iDreamPost
android-app
ios-app

ఎంపీల్లారా మీ ఎన్నికల లెక్కలు చెప్పండి..

ఎంపీల్లారా మీ ఎన్నికల లెక్కలు చెప్పండి..

దేశవ్యాప్తంగా పలు దఫాలుగా పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయి. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత శీతాకాల సమవేశాలతోపాటు బడ్జెట్ సెషన్ కూడా ముగియనుంది.. అయితే ఈ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఎంతఖర్చు పెట్టారో చాలామంది ఇప్పటివరకు లెక్క చెప్పలేదట.. దేశంలో మొత్తం 80 మంది ఎంపీలు అసలు లెక్కలు చూపలేదని, ఇందులో మన తెలుగు ఎంపీలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల వాచ్ అనే సంస్థ ఈ వివరాలు ప్రకటించింది. లెక్కలుచూపని ఎంపీల్లో ఏపీ, తెలంగాణకు చెందిన 17మంది ఎంపీలు ఉన్నారని, ఏపీకి చెందినవారు 15మంది ఉంటే, తెలంగాణకు చెందిన వారు ఇద్దరు ఉన్నట్టు తెలిపింది.

ఎప్పుడైనా ఎన్నికలు ముగిసిన 90రోజుల్లోపే ఎంపీలు ఈసీకి ఎన్నికల్లో చేసిన ఖర్చలను తెలియపరచాలి. అయితే ఇప్పటివరకూ 80మంది ఎంపీలు ఎన్నికల సంఘానికి లెక్కలు చూపకపోగా వీరిలో తెలుగు రాష్ట్రాలనుండి 17మంది ఎంపీలు లెక్కలు చూపలేదట. వీరిలో వైసీపీకి చెందిన కనుమూరి రఘు రామకృష్ణంరాజు, మాధవి, ఎంవీవీ సత్య నారాయణ, వైఎస్ అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, రెడ్డప్ప, బల్లి దుర్గాప్రసాద్, వెంకట సత్యవతి, బ్రహ్మనందరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, సంజీవ్ కుమార్, లావు శ్రీకృష్ణదేవరాయ, శ్రీనివాస్ రెడ్డి టీడీపీకి చెందిన గల్లా జయదేవ్, కింజరపు రామ్మోహన్ నాయుడు ఉన్నారని, తెలంగాణకు చెందిన ఇద్దరు ఎంపీలు ఈసీకి తమ ఖర్చుల వివరాలను చెప్పలేదు..

నిజామాబాద్ బీజేపీ నుండి గెలిచిన ధర్మపురి అరవింద్, మెదక్ నుండి గెలిచిన టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి వీరిలో ఉన్నారు. వీరంతా ఎలక్షన్‌లో గెలిచిన 90రోజుల్లో ఖర్చు వివరాలను ఈసీకి సమర్పించాల్సి ఉన్నా ఇప్పటి వరకు సమర్పించకపోవడంతో ఈసీ సీరియస్ అయ్యింది.. ఖర్చు ఫైల్ చేయకుంటే తమకు చర్యలు తీసుకునే హక్కు ఉందని హెచ్చరించింది. అఫిడవిట్ దాఖలుచేయని ఎంపీల ఎన్నిక రద్దుచేసే అవకాశం కూడా ఉందని పేర్కొంది. అధిక ఖర్చుల విషయం బయటపడుతుందనే భయం ఎంపీల్లో ఉండటంతోనే లెక్కలు చెప్పలేదనే వాదన వినిపిస్తోంది. కాగా ఈ అంశంపై ఎలక్షన్ వాచ్ కన్వీనర్ వీవీ రావు ఎంపీల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు.