Idream media
Idream media
కారణాలు ఏమైనా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాలు (నెలన్నర)పాటు వాయిదా పడ్డాయి. దీని ప్రభావం అనేక అంశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సాధారణ పరిపాలన మినహా మరే కీలక నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ప్రస్తుతం దాపురించింది. ఆరు వారాల తర్వాత ఎన్నికలు ప్రారంభమైతే కనీసం 20 రోజుల పాటు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అంటే దాదాపు రెండు నెలలకు పైగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. కరోనా ప్రభావం తగ్గి, ఎన్నికలు జరిగితే మే నెల మొదటి వారానికి ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. ప్రారంభ దశలో ఉన్న కరోనా వైరస్ ప్రభావం రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో అంచనాలకు అందడంలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుందనేని మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.
ఎన్నికలు వాయిదా పడడం వల్ల ప్రధానంగా రెండు నష్టాలు జరుగుతున్నాయి. ఒకటి రాష్ట్ర బడ్జెట్. రెండోది పురపాలికలు, పంచాయతీలకు రావాల్సిన 5800 కోట్ల నిధులు త్రిశంకుస్వర్గంలో పడతాయి.
ఈ నెల 29వ తేదీ నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేసి మరుసటి రోజు అంటే.. మార్చి 30న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసుకుంది. స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి వచ్చే వేల కోట్ల రూపాయలను కోల్పోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఏకబిగిన స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహణకు వెళ్లింది. మండల, జిల్లా, మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా పకడ్భందీగా చర్యలు చేపట్టింది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో ప్రభుత్వ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. కేంద్రం నిధులు మురిగిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇక రాష్ట్ర బడ్జెట్ పరిస్థితి ఏమిటన్నది ఆర్ధిక శాఖ అధికారులకు అంతుచిక్కడంలేదు.
ఆర్థిక ఏడాది ముగిసే మార్చి నెల లోపు బడ్జెట్‌కు సంబంధించిన ప్రక్రియ అంతా ముగియాలి. బడ్జెట్ సమావేశాలు నిర్వహించి, బడ్జెట్‌ను ప్రవేశపెట్టి.. చర్చ.. ఆపై ద్రవ్యవినిమయ బిల్లుకు సభ ఆమోదంతో సమావేశాలు ముగుస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో మార్చి, ఏప్రిల్ నెలల్లో సమావేశాలు నిర్వహించుకునే వెలుసుబాటు ఉంది. ఈ వెలుసుబాటుతోనే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లింది. ఈ నెల 29 ఆదివారం నాడు పంచాయతీ రెండో దశ ఎన్నికల పోలింగ్, ఫలితాలు వెల్లడవుతాయి. ఆ తర్వాత పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక ఉన్నా కమిషనర్ అనుమతితో సమావేశాలు నిర్వహించుకోవచ్చనే ఉద్దేశంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ నిర్ణయం శరాఘాతంలా మారిందని చెప్పవచ్చు.
ఎన్నికలు వాయిదా వేయడంతో రెండు నెలలకు పైగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది. ఈ నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే జరిగితే నాలుగు నెలల బడ్జెట్‌కు అవసరమైన అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణ ఎన్నికలు జరిగే ఏడాదిలోనే ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు వెళుతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి నెలకొంది.
స్థానిక సంస్థలకు రావాల్సిన వేల కోట్ల రూపాయలు, రాష్ట్ర బడ్జెట్, పరిపాలన, సంక్షేమ పథకాలు, వేసవి కాలంలో తలెత్తే ఇబ్బందులను అర్థం చేసుకోకుండానే.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అసాధారణ నిర్ణయం తీసుకున్నారనుకోవచ్చా..? ఏమైనా తన విచక్షణాధికారంతో తీసుకున్న నిర్ణయంతో రమేష్‌కుమార్ రాష్ట్ర సీఎంతో సహా మంత్రుల నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొవాల్సిన పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు.