iDreamPost
android-app
ios-app

మెజారిటీ బ్రేక్ చేస్తారా..?

  • Published May 01, 2021 | 3:56 PM Updated Updated May 01, 2021 | 3:56 PM
మెజారిటీ బ్రేక్ చేస్తారా..?

ఐదు రాష్ట్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి ఉప ఎన్నిక ఇదే కావడంతో.. అధికార, ప్రతిపక్షాలు తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే విజయం ఎవరిదన్నదానిపై ఎవరికీ సందేహాలు లేకపోవడమే ఈ ఉప ఎన్నిక విశేషం.

ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం, జనసేన మద్దతుతో బీజేపీ సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేసినా.. అదంతా రెండో స్థానం కోసమేనన్నట్లు సాగింది. విజయం తమదేనని ఆ రెండు పార్టీల నేతలు పైకి గంభీరంగా చెబుతున్నా అధికార పార్టీ విజయాన్ని ఆపలేమని వారికీ తెలుసు. ఓటింగ్ సరళి, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా అవే సంకేతాలు ఇచ్చాయి. దాంతో అధికార వైఎస్సార్సీపీకి ఎంత మెజారిటీ వస్తుందనే చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల్లో సాధించిన ఆధిక్యతను ఆ పార్టీ బ్రేక్ చేయగలుగుతుందా లేదా అన్న ఆసక్తి నెలకొంది. పోలింగ్ తగ్గడంతో ఆ ప్రభావం మెజారిటీపై కనిపిస్తుందన్న అభిప్రాయం కూడా వినిపించింది.

పోలింగ్ తగ్గినా..

2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి దివంగత బల్లి దుర్గాప్రసాద్ కు సుమారు 2.23 లక్షల రికార్డ్ మెజారిటీ లభించింది. ఆయన మరణంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలో మరోసారి ఘన విజయం సాధించాలనే లక్ష్యంతో అధికార పార్టీ పనిచేసింది. 2019లో లభించిన 2.23 లక్షల మెజారిటీకి మించి ఆధిక్యత తేవాలని సీఎం జగన్ పార్టీ నేతలకు నిర్దేశించారు. గత రెండేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన, చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు అందుతున్నందున.. ఖచ్చితంగా మెజారిటీ పెరుగుతుందన్న ధీమా నాడు ఆయన మాటల్లో కనిపించింది. అందుకు తగినట్లే మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి తరఫున ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు వివరిస్తూ ఓట్లు అర్థించారు.

అయితే పోలింగ్ శాతం తగ్గడంతో ఆశించిన మెజారిటీ వస్తుందా రాదా అన్న సందేహాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో మొన్న వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పార్టీ నేతల ఆశలను చిగురింపజేశాయి. తక్కువ ఓట్లు పోలైనా గత మెజారిటీకి మించి సాధించగలమని ఇప్పుడు వారు మరింత ధీమాగా చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్ అంచనాలు వారి ధీమాకు కారణమయ్యాయి.

తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో సుమారు 17.10 లక్షల ఓట్లు ఉన్నాయి. వాటిలో 64.29 శాతం.. అంటే సుమారు 11 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఆరా సంస్థ ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైఎస్సార్సీపీకి 65.85 శాతం.. ఆంటే 7.15 లక్షల ఓట్లు లభిస్తాయి. అదే టీడీపీకి 23.10 శాతం..అంటే 2.54 లక్షల ఓట్లే లభిస్తాయి. ఈ లెక్కన అధికార పార్టీకి నాలుగు లక్షలకుపైగా మెజారిటీ లభించే అవకాశముందంటున్నారు. మరో సంస్థ ఆత్మసాక్షి ప్రకటించిన అంచనాల ప్రకారం చూస్తే వైఎస్సార్సీపీ 59.25 శాతం..అంటే 6,51,750 ఓట్లు సాధిస్తుంది. టీడీపీకి 31.25 శాతం..అంటే 3,43,750 ఓట్లు లభిస్తాయి. ఈ అంచనా ప్రకారం చూసినా వైఎస్సార్సీపీ మెజారిటీ మూడు లక్షలు దాటుతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కాస్త అటుఇటుగా ఉంటాయనకున్నా మూడు లక్షల మెజారిటీ అయితే ఖాయమని, గత మెజారిటీ బ్రేక్ చేయడం తథ్యమని అధికార పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ, బీజేపీల అసలు గల్లంతేనా..

వరుస ఓటములతో కుంగిపోయిన టీడీపీ తిరుపతిలో ఎలాగైనా విజయం సాధించి పార్టీలో కొత్త ఉత్సాహం నింపాలని సర్వశక్తులు ఒడ్డి పోరాడింది. దాదాపు రాష్ట్రంలోని పార్టీ నేతలందరినీ తిరుపతిలో దించి ప్రచారం చేయించింది. చంద్రబాబు, లోకేష్ రోజుల తరబడి అక్కడే మకాం వేశారు. మరోవైపు జనసేన మద్దతుతో బీజేపీ కూడా అదే స్థాయిలో ప్రచారం చేసింది. విజయంపై ఆశలు లేకపోయినా టీడీపీని వెనక్కినెట్టి రెండో స్థానంలో నిలవాలని ఆశించింది. తద్వారా రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి తానే నిజమైన ప్రత్యర్థినని చాటుకోవచ్చని భావించింది. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బీజేపీకి ఏడు శాతానికి మించి ఓట్లు రావని తేల్చేశాయి. ఆదివారం వెల్లడికానున్న అసలు ప్రజాతీర్పు కూడా ఇలాగే ఉంటే టీడీపీ, బీజేపీ రెండింటికీ ఆశాభంగం తప్పదు.

Also Read : తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికల కౌంటింగ్ కోసం సర్వం సిద్ధం