అచ్చెం నాయుడుకు కరోనా పాజిటివ్‌..!! వైరస్ ఎలా సోకింది..?

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజారపు అచ్చెం నాయుడుకి కరోనా సోకింది. 150 కోట్ల రూపాయలు పక్కదారి పట్టిన ఈఎస్‌ఐ స్కాంలో నిందితుడుగా ఉన్న అచ్చెం నాయుడును జూన్‌ 12వ తేదీన ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఫైల్స్‌ కారణంగా హైకోర్టు ఆదేశాల మేరకు అచ్చెం నాయుడును పోలీసులు గుంటూరు రమేష్‌ ఆస్పత్రికి తరలించారు. గతనెల 8వ తేదీ నుంచి అచ్చెం నాయుడు రమేష్‌ ఆస్పత్రిలోనే ఉంటున్నారు. అంతకు ముందు వారం రోజులు విజయవాడ జైలులోనూ.. అరెస్ట్‌ తర్వాత గుంటూరు సర్వజన ఆస్పత్రిలో ఉన్నారు. దాదాపు 36 రోజుల నుంచి  అచ్చెం నాయుడు రమేష్‌ ఆస్పత్రిలో జుడిషియల్‌ రిమాండ్‌లో ఉంటున్నారు

వైరస్‌ ఎలా సోకింది..?

ఏసీబీ అరెస్ట్‌ చేసిన అచ్చెం నాయుడు ప్రస్తుతం జుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. ఆస్పత్రిలో ఉన్నా ఆయన్ను కలిసేందుకు ఎవరికీ అనుమతి లేదు. పోలీసులు కాపాలా ఉంటారు. పోలీసులు, ఏసీబీ అధికారులు, కుటుంబ సభ్యులు.. ఇలా ఎవరైనా సరే అచ్చెం నాయుడును కలవాలంటే కోర్టు ముందస్తు అనుమతి తప్పనిసరి. అచ్చెం నాయుడు బయటకు కూడా వెళ్లేందుకు వీలు లేదు. అచ్చెం నాయుడకు కరోనా సోకిన విషయం కూడా రమేష్‌ ఆస్పత్రి ముందు హైకోర్టుకు తెలిపిందంటే నిబంధనలు ఎలా ఉన్నాయో తెలుస్తోంది. అలాంటిది అచ్చెం నాయుడుకు వైరస్‌ ఎవరి ద్వారా సోకిందనేది ప్రస్తుతం అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

రమేష్‌ ఆస్పత్రిలో జుడిషియల్‌ రిమాండ్‌…

ఏసీబీ అరెస్ట్‌ చేయకముందే అచ్చెం నాయుడుకు ఫైల్స్‌ ఆపరేషన్‌ జరిగింది. రోడ్డు మార్గాన ఆయన్ను శ్రీకాకుళం నుంచి విజయవాడకు తీసుకురావడంతో పచ్చిగా ఉన్న గాయం నుంచి రక్తస్రావం జరిగిందని గుంటూరు సర్వజన ఆస్పత్రి వైద్యులు నిర్థారించారు. అరెస్ట్‌ అయిన తర్వాత వారం రోజులు చికిత్స అందించిన గుంటూరు సర్వజన ఆస్పత్రి వైద్యులు.. గాయం మానకపోవడంతో మరో సర్జరీ అవసరం అని గుర్తించి చేశారు. దాని తాలుకూ గాయం మానిందని జూలై 1వ తేదీన డిశ్చార్జి చేశారు. జూలై 8వ తేదీ ఉదయం వరకూ విజయవాడ జైలులో ఉన్న అచ్చెం నాయుడు.. తనకు గాయం ఇంకా తగ్గలేదని హైకోర్టులో పిటిషన్‌ వేసి.. ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలని కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు గుంటూరులోని రమేష్‌ ఆస్పత్రికి తరలించేలా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అంతుచిక్కని ప్రశ్నలు..

రమేష్‌ ఆస్పత్రిలో చేరి 36 రోజులువుతోంది. అప్పటికే ఆపరేషన్‌ జరిగి దాదాపు రెండు వారాలు కావస్తోంది. అయినా అచ్చెం నాయుడు ఫైల్స్‌ తగ్గలేదా..? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. అసలు అచ్చెం నాయుడు ఆరోగ్యం ఎలా ఉంది..? ఫైల్స్‌ తగ్గేందుకు చేసిన ఆపరేషన్‌ తాలూకూ గాయం మానిందా..? లేదా..? అనే విషయాలు ఇప్పటి వరకూ బయట ప్రపంచానికి తెలియదు. రమేష్‌ ఆస్పత్రికి వెళ్లిన తర్వాత ఇప్పటి వరకూ అచ్చెం నాయుడును బయట వ్యక్తులు ఎవరూ అధికారికంగా వెళ్లి చూడలేదు. అచ్చెం నాయుడు బయటకు అధికారికంగా వచ్చినట్లు సమాచారం లేదు. అలాంటిది అచ్చెం నాయుడుకు వైరస్‌ ఎలా సోకిందనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. హోం క్వారంటైన్‌ మాదిరిగా.. జుడిషియల్‌ రిమాండ్‌లో ఆస్పత్రిలో ఉన్న అచ్చెం నాయుడుకు వైరస్‌ ఎలా సోకిందన్న అంశంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అనధికారికంగా ఆయన్ను కలిసేందుకు బయట వ్యక్తులు వెళ్లారా..? లేక అచ్చెం నాయుడే బయటకు వచ్చి వెళుతున్నారా..? లేక ఆస్పత్రి సిబ్బంది ద్వారా సోకిందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Read Also: అచ్చెం నాయుడు ఆరోగ్యంపై ఆందోళన..!

Show comments