Idream media
Idream media
ముఖ్యమంత్రి జగన్ గారికి తాగుబోతుల సంఘం అధ్యక్షుడు కింగ్‌ఫిషర్ కనకయ్య రాసే లెటర్ ఏమంటే అన్ని వర్గాలని ఆదరిస్తున్న మీరు మా నోటికాడ మందుని అందకుండా చేస్తున్నారు. మీరు ఎన్నికలప్పుడు చెబుతూ ఉంటే మేము నమ్మలేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఇప్పటి వరకూ మా జోలికి వచ్చే సాహసం చేయలేదు. ఒకసారి ఎన్టీఆర్ వచ్చి దెబ్బతిన్నారు. నిజానికి గత ప్రభుత్వాలు మా డబ్బులతోనే సగం నడిచాయి. మీరు కూడా అంతే అనుకుంటే మీరు నేరుగా మా కైపు మీదే కొడుతున్నారు.
8 గంటలకే షాపులు మూసేయమన్నారు. ఎలాగో చచ్చీ చెడీ క్యూలో నిలబడి సరుకు తెచ్చుకుంటున్నాం. మా బ్రాండ్లు లేకుండా చేశారు. బ్రాందీ తాగితే విస్కీలాగా ,విస్కీ తాగితే వోడ్కాలాగా ఉంటున్నా సరే, రంగు రుచితో పనేం ఉంది మాక్కావాల్సిందే కిక్కే కదా అని సర్దుకున్నాం. గత ప్రభుత్వం మాకు పెద్దపీట వేసి పర్మిట్ రూమ్ ఏర్పాటు చేసి నంజుకోడానికి ఊరగాయ, అప్పడం కూడా కాంప్లిమెంట్‌గా ఇచ్చి తాగించేది. మీరేమో షాపు దగ్గర తాగితే , కిక్కు దిగే వరకూ తంతామంటున్నారు. దాంతో క్వార్టర్ జేబులో పెట్టుకుని ఇంటికి పోతున్నాం. బయట మీ పోలీసులు, ఇంట్లో పోలీసుల్ని మించిన పెళ్ళాలు. మీరేమో అమ్మ ఒడి అంటూ డబ్బులు వాళ్ల అకౌంట్‌లో వేశారు. ఇక మా మాట వినేదెవరు? మందు చూస్తే పరక తీసుకుని వస్తున్నారు. దాంతో చెట్ల కింద, పుట్ల కింద తాగి, మా చావు మేము చస్తున్నాం.
సరే ఎలక్షన్లు వస్తున్నాయి, మందు ఖర్చంతా నాయకులు చూసుకుంటార్లే అని సంబరపడితే , ఇదేంది స్వామి, మందు, డబ్బులు పంచితే జైల్లో వేస్తామని అంటా ఉండావు. మా మీద ఇంత కక్ష ఎందుకు జగన్ సార్!
అసలు ఒకప్పుడు మేము ఎట్ల బతికినాం. చంద్రబాబు ధర్మప్రభువు. ప్రతి పల్లెలోనూ నాలుగు బెల్ట్ షాపులు పెట్టించాడు. అర్ధరాత్రి తలుపు తట్టినా సరే మందు బాటిల్ దొరికేది. అసలు తలుపు తట్టే పనికూడా లేదు. ఫోన్ చేస్తే డోర్ డెలవరీనే. నువ్వు మా యూనియన్‌ని తక్కువ అంచనా వేస్తున్నావ్. మందు పడితే మాలో ప్రతి ఒక్కడూ కళాకారుడే. రెండు రౌండ్లు దాటితే ఎవడు ఘంటశాలో, ఎవడు బాలసుబ్రమణ్యమో తెలియదు. మూడు పడితే డిస్కో, భరతనాట్యం అన్నీ చేస్తారు. మేము మా కళారూపాలు ప్రదర్శించి నీకు ఓటు వేయకుండా చేయాలనుకుంటే ఇంట్లో ఆడోళ్లు సంగటి కట్టెతో తరుముతా ఉండారు.
పోలీస్ స్టేషన్లో ఆడ పోలీసులు ఉంటే ఓకే, ఇంట్లో కూడా మీ ధర్మంతో తయారవుతున్నారు. బాధలు మరిచిపోదామంటే టైంకి మందు దొరకదు. చంద్రబాబుని ఓడించినందుకు తాగుబోతులకి దేవుడు సరైన శిక్ష విధించాడు.
ఇట్లు
కైపు దిగిన కింగ్‌ఫిషర్ కనకయ్య