ఆంధ్రప్రదేశ్ కోటాలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల కోసం జరుగుతున్న ఎన్నికల్లో అయిదుగురు సభ్యులు నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి 151 అసెంబ్లీ స్థానాలున్న వైసిపి ఏకపక్షంగా నాలుగు రాజ్యసభ స్థానాలను గెలుచుకొనే అవకాశం ఉండడంతో ఆపార్టీ తరుపున పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ, ఆళ్ల అయోధ్యరామి రెడ్డి, పరిమళ్ నత్వాని ని బరిలోకి దించింది. అయితే అనూహ్యంగా తెలుగుదేశం ఐదో అభ్యర్థిని రంగంలో దించడంతో ఏప్రిల్ 26 న పోలింగ్ తప్పని అనివార్య పరిస్థులు ఏర్పడ్డాయి.
సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ ఆధ్వర్యంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో సోమవారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. పోటీచేస్తున్న అభ్యర్ధులందరి నామినేషన్ పత్రాలు సక్రమంగానే ఉన్నాయని రిటర్నింగ్ అధికారి బాలకృష్ణమాచారి తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ మార్చి 18 కి ఇంకా కేవలం ఒక్కరోజు మాత్రమే గడువుండడంతో ఇక ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం పార్టీల బలాబలాలని బట్టి వాస్తవానికి తెలుగుదేశానికి ఒక్క రాజ్యసభ సీటు కూడా గెలుచుకొనే బలం లేనప్పటికీ చంద్రబాబు నాయుడు తమ పార్టీ తరపున వర్ల రామయ్యను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించి రాష్ట్రంలో ఏకగ్రీవం కావాల్సిన రాజ్యసభ ఎన్నికలను పోలింగ్ వైపు నడిపిస్తున్నారని చెప్పక తప్పదు. దానికి చంద్రబాబు చెబుతున్న కారణాలు ఏవైనప్పటికీ అవన్నీ రాజకీయపరమైనవే తప్ప వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ తరపున కేవలం నామినేషన్ దాఖలు చేయడానికి కావాల్సిన 20 మంది సభ్యుల బలం మాత్రమే ఉందనేది బహిరంగ రహస్యం. ఇప్పటి ఎన్నికల్లో మొత్తం 175 మంది శాసన సభ్యుల్లో తమ అభ్యర్థిని గెలిపించుకోవాలంటే కనీసం 44 మంది సభ్యులు అవసరం.
కాకపొతే తెలుగుదేశం పోటీ చెయ్యడం వెనుక ఆపార్టీకి రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయి. రాజ్యసభ ఎన్నికలు జరిగితే ఎన్నికలో ఓటువేసే తమ అభ్యర్థులకు పార్టీ విప్ జారీ చేస్తుంది. పార్టీ విప్ జారీ చేస్తే పార్టీ ఎమ్మెల్యేలంతా పార్టీ తరుపున పోటీలో ఉన్న అభ్యర్ధికి ఓటు వెయ్యాల్సిందే. అయితే ఇటీవల కాలంలో తెలుగుదేశానికి తరపున గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు వైసిపి కి సన్నిహితంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో వాళ్ళు అధికారికంగా తెలుగుదేశం సభ్యులే కాబట్టి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం వారు ఓటు ఎటు వేస్తారో లేదో చూడాలి. ఒకవేళ తెలుగుదేశం జారీ చేసిన విప్ ని ఉల్లంఘిస్తే వారిమీద పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద నోటీసులు జారీ చేయవచ్చు.
ఏదిఏమైనా ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించక ఇప్పటివరకు జరిగిన అన్నీ రాజ్యసభ ఎన్నికలలో తెలుగుదేశం ఎప్పుడు పోటీ కి దూరంగా లేదు. ఒకవేళ ఈసారి చంద్రబాబు పార్టీ తరుపున అభ్యర్థిని బరిలో దించని పక్షంలో మొదటిసారి తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండవలసిన పరిస్థితి వచ్చేది. బహుశా చంద్రబాబు ఆ అపప్రద ఎదుర్కోవడానికి సిద్ధంగా లేడేమో!!
అదేసమయంలో ప్రస్తుతం రాజ్యసభలో తెలుగుదేశానికి ఎన్నడూలేనంత తక్కువ బలం వుంది. తెలుగుదేశం పార్టీ తరుపున గెలిచిన పలువురు రాజ్యసభ సభ్యులు బిజెపి తీర్ధం పుచ్చుకోవడంతో ప్రస్తుతం తెలుగుదేశం తరుపున కనకమేడల రవీంద్ర బాబు ఒక్కడే రాజ్యసభలో ఆ పార్టీకీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.