iDreamPost
iDreamPost
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంల భేటీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఈ భేటీ అనంతరం సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఆసక్తినిరేపుతున్నాయి. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై ముద్రగడతో మాట్లాడానని చెప్పిన సోము.. ఇది వ్యక్తిగత భేటీ కాదని తేల్చేశారు. ముద్రగడను సోము వీర్రాజు బీజేపీకిలోకి ఆహ్వానించినట్లు ఆయన మాటల ద్వారా అర్థమవుతోంది. ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉన్న నేపథ్యంలో.. ఈ భేటీ ఫలితం ఇప్పట్లో తేలే అవకాశం లేదు.
అయితే ఇప్పుడు ముద్రడతో భేటీ వెనుక ఆంతర్యం ఏంటన్నదానిపైనే చర్చ నడుస్తోంది. చెప్పుకోదగ్గ పేరున్న నేతలెవ్వరూ బీజేపీవైపు చూడకపోవడంతో తప్పని సరై ముద్రడను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారా? లేక సాధారణ భేటీయేనా? అన్నదానిపై కూడా క్లారిటీ లేదు. రాష్ట్రంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఒకరిద్దరు ప్రముఖులను తప్పితే సోము వీర్రాజు ముందుగా ప్రకటించి, సదరు నేతలను కలిసిన దాఖలాల్లేవు. కానీ అందుకు భిన్నంగా ముద్రగడ పద్మనాభంను కలుస్తున్నట్లు ఒకరోజు ముందుగానే ప్రకటించి మరీ కలవడం వెనుక రాజకీయ వ్యూహాన్ని కాదనలేకున్నారు పరిశీలకులు.
తటస్థంగా ఉన్న కొందరు నాయకులనైనా బీజేపీలోకి రాబట్టుకునే ప్రయత్నాల్లో భాగంగానే సోము వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని భావిస్తున్నారు. కారణాలేవైనా, ప్రయోజం ఎవరికైనా గానీ వీరి భేటిపై ప్రస్తుతం చర్చ సాగుతోంది.
అయితే బీజేపీ టార్గెట్ చేసిన పలు రాజకీయ పార్టీల నుంచి నాయకులు వలసలు పెరగకపోవడానికి ఆ పార్టీ వైఖరే కారణమనే వారు కూడా లేకపోలేదు. ఇప్పటికే జనసేనతో మైత్రిని ప్రకటించారు. అయితే ఈ రెండు పార్టీల మధ్య టగ్ ఆఫ్‌వార్ నడుస్తున్నట్లుగా ఇప్పటికే పలు అంశాల్లో తేలింది. ఒక సారి మొగ్గు ఆవైపునకు వెళితే, మరోసారి ఈ వైపునకు వెళుతోంది. రెండు పార్టీల పొత్తును అనౌన్స్ చేసాక ఏ ఒక్క విషయంలోనూ ఇప్పటి వరకు ఏ ఒక్కరిదీ పైచేయి కాలేదనే చెబుతున్నారు. నిజానికి పొత్తు సూత్రాల ప్రకారం ఏదో ఒక పార్టీకి పైచేయికాకుండా ఇరు పార్టీలు సంయుక్తంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అందుకు భిన్నంగానే జనసేన–బీజేపీ మైత్రి కొనసాగుతోంది. ఈ రెండు పార్టీల్లోని కీలక నేతలు కొన్ని అంశాల్లో చేసిన ప్రకటనల్లో పూర్తి భిన్నత్వం కన్పించడానికి ఈ తరహా టగ్ ఆఫ్ వారే కారణమని పరిశీలకులు వివరిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తాము బీజీపీవైపు మొగ్గినప్పటికీ ఇప్పటికిప్పుడు వచ్చే ప్రత్యేక ప్రయోజనాలేమీ లేవన్నది తటస్థ నేతల అభిప్రాయంగా చెబుతున్నారు. రాజకీయ పరంగా అత్యధికశాతం నాయకులది ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ముద్రగడ బీజేపీవైపు మొగ్గుతారా? అందుకు సోము ప్రయత్నాలు ఎంత వరకు సఫలమవుతాయి? అన్నది తేలాల్సి ఉంది.