iDreamPost
android-app
ios-app

చివరి బంతి వేసి నేటికీ ఆరేళ్ళు – ముఖ్యమంత్రి క్లీన్ బౌల్డ్

చివరి బంతి వేసి నేటికీ ఆరేళ్ళు – ముఖ్యమంత్రి క్లీన్ బౌల్డ్

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వేదికైన భారత పార్లమెంట్లో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షం బిజెపి కలసి ఆడిన ఈ నాటకంలో తెలుగు ప్రజల హృదయాలు తీవ్రంగా గాయపడ్డాయని, తెలుగు ప్రజల భవిష్యత్ ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అంధకారం చేసిందని ఆరోపిస్తూ.. అన్యాయంగా, అప్రజాస్వామికంగా పార్లమెంట్ తలపులు మూసేసి రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించినందుకు నిరసనగా తానూ కాంగ్రెస్ పార్టీకి, తన ముఖ్యమంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు సమైఖ్య ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సరిగ్గా ఆరేళ్ళ క్రితం ఇదే రోజు తానూ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

1962 నుండి తమ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో విడదీయరాని అనుబంధం ఉందని, ఈ బంధం అంత ఈజీగా తెంచుకోలేనని, అయినప్పటికీ రాష్ట్ర విభజన ఆపలేకపోయానని, తెలుగు ప్రజలను కాపాడలేకపోయానని, అందువల్లే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణా ప్రజల ఆకాంక్షలకు తాము వ్యతిరేకం కాదని అయితే జరగబోయే నష్టాలను ఆపడానికి పోరాటం చేయవలసి వచ్చిందని తెలిపారు.తనకి తన రాజకీయ భవిష్యత్తే ముఖ్యం అనుకుని ఉంటే తానూ రాజీనామా చెయ్యకుండా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేవాడినని, కానీ తెలుగు ప్రజలకు నష్టం జరుగుతుందనే తాను కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చానని తెలిపారు. తనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెసు పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు.

ఏదేమైనా ముఖ్యమంత్రి 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చరిత్ర లో నిలిచిపోయారు. రాష్ట్ర విభజన ఆపడానికి కిరణ్ కుమార్ రెడ్డి చివరి నిమిషం వరకు చెయ్యని ప్రయత్నం లేదు. స్టిక్ పట్టారు… నీళ్ల పంపకాలు వివాదాలు పై గంటలకొద్దీ లెక్చర్లు ఇచ్చారు. ఎవరు ఆందోళన పడవద్దని, లాస్ట్ బాల్ ఇంకా పడలేదని.. చివరినిమిషంలో తానేంటో చూస్తారని చివరివరకు ఊదరగొట్టారు. ( క్రికెట్ ని బాగా ఇష్టపడే కిరణ్ కుమార్ రెడ్డి స్వతహాగా మాజీ రంజీ క్రికెటర్ కావడంతో.. అప్పట్లో తనతో ఉన్న క్యాడర్ లో జోష్ నింపడానికి చివరి బాల్ పడేలోపు తానేంటో చూపిస్తానని క్రికెట్ కు సంబందించిన పర్యాయ పదాలని తరచూ వాడేవాడు. ఈ నేపథ్యంలోనే ఆ “లాస్ట్ బాల్” ఎపిసోడ్ అప్పట్లో మీడియాలో బాగా పాపులరైంది) ఎదేమైనప్పటికీ తన హాయంలో సమైక్యవాదాన్ని తెరపైకి తేవడం, హై కమాండ్ కి నివేదికలిస్తూ రాష్ట్ర విభజనని అడ్డుకొనే ప్రయత్నం చేస్తూ చివరి నిమిషం వరకు తీవ్రంగా పోరాడినప్పటికీ చివరికి మాత్రం తన ప్రయత్నంలో కిరణ్ కుమార్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యాడు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హఠాన్మరణం తరువాత, తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొణిజేటి రోశయ్యని అధిష్టానం నియమించింది. అయితే తన వృద్దాప్యం దృష్యా ముఖ్యమంత్రి భాద్యతలు సమన్వయం చేసుకోవడం కొంత భారం కావడం, మరోపక్క వైయస్ జగన్ కొత్త పార్టీ పెట్టడంతో, రాజకీయంగా సరైన అభ్యర్థి కోసం వెతుకులాడిన కాంగ్రెస్ అధిష్టానం 2010 నవంబర్ 25 న అప్పటి స్పీకర్ గా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ని ముఖ్యమంత్రిగా నియమించింది. అప్పటినుండి ఆయన 2014 ఫిభ్రవరి 17 వరకు తన పదవిలో కొనసాగారు. అయితే ఎలాంటి వివాదాలకు తావులేని రాజకీయ జీవితం, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని వ్యక్తిగత చరిత్ర, ఏదైనా ముక్కుసూటిగా చెప్పే మనస్తత్వం, కీలక సందర్భాల్లో కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సైతం వెనుకంజ వేయని మనస్తత్వమే ఆయనను ఈ స్థాయికి చేర్చిందని చెప్పొచ్చు.

ముఖ్యమంత్రి పదవికీ రాజీనామా చేశాక కిరణ్ కుమార్ రెడ్డి జై సమైఖ్యాంధ్ర పార్టీ పేరుతొ కొత్త పార్టీ పెట్టి పోటీ చేసినప్పటికీ.. పాత కాంగ్రెస్ క్యాడర్ ఎవరూ ఆయన వెంట పయనించలేదు. క్యాడర్ తో పాటు ఎక్కువమంది నాయకులు సైతం జగన్ పెట్టిన వైసిఫై వైపు వెళ్లగా, కొందరు నాయకులు మాత్రం కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. జిల్లాలో చెప్పుకోదగ్గ నేతలెవ్వరూ కిరణ్ స్థాపించిన జై సమైఖ్యాంధ్ర పార్టీ లో చేరడానికి మొగ్గు చూపకపోవడంతో, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ దారుణ ఓటమిని చెవి చూసింది. స్వతహా గా మంచి మేధావి అయినప్పటికీ.. జనంలో మాస్ ఫాలోయింగ్ లేకపోవడం, రాష్ట్ర విభజనను ఆపలేకపోయారనే అపప్రద ప్రధానంగా కిరణ్ ఓటమికి కారణం. తరువాత కొన్నాళ్ళు స్తబ్దుగా ఉన్నప్పటికీ, తరువాత ఆయన పాలనా పార్టీలో చేరతాడు అంటూ పలు ఊహాగానాలు వచ్చినప్పటికీ, చివరికి రాహులా గాంధీ సమక్షంలో తిరిగి కాంగ్రెస్ పార్టీలోనే చేరారు. అయినా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే వుంటున్నారు.

ఆయన రాజకీయ నేపధ్యాన్ని ఒకసారి పరిశీలిస్తే తండ్రి అమరనాథరెడ్డి 1987లో మృతి చెందిన తరువాత, 1988లో వాయల్పాడు ఉప ఎన్నికల్లో తల్లి నల్లారి సరోజమ్మ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయింది. 1989 సాధారణ ఎన్నికల్లో మొదటి సారి కిరణ్ పోటీ చేసి గెలిచాడు. 1994లో భారీ తేడాతో ఓటమి చవిచూచినా, 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేశాడు. 2004లో ప్రభుత్వ చీఫ్ విప్‌గా, 2009లో అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యాడు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర నాయకత్వ పగ్గాలు చేపట్టిన తర్వాతే రాష్ట్ర మీడియా దృష్టిని ఆకర్షించారు. రాజకీయంగా నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కర రెడ్డిలతో సన్నిహితంగా వుండేవాడు. వై.యస్.రాజశేఖరరెడ్డితో మొదట్లో విరోధమున్నా, తర్వాత ఆయనకు సన్నిహితమయ్యాడు.