iDreamPost
android-app
ios-app

అదే కారణం.. ఇప్పుడెలా..?

  • Published Dec 17, 2020 | 3:04 AM Updated Updated Dec 17, 2020 | 3:04 AM
అదే కారణం.. ఇప్పుడెలా..?

ఏలూరులో వింత వ్యాధికి కారణాలు ఎట్టకేలకు వెలుగులోకొచ్చాయి. దాదాపు 14 బృందాలు ఈ వ్యాధికిసంబంధించిన మూలాలను కనిపెట్టేందుకు రంగంలోకి దిగిన విషయం విదితమే. అప్పటి వరకు బాగానే ఉన్న వ్యక్తులు ఉన్నట్టుండి అపస్మారక స్థితిలోకి జారుగుతున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలో కూడా అటెన్షన్‌ను క్రియేట్‌ చేసిందీ ఘటన. దీంతో ఏలూరు ఒక్కసారిగా జాతీయ వార్తాకథనాల్లో భాగమైపోయింది.

అయితే ఎయిమ్స్‌ బృందం, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్స్, ఎన్‌ఈఈఆర్‌ఐ తదితర సంస్థలు ఇచ్చిన నివేదికల్లో బాధితుల్లో కలుగుతున్న మార్పులకు పురుగుమందుల అవశేషాలే కారణమని తేల్చేసారు. బాధితులతో పాటు, వారి బంధువుల రక్తంలో కూడా ఎండోసల్ఫాన్, డీటీటీ వంటి పురుగుమందుల అవశేషాలను గుర్తించారు. అంటే ఇప్పుడు ఆసుపత్రులకు వచ్చిన వారిలోనే కాకుండా ఎటువంటి అస్వస్థతకు గురికాని వారిలో కూడా అవశేషాలను గుర్తించారన్న మాట. అయితే ఇప్పుడు బాధితులగా మారిన వారిపై వాటి ప్రభావం ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. బాధితుల శరీరాల్లోకి చేరిన ఈ అవశేషాలు కారణంగా ఏర్పడే లక్షణాలే వారిలో గుర్తించారు. న్యూరో టాక్సిన్‌గా పిలవబడే ఇవి బహురూపాల్లో శరీరంలోకి చేరేందుకు అవకావం ఉంటుంని నిపుణులు చెబుతున్నారు. ఒక సారి శరీరంలోకి చేరిన తరువాత వీటి పరిమాణాన్ని బట్టి వెంటనేగానీ, కొంత ఆలస్యంగా గానీ వీటి ప్రభావం చూపుతాయని వివరిస్తున్నారు. దీంతో ఏలూరులో బాధిత రోగుల శరీరాల్లోకి దశలవారీగానే ఇవి చేరి ఉంటాయన్న అనుమానాన్ని కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇవి వారి శరీరాల్లోకి ఎలా చేరుతున్నాయన్న మరో ప్రశ్న ఇప్పుడు మొదలైంది. దీనిపై దీర్ఘకాలికంగా పరిశోధన అవసరపడుతుందని నిపుణులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో తేల్చి చెప్పారు. అయితే అంతుచిక్కని వ్యాధిగా ఇప్పటి వరకు అందోళన కల్గించిన ఈ వ్యాధికి మూలకారణంగా తెలిసిన నేపథ్యంలో దాన్నుంచి బైటపడేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై ఇప్పుడు ప్రభుత్వం దృష్టిపెట్టేందుకు ఆస్కారం ఏర్పడినట్టయింది.

నిపుణులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏపీ సీయం వైఎస్‌ జగన్‌ వెంటనే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులకు పలు సూచనలు చేసారు. పురుగుమందుల అవశేషాల కారణంగానే ఇటువంటి పరిస్థితి తలెత్తినట్లు తేలిని నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సేంద్రీయ సాగు విధానాలపై రైతు భరోసా కేంద్రాల ద్వారా విస్తృతంగా రైతులకు అవగాహన కల్పించాని సీయం జగన్‌ చెప్పారు. ప్రతి జిల్లాలో ల్యాబ్‌లను ఏర్పాటు చేయడంతో పాటు క్రమం తప్పకుండా ఆహారాలు, త్రాగునీటిని పరీక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

ఇదిలా ఉండగా గత మూడు రోజులుగా ఏలూరులో ఎటువంటి బాధితులు నమోదు కాలేదని అధికారులు ప్రకటించారు. దీంతో ఏలూరు వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు. 615 మంది అంతుచిక్కని వ్యాధి ప్రభావానికి లోనుకాగా, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.