iDreamPost
android-app
ios-app

ప్రతి ఏటా లాక్‌డౌన్‌ను సాంప్రదాయంగా పాటిస్తున్న ఆ దీవి

ప్రతి ఏటా లాక్‌డౌన్‌ను సాంప్రదాయంగా పాటిస్తున్న  ఆ దీవి

నేటి నుండి దేశంలో లాక్‌డౌన్‌ 4.0 అమలులోకి వస్తుంది.అయితే ప్రపంచంలో ఒక ప్రాంతానికి లాక్‌డౌన్‌ కొత్తేమీ కాదు. క్రీస్తుశకం 78లో ఆనాటి భారత చక్రవర్తి కనిష్కుడు స్థాపించిన సాకా సామ్రాజ్యం విస్తరించిన ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో ప్రతి ఏటా ” న్యేపీ డే ” పేరిట లాక్‌డౌన్‌ పాటించే చిత్రమైన సాంప్రదాయం ఉంది.

ఇండోనేషియా మొత్తం మీద 90 శాతం ముస్లిం జనాభా ఉండగా, హిందువులు మెజారిటీగా ఉండే బాలి ద్వీపంలో ఈ సాంప్రదాయం కొనసాగుతుండడం విశేషం.ఇక అసలు విషయంలోకి వస్తే బాలి నూతన సంవత్సర ప్రారంభానికి మూడు రోజుల ముందు ప్రజలు భారీ వేడుకలు జరుపుకుంటారు.ఈ వేడుకలలో భాగంగా రాక్షసుల ఆకారంలో పెద్ద పెద్ద బొమ్మలు తయారు చేసి డప్పుల మోతల మధ్య ఊరేగిస్తారు. తరువాత ఈ రాక్షస బొమ్మలకు జంతువులను బలి ఇవ్వటంతో పాటు పచ్చి మాంసం,గుడ్లు, మద్యంతో రకరకాల నైవేద్యం సమర్పిస్తారు.

తమ పూజలతో శాంతింప చేసిన రాక్షసులను తమ ప్రాంతాల నుంచి బయటకు సాగనంపేందుకు కాగడాలను చేతపట్టి పెద్ద పెద్దగా కేకలు వేస్తూ పరుగులు పెట్టి ఊరి బయట వదిలివేసి వస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత రోజే ” న్యేపీ డే “. సాకా క్యాలెండర్ ప్రకారము కడస(10 వ నెల) మొదటి తారీఖున జరుపుకునే నూతన సంవత్సర ప్రారంభ రోజు బాలి ద్వీపంలో ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం అవుతారు. ఆ రోజు 24 గంటల పాటు అన్ని రకాల కార్యకలాపాలకు దూరంగా ఉంటారు.ఆఫీసులు, వ్యాపార దుకాణాలు అన్ని మూసివేస్తారు.విందు,వినోద కార్యక్రమాలన్నిటిని రద్దు చేసుకుంటారు. ప్రజా రవాణాను స్తంభింపచేయడంతో పాటు విమానాశ్రయాలను కూడా మూసివేస్తారు.

ఇళ్లలోనే ఉండే ప్రజలు కొంతమంది ఉపవాసం పాటిస్తారు. అత్యవసరమైతే తప్ప మొబైల్ ఫోన్లు కూడా చివరకు వాడరు. ఈ ‘న్యేపీ డే’ కు సంబంధించి ఒక ప్రత్యేక చట్టం కూడా ఆ దీవిలో అమల్లో ఉంది. ఈ చట్టం నిబంధనలు ఎవరు ఉల్లంఘించకుండా పోలీసులు ఆరోజు వీధులలో గస్తీ కాస్తున్నారు.

ఈ సాంప్రదాయం ఎందుకు అంటే….

తమ ప్రాంతాల నుంచి బయటకు సాగనంపిన రాక్షసులు పొరపాటున మరలా వెనుకకు తిరిగి వస్తే దీవిలో ప్రజలెవరూ లేరనుకుని మరో ఏడాది దాకా ఇచ్చటకు రావటం వృధా అనుకొని వెళ్లిపోతాయి అనేది స్థానికంగా బలపడిన ఒక నమ్మకం.అయితే యాంత్రిక జీవనానికి అలవాటు పడిన ప్రజలు కనీసం ఏడాదికి ఒకసారైనా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపటం అనేది ఈ ఆచారంలోని ఒక అందమైన అనుభూతి.ఆ రోజంతా టీవీలు,ఇంటర్నెట్ లు దూరంగా పెట్టి కుటుంబంతో గడిపితే పునరుత్తేజం పొంది భవిష్యత్తులో తమ కార్యకలాపాలలో రెట్టింపు ఉత్సాహంతో పాల్గొంటారని అక్కడి కొంతమంది ప్రజల అభిప్రాయం.

ఇలాంటి ఆచారం మనలాంటి దేశంలో కూడా ఆచరణలోకి వస్తే కనీసం ఒక రోజైనా సకలం బంద్ చేసి కుటుంబంతో ఆనందంగా గడిపే అవకాశం వస్తుంది. పైగా వ్యాపార లావాదేవీలు మూతపడటంతో కర్బన ఉద్గారాలు తగ్గి పర్యావరణ పరిరక్షణతో పాటు గాలి స్వచ్ఛత కూడా పెరిగే అవకాశం ఉంది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ వలె కాకుండా పాలకులు కూడా ప్రజా సంక్షేమానికి పాటుపడుతూ ‘న్యేపీ డే’ లాంటి సాంప్రదాయిక లాక్‌డౌన్‌ను ప్రవేశ పెట్టాలని మనం కూడా కోరుకుందాం.