Idream media
Idream media
కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ 4.0 ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నెల 31వ తేదీ వరకూ లాక్‌డౌన్ కొనసాగనుంది. అయితే లాక్‌డౌన్ కొనసాగినా.. పలు అంశాలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా మినహాయింపు ఇచ్చింది. ముఖ్యంగా ప్రజా రావాణాకు సంబంధించి పలు సడలింపులు ఇచ్చినా.. వాటిని ఉపయోగించుకునే విషయంలో నిర్ణయాధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే విడిచిపెట్టింది.
పరిమిత సంఖ్యలో బస్సు సర్వీలు తిప్పుకోవచ్చని, అంతర్రాష్ట్ర సర్వీసులు నడపొచ్చని కేంద్రప్రభుత్వం తాజా లాక్‌డౌన్ 4.0 మార్గదర్శకాల్లో పొందుపరిచింది. తెలుగు రాష్ట్రాలు తమ తమ భూభాగాల్లో భౌతిక దూరం పాటిస్తూ బస్సులను తిప్పేందుకు అనుగుణంగా సీట్లను సరికొత్తగా ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఒక జిల్లా నుంచి మరోక జిల్లాకు బస్సు సర్వీసులు ప్రారంభమవడం లాంఛనమే కానుంది. అయితే రెండు రాష్ట్రాల మధ్య సర్వీసులు నడపడంతో ఇరు ప్రభుత్వాలు చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాష్ట్రం విడిపోయినా.. హైదరాబాద్‌తో ఏపీకి ఉన్న అనుబంధం విడిపోనిది.
ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం, నివాసం.. ఇలా ఏపీకి హైదరాబాద్‌తో విడిపోని బంధం ఉంది. లాక్‌డౌన్‌కు ముందు ఏపీలోని తమ స్వంత ప్రాంతాలకు వెళ్లిన వారు అక్కడే చిక్కుకుపోయారు. ఇక హైదరాబాద్‌లో ఉండి ఇళ్లకు వెళ్లనేని వారు వేల సంఖ్యలో ఉన్నారు. స్పందన వెబ్‌సైట్ ద్వారా 13 వేల మంది దరఖాస్తు చేసుకున్నారంటే.. దరఖాస్తు చేసుకునేందుకు సదుపాయం లేని వారు హైదరాబాద్‌లో లక్షల సంఖ్యలో ఉన్నారు. వీరందరూ తమ స్వంత ప్రాంతాలకు వెళ్లేందుకు తహతహలాడుతున్నారు. అదే సమయంలో ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చేందుకు భారీ సంఖ్యలో జనాలు ఎదురుచూస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో బస్సులు తిప్పడంపై తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకుంటాయన్న ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు సోమవారం తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో బస్సు సర్వీసులు నడపడంపై చర్చిస్తారనే ప్రచారం జరుగుతోంది. సర్వీసులు నడపడంపై కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో సాయంత్రానికి తెలియనుంది.