iDreamPost
android-app
ios-app

పాలధర ఎలా పెంచావు బాబూ ?

  • Published May 05, 2020 | 4:02 AM Updated Updated May 05, 2020 | 4:02 AM
పాలధర ఎలా పెంచావు బాబూ ?

రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు పెంచటాన్ని చంద్రబాబునాయుడు అండ్ కో విపరీతంగా ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు అండ్ కో రెండు రకాలుగా బాధ పడుతున్నారు. మొదటిదేమిటంటే మద్యం షాపులు తెరవటం. రెండోదేమిటంటే మద్యం ధరలను 25 శాతం పెంచటం. మద్యం షాపులు తెరవటమన్నది జగన్మోహన్ రెడ్డి నిర్ణయం కాదు. జాతీయస్ధాయిలో ప్రధానమంత్రి నరేంద్రమోడి తీసుకున్న పాలసీ నిర్ణయంలో భాగంగా ఏపిలో షాపులు తెరుచుకున్నాయి. ఇక ధరలు పెంచటం మాత్రమే జగన్ ప్రభుత్వం ఇష్టం.

నిజానికి మద్యం షాపులు తెరవటంపైనా ధరలు పెంచటంపైనా చంద్రబాబు అండ్ కో నోరెత్తాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మద్యం ధరలు పెంచటంపై నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు హెరిటేజ్ పాలధరలు ఎలా పెంచాడు ? 500 ఎంఎల్ పాల ధరను 2 రూపాయలు పెంచిన విషయం అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ సంక్షోభంలో కూడా పాలధరను పెంచాలని చంద్రబాబుకు ఎలా అనిపించిందో అర్ధం కావటం లేదు. బహుశా చంద్రబాబు తరచూ చెప్పే సంక్షోభంలో కూడా అవకాశాలను వెతుక్కోవటం అంటే ఇదేనా ? అని జనాలు ఎద్దేవా చేస్తున్నారు.

హెరిటేజ్ తరపున పేదలకు పాలు, పెరుగు లేదా పాల ఉత్పత్తులను, కూరగాయలను ఎక్కడా పంపణి చేయలేదు. పేదలకు అవివ్వాలి, ఇవ్వాలని జగన్ పై రాళ్ళు వేయటమే టార్గెట్ గా పెట్టుకున్న చంద్రబాబు కూడా ప్రభుత్వంపై ఆరోపణలు చేయటమే విచిత్రంగా ఉంది. జగన్ ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదన్న ఏకైక లక్ష్యంతోనే చంద్రబాబు మిగిలిన పార్టీలను కూడదీసుకుని ఎల్లోమీడియా మద్దతుతో జగన్ పై రెచ్చిపోతున్నాడు.

అధికారంలో ఉన్నపుడు 48 వేల బెల్టుషాపులను రన్ చేసిన చరిత్ర చంద్రబాబుది. జగన్ అధికారంలోకి రాగానే అన్నింటినీ ఏరేశాడు. అలాంటిది ఇపుడు అవసరం కాబట్టి మద్యం ధరలను పెంచాడు. తాగేవాళ్ళకు లేని నొప్పి చంద్రబాబు అండ్ కో కు ఎందుకో అర్ధం కావటం లేదు. మద్యం షాపుల ముందు క్యూలు కడితే కరోనా వైరస్ పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్న చంద్రబాబు తన కంపెనీలో వైరస్ సోకిన గార్డుతో ఎలా డ్యూటి చేయించాడో ముందు సమాధానం చెప్పాలి. తన ఫ్యాక్టరీలో పాల ధరను తనిష్టం వచ్చినట్లు పెంచుకోవచ్చు కానీ ప్రభుత్వం మాత్రం మద్యం ధరలను పెంచకూడదా ?