Idream media
Idream media
ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతం.. ప్రస్తుతం దేశ రాజధానిలోని ఈ పేరు చెబితే ఇప్పుడు యావత్ భారతదేశం వణికిపోతోంది.. కొద్దిరోజుల క్రితం డిల్లీ నిజాముద్దీన్ లోని మర్కజ్ మత ప్రార్థనలకు హాజరైన వారిలో చాలామందికి కరోనా సోకింది. అక్కడికి వెళ్లొచ్చిన వారిలో భారీగానే తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉండడంతో ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. ఏపీకి సంబంధించి ఢిల్లీ వెళ్లొచ్చిన పలువురికి కరోనా టెస్ట్ లు చేయగా పాజిటివ్ వచ్చింది. అయితే తెలంగాణలో మాత్రం ఏకంగా ఈ మహమ్మారి బారినపడి ఆరుగురు చనిపోయారు. ఈక్రమంలో ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చినవారిపై తెలుగు ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి సారించాయి.
అయితే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కూడా ఢిల్లీలోని ఇస్లామిక్ మత ప్రార్థనకు హాజరయ్యారని, వచ్చిన తర్వాత NPR అంశంపై రాష్ట్రంలోని ముస్లిం మత పెద్దలతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో సమావేశమయ్యారంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో సోషల్ మీడియాలో అంజాద్ బాషాను విమర్శిస్తున్నారు.
అయితే ఈ వార్తలను అంజాద్ బాషా తీవ్రంగా ఖండించారు. తనపై ఎవరో ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇలాంటి ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. ఈ విషయంలో చట్టపరంగా క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు అలాంటి వార్తలు స్ప్రెడ్ చేసినవారిపై పరువు నష్టం దావా వేస్తానన్నారు.
ఈ విషయంలో ఆయన ఏమన్నారంటే.. నాపై, ఏపీ ప్రభుత్వంపై పచ్చ మీడియా భారీ కుట్రకు తెరలేపింది. ఇలాంటి జాతి విపత్కర పరిస్థితుల్లోనూ బాధ్యతాయుతంగా ఉండాల్సిన పలు మీడియా చానళ్లు కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నాయి. నేను ఈ నెల 2న ముస్లింలకు వైఎస్సార్ ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్ కేసు విషయమై ఢిల్లీ వెళ్లానే కానీ నేను అక్కడి మత ప్రార్థనలకు వెళ్లినట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారు.
నేను ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎంను.. నాకు ప్రోటోకాల్ ఉంటుంది కదా.. ఆ ప్రోటోకాల్ లో నా ప్రతీ అడుగు నమోదవుతుంది. ఆరోజు మొత్తం నేను ఏపీ భవన్ లొనే ఉన్నాను. ఆ తర్వాతి రోజు వచ్చి ముఖ్క్ష్మంత్రిగారిని కలిశాను. 4వ తేదీన జరిగిన క్యాబినేట్ సమావేశంలోనూ పాల్గొన్నాను. ఆ తర్వాత కడప వెళ్లి ఎన్నికల పనులు చూసుకోవడం జరిగిందన్నారు. ఇదంతా విపత్కర కరోనా సమయంలో ప్రభుత్వాన్ని, సీఎం జగన్ గారిని, తనను ఇబ్బంది పెట్టాలని పచ్చ మీడియా కుట్ర పన్నిందని వ్యాఖ్యానించారు. అలాగే ఈ విషయంలో చట్టపరంగా క్రిమినల్ కేసు పెడతానని, పరువు నష్టం దావా వేయనున్నానని వెల్లడించారాయన.