iDreamPost
android-app
ios-app

కరోనా పై పోరుకు విరాళాల వెల్లువ..

కరోనా పై పోరుకు విరాళాల వెల్లువ..

కరోనాపై పోరుకు పలువురు ప్రముఖులు, సెలెబ్రెటీలు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు,నటులు పెద్ద మనసుతో విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే రతన్ టాటా లాంటి ప్రముఖ పారిశ్రామిక వేత్త 1500 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

తాజాగా అదే బాటలో విప్రో అధినేత  అజీమ్‌ ప్రేమ్‌జీ,లక్ష్మీ మిట్టల్ కూడా విరాళాలు ప్రకటించారు. అజీమ్ ప్రేమ్‌జీ రూ.1125 కోట్ల విరాళం ప్రకటించగా లక్ష్మి మిట్టల్ 100 కోట్ల విరాళం ప్రకటించారు.

దేశ సంపన్నుల్లో ఒకరైన అజీమ్‌ ప్రేమ్‌జీ తన ఫౌండేషన్‌ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నది తెలిసిన విషయమే. కాగా కరోనాపై పోరుకు అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ద్వారా రూ.1000 కోట్లు, విప్రో లిమిటెడ్‌ ద్వారా రూ.100 కోట్లు, విప్రో ఎంటర్‌ప్రైజెస్‌ ద్వారా రూ.25 కోట్లు ఇవ్వనున్నట్లు అజీమ్ ప్రేమ్‌జీ వెల్లడించారు.

కాగా మెర్సిడెజ్ బెంజ్ కంపెనీ 1500 బెడ్స్ తో కూడిన తాత్కాలిక ఆసుపత్రిని కరోనా బాధితుల సహయార్ధం పూణేలో నిర్మించనున్నట్లు తెలిపింది. టిక్ టాక్ ఆప్ కూడా రూ.100 కోట్ల విలువైన 4 లక్షల ప్రొటెక్టివ్‌ సూట్లు, మాస్క్‌లను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు అందించడంతో పాటుగా రెండు లక్షల మాస్క్‌లను ఢిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలకు అందించామని టిక్ టాక్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

పీఎం కేర్స్‌ ఫండ్‌కు ఇండియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ రూ.25 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎరువుల కంపెనీలు రూ. 27 కోట్లు విరాళమిచ్చాయి. బీడీఎల్‌ రూ.9.02 కోట్ల విరాళం ఇచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థ బెల్‌ రూ.15.72 కోట్ల విరాళాన్ని ఇచ్చింది. జెమ్స్‌, జువెల్లరీ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ రూ. 21 కోట్ల విరాళం ఇవ్వనున్నట్లు బుధవారం వెల్లడించింది. జిందాల్‌ అల్యూమీనియం రూ. 5 కోట్లు విరాళంగా ప్రకటించింది. సీజేఐ సహా సుప్రీంకోర్టు జడ్జిలందరూ తలో 50 వేలను విరాళమిచ్చారు.
లోక్‌సభ సచివాలయ సిబ్బంది ఒక రోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు.