Idream media
Idream media
బిర్రు ప్రతాప్ రెడ్డి.. కర్నూలుకు చెందిన టీడీపీ నేత. చంద్రబాబు హాయంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. అయినా నిన్న మొన్నటి వరకు ఈ పేరు రాష్ట్ర ప్రజలకే కాదు, ఆ జిల్లా వాసులకూ పెద్దగా పరిచయం లేదు. కానీ నేడు ఈ నేత పేరు రాష్ట్ర రాజకీయాల్లో నానుతోంది. ముఖ్యంగా గ్రామ స్థాయిలో బిర్రు ప్రతాప్ రెడ్డి పేరు వినపడుతోంది. ఈయన పేరు ఇంతలా ఫేమస్ కావడానికి ఒకే ఒక కారణం.. స్థానిక సంస్థల ఎన్నికలల్లో ప్రభుత్వం నిర్ణయించిన 59.85 శాతం రిజర్వేషన్లను సవాల్ చేస్తూ కోర్టులకు వెళ్లడమే.
స్థానిక సంస్థల్లో ఎస్టీలకు 6.77 శాతం, ఎస్సీలకు 19.08 శాతం, బీసీలకు 34 శాతం వెరసి 59.85 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. రిజర్వేషన్లు 50 శాతం దాటడడం రాజ్యాంగ విరుద్ధమంటూ బిర్రు ప్రతాప్ రెడ్డి కోర్టుకు వెళ్లారు. బిర్రు తనకు తానుగా వెళ్లాడా.. లేక ఎవరి ఆదేశాల మేరకైనా పిటిషన్ వేశారా..? అనేది పక్కన పెడితే.. ఇప్పుడు సదరు నాయకుడి అధినేత చంద్రబాబు.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలోగే 59.85 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారు. అందుకు తాము పూర్తిగా సహకరిస్తామని నిన్న మంగళవారం కుప్పంలో ప్రజా చైతన్య యాత్రలో చెప్పారు.
చంద్రబాబు చొరవ బాగానే ఉంది. అయితే ఎన్నికలు జరిగే విషయం ఇప్పుడు చంద్రబాబు చేతుల్లోనే ఉంది. 59.85 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించండి.. మేము సహకరిస్తామన్న నోటితోనే.. రిజర్వేషన్లను సవాల్ చేస్తూ తన పార్టీ నాయకుడు బిర్రు ప్రతాప్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని చంద్రబాబు ఒక్క మాట చెబితే చాలు. ఎన్నికల పోరు మొదలవుతుంది. మరి చంద్రబాబు తాను చెప్పిన మాటలను ఆచరణలో చూపించి చిత్తశుద్ధి నిరూపించుకుంటారా..?
59.85 శాతం రిజర్వేషన్లను రాష్ట్ర హైకోర్టు కూడా సమర్థించింది. ఈ మేరకు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. షెడ్యూల్ కూడా సిద్ధమైంది. గత నెల 17న నోటిఫికేషన్ వెలువడాల్సింది. అయితే హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బిర్రు ప్రతాప్ రెడ్డి సుప్రిం కోర్టుకు వెళ్లారు. సుప్రిం ఆదేశాలతో హైకోర్టు విచారణ జరుపుతోంది. హైకోర్టు తీర్పు ఎలా ఇచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. 50 శాతమే అంటే.. ఆ మేరకు ఖరారు చేసిన రిజర్వేషన్లలో మార్పులు చేసి ఎన్నికలు నిర్వహిస్తామని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.
50 శాతం దాటి ఇచ్చిన రిజర్వేషన్లు బీసీలకు వర్తిస్తున్నాయి. ఇప్పుడు 59.85 శాతం నుంచి 50 శాతానికి పరిమితం చేస్తే.. ఆ మేరకు బీసీల రిజర్వేషన్లలో కోత పడుతుంది. తమది బీసీల పార్టీ అని చెప్పుకునే చంద్రబాబు.. బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ తమ పార్టీ నేతే కోర్టుకు వెళ్లడంతో ఆ ప్రభావం పార్టీపై పడుతుందని భావిస్తున్నట్లుగా ఉంది. అందుకే తాజా మాటలని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు తాను మాటల మనిషిని కాదని.. చేతల మనిషినని నిరూపించుకునేలా.. తన పార్టీ నేత బిర్రు ప్రతాప్ రెడ్డి చేత పిటిషన్ ఉపసంహరించుకునేలా చేయాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. మరి చంద్రబాబు ఆ పని చేస్తారా..? లేదా..? వేచి చూడాలి.