డబ్బింగ్ హిట్టు – అయినా రీమేక్ కొట్టు – Nostalgia

ఒక భాషలో సినిమా హిట్ కాగానే మనవాళ్ళు డబ్బింగ్ చేయడమో లేక రీమేక్ హక్కులు కొనడమో ఎప్పుడూ జరిగేదే. జాను దాకా టాలీవుడ్ ఇప్పటికే ఎన్నో వేల సినిమాలు పరాయి బాష నుంచి తెచ్చుకుంది. కానీ ఇందులో ఏదో ఒక ప్రక్రియ మాత్రమే జరగడం చూశాం కానీ దానికి భిన్నంగా రెండూ జరగడం అరుదనే చెప్పాలి. అలాంటి ఉదాహరణే ఇది.

1987లో భాగ్యరాజా హీరోగా తమిళ్ లో ఎంగ చిన్న రాస అనే సూపర్ హిట్ సినిమా వచ్చింది. రాధ హీరోయిన్. హీరో అమ్మగా చేసిన సిఆర్ సరస్వతికి చాలా పేరు వచ్చి బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయారు. శంకర్ గణేష్ సంగీతం కూడా మంచి హిట్టు. తల్లి పాత్రను నెగటివ్ సెంటిమెంట్ లో చూపిస్తే జనం ఎగబడి చూశారు. కనక వర్షం కురిసింది. అప్పటిదాకా ఎవరూ టచ్ చేయని పాయింట్ కావడంతో సూపర్ గా క్లిక్ అయ్యింది. దీంతో తెలుగులో చిన్నరాజా పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. కట్ చేస్తే ఇక్కడా బాగా ఆడింది.

కొంత గ్యాప్ తర్వాత 1993లో వెంకటేష్ దీని మీద మనసు పారేసుకున్నారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో అబ్బాయిగారు పేరుతో రీమేక్ చేస్తే అదీ సూపర్ హిట్టు అయ్యింది. మీనా హీరోయిన్ గా తల్లి పాత్రలో జయచిత్ర ఒకరికొకరు పోటీపడి మరీ నటించారు. అప్పటికే చిన్నరాజాను చూసిన మనవాళ్ళు దాన్ని మర్చిపోయి మరీ అబ్బాయిగారుని ఆదరించారు. పెద్దగా మార్పులు చేయనప్పటికీ స్టార్ క్యాస్టింగ్ కావడంతో పాటు కీరవాణి సంగీతం చాలా హెల్ప్ అయ్యింది. చంటితో పల్లెటూరి బ్యాక్ డ్రాప్ సినిమాలలో బాగా సూట్ అవుతాడని పేరు తెచ్చుకున్న వెంకటేష్ కు ఆ ఇమేజ్ ప్లస్ అయ్యింది. దీంతో అబ్బాయిగారు రూపంలో మరో హిట్ వెంకీ ఖాతాలో పడిపోయింది.

దీని కన్నా ముందే కన్నడలో అన్నయ్య పేరుతో రవిచంద్రన్ రీమేక్ చేసి అక్కడా విజయం అందుకున్నారు . అసలు వీటికి మూలం 1955లో సి పుల్లయ్య గారు తీసిన అర్ధాంగి సినిమా. దీన్ని ఆధారంగా చేసుకునే 1969లో కన్నడలో మల్లమన పావడ పేరుతో ఓ సినిమా వచ్చింది. దానికి స్క్రీన్ ప్లే పుల్లయ్య గారే ఇచ్చారు. ఇరవై ఏళ్ళ తర్వాత అది ఇలా వివిధ రూపాల్లో భాగ్యరాజా, వెంకటేష్ హీరోలుగా తెలుగు ప్రేక్షకులను అలరించిందన్న మాట.

Show comments