Idream media
Idream media
ఎమ్మెల్సీ పదవికి డొక్కా మాణిక్య వరప్రసాద్ రావు రాజీనామా చేయడంతో ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. వచ్చే నెల 6వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది. శాసన సభ కోటాలో ఖాళీ అయిన ఈ స్థానానికి ఈ నెల 18వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 26న నామినేషన్ల పరిశీలన, 29వ తేదీ వరకూ ఉససంహరణకు గడువు ఉంటుంది. పోటీలో ఒకరు కంటే ఎక్కువ మంది ఉంటే జూలై 6వ తేదీన పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. లేదంటే ఏకగ్రీవమైనట్లు ప్రకటిస్తారు.
175 సీట్లు గల శాసన సభలో వైఎస్సార్‌సీపీ బలం 151 సీట్లు. టీడీపీకి 23 సీట్లు ఉన్నా.. ముగ్గురు ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. జనసేనకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. సభలో వైసీపీకి తిరుగులైని బలం ఉండడంతో ఈ ఎన్నికల ఏకగ్రీవకం కానుంది. టీడీపీ పోటీ చేసే ఆలోచనే చేయకపోవచ్చు. రాజ్యసభ సీట్లకు చేసినట్లు ఎమ్మెల్సీ సీటుకు చేసినా.. అది నామమాత్రమే అవుతుంది.
టీడీపీ హాయంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలం 2023 మార్చి వరకూ ఉంది. అయితే ఈ ఏడాది మార్చిలో ఆయన తన పదవికి, టీడీపీకి రాజీనామా చేశారు. ఆ రాజీనామాను శాసన మండలి చైర్మన్ ఆమోదించడంతో ఉప ఎన్నిక ఏకగ్రీవమైంది. ఖాళీ అయిన స్థానానికి ఆరు నెలల్లో ఉప ఎన్నికల నిర్వహించాల్సి రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్‌ను ప్రకటించింది.