌ అయ్యారు.

1999లో శిద్ధా రాఘవరావును చంద్రబాబు తీసుకొచ్చినా పోటీ చేయించలేదు. పార్టీ అధికారంలోకి రావడంతో ఆయనకు శ్రీశైలం ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌గా అవకాశం కల్పించారు. 2004 ఎన్నికల్లో యక్కలి తులసీ రావు స్థానంలో ఒంగోలు నుంచి శిద్ధా రాఘవరావును బరిలో దింపారు. అయితే ఈ ఎన్నికల్లోనూ బాలినేని శ్రీనివాసరెడ్డి గెలిచారు. ఆర్థికంగా బలమైన తటస్థులతో వరుసగా రెండు ఎన్నికల్లో చంద్రబాబు చేసిన ప్రయోగాలు వికటించాయి. ఇక విధిలేని పరిస్థితుల్లో తిరిగి 2009లో ఈదర హరిబాబుకే ఒంగోలు టిక్కెట్‌ ఇచ్చారు.

2009లో జరిగిన త్రిముఖ పోరులో పీఆర్‌పీ నుంచి గ్రానైట్‌ వ్యాపారి ఆనంద్, కాంగ్రెస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసుల రెడ్డి పోటీలో నిలిచారు. త్రిముఖ పోరులోనూ గెలిచిన బాలినేని హాట్రిక్‌ సాధించారు. వైఎస్సార్‌ ప్రభుత్వంలో మొదటిసారి గనులశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

టీడీపీ అధికారంలో లేని సమయం(2004–2014)లో శిద్ధా రాఘవరావు ఆ పార్టీ ఆర్థిక భారాన్ని కొంత మేర మోశారు. కొన్ని వందల కోట్ల రూపాయలు పార్టీ కోసం ఖర్చు పెట్టారని ఆయన అనుచరులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలోనే 2007లో ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు.

ఎమ్మెల్సీగా ఉన్న శిద్ధా రాఘవరావు 2009 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. 2014లో దర్శి నుంచి పోటీ చేశారు. ఒకప్పుడు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి శిద్ధా రాఘవరావు కంపెనీలో పని చేశారు. ఇద్దరూ చీమకుర్తిలో ఉండడం వల్ల స్థానికంగా మంచి సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికంగా బలమైన నేతగా ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిని ఓడించేందుకు శిద్ధా రాఘవరావును దర్శి నుంచి పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ దర్శిలో వర్గపోరుతో సతమతమవుతోంది. బాదం మాధవ రెడ్డి, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిలు రెండు వర్గాలుగా పని చేశాయి. ఫలితంగా శిద్ధా రాఘవరావు 1,374 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచారు. చంద్రబాబు కేబినెట్‌లో రవాణాశాఖ మంత్రిగా పదవి చేపట్టారు.

2019 ఎన్నికల నాటికి శిద్ధా రాఘవరావు దర్శిలో బలమైన నేతగా ఎదిగారు. ఈ ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ అభ్యర్థి అయిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరి పోటీకి సిద్ధమయ్యారు. దీంతో టీడీపీకి ఎంపీ అభ్యర్థి కరువయ్యారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒంగోలు ఎంపీగా శిద్ధా రాఘవరావు పోటీ చేయాల్సి వచ్చింది. తాను దర్శి నుంచే పోటీ చేస్తానని చివరి వరకూ శిద్ధా రాఘవరావు పట్టుబట్టారు. కానీ చంద్రబాబు ఒత్తిడితో అయిష్టంగానే దర్శి అసెంబ్లీ నుంచి ఒంగోలు పార్లమెంట్‌కు వెళ్లాల్సి వచ్చింది.

ఒంగోలు ఎంపీ స్థానానికి వెళ్లిన శిద్ధా రాఘవరావు.. దర్శి అసెంబ్లీ సీటును తన కుమారుడు సుధీర్‌కు ఇవ్వాలని పట్టుబట్టారు. అయితే కనిగిరి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కదిరి బాబూరావును దర్శికి పంపి.. ఆ స్థానంలో మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరశింహారెడ్డికి టిక్కెట్‌ ఇవ్వాలని చంద్రబాబు భావించారు. ఫలితంగా సుధీర్‌కు టిక్కెట్‌ దక్కలేదు. కనిగిరి నుంచి దర్శికి వెళ్లేందుకు మొదట్లో కదిరి బాబూరావు నిరాకరించారు. అయితే సామాజికవర్గాల సమీకరణలో చంద్రబాబు తాను అనుకున్నట్లుగా దర్శి, కనిగిరి, ఒంగోలు ఎంపీ పదవులకు పోటీ చేయించారు. అయితే మూడు చోట్ల టీడీపీ ఓటమిపాలైంది.

కుమారుడు శిద్ధా సుధీర్‌ రాజకీయ భవిష్యత్‌పై ఆలోచనలో ఉన్న శిద్ధా రాఘవరావు ఎన్నికలు ముగిసినప్పుటి నుంచీ సైలెంట్‌గా ఉన్నారు. తిరిగి దర్శి బాధ్యతలు తీసుకునేందుకు కూడా నిరాకరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ దర్శి బాధ్యతలు తీసుకునేందుకు అయిష్టత చూపారు. గత ఎన్నికల్లో శిద్ధా రాఘవరావు ఆశించినట్లు తన కుమారుడు సుధీర్‌కు దర్శి టిక్కెట్‌ ఇచ్చి ఉంటే.. ప్రస్తుతం ఆయన పార్టీ మారే ఆలోచన చేసి ఉండేవారు కాదని చెబుతున్నారు. గత ఎన్నికల్లో దర్శి నుంచి శిద్ధా రాఘవరావు లేదా ఆయన కుమారుడు సుధీర్‌ పోటీ చేసి ఉంటే.. గెలిచినా.. ఓడినా.. టీడీపీలో కొనసాగేవారని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు.

టీడీపీలో కుమారుడు భవిష్యత్‌ పట్ల భరోసా లేకపోవడంతోపాటు.. ప్రస్తుతం టీడీపీ తిరిగి కోలుకునే అవకాశం లేకుపోవడం వంటి కారణాలతో శిద్ధా రాఘవరావు పార్టీ మారుతున్నారనే ప్రచారం సాగుతోంది. రాష్ట్రంలో వైశ్య సామాజికవర్గం నేతగా గుర్తింపు ఉన్న శిద్ధా రాఘవరావు.. వైసీపీలో చేరడం వల్ల ఆ పార్టీకి లాభించే అవకాశం ఉంది.

Show comments