iDreamPost
android-app
ios-app

డోలో రాసినందుకు డాక్టర్లకు వెయ్యి కోట్ల నజరానాలు, సుప్రీం ఎదుటకు ఫార్మా కంపెనీల బాగోతం

డోలో రాసినందుకు డాక్టర్లకు వెయ్యి కోట్ల నజరానాలు, సుప్రీం ఎదుటకు ఫార్మా కంపెనీల బాగోతం

కోవిడ్ సోకినప్పుడు డాక్టర్లు మనలో చాలా మందికి డోలో వాడమని చెప్పి ఉంటారు. మనకే కాదు స్వయంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కి కూడా డాక్టర్లు ఇదే టాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేశారు. ఇలా ఈ మాత్ర రాసినందుకు దేశవ్యాప్తంగా డాక్టర్లకు ముట్టిన కానుకల విలువెంతో తెలుసా? వెయ్యి కోట్ల రూపాయలు! ఈ విషయాన్ని భారత మెడికల్ & సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ల ఫెడరేషన్ సుప్రీం కోర్టుకు నివేదించింది. ఇలా తమ టాబ్లెట్లు మాత్రమే రాయాలంటూ ఫార్మా కంపెనీలు డాక్టర్లకు తాయిలాలివ్వడాన్ని నిలదీయాలంటూ ఈ సంస్థ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ ఎ.ఎస్. బోపన్నలతో కూడిన ధర్మాసనం దీన్ని తీవ్రంగా పరిగణించింది. పది రోజుల్లోగా స్పందించాలంటూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఇదేదో గొప్ప విషయం కాదని, తనక్కూడా డాక్టర్లు ఇదే టాబ్లెట్ రాసిచ్చారని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. కానుకలకు ఆశపడి డాక్టర్లు కొన్ని రకాల టాబ్లెట్లను పదే పదే ప్రిస్త్రైబ్ చేయడం వల్ల డోసేజ్ ఎక్కువై పేషంట్ల ఆరోగ్యం దెబ్బ తినే అవకాశముందని పిటిషనర్లు కోర్టుకు చెప్పారు. దీని వల్ల అర్థం లేని, ఖరీదైన మందులే మార్కెట్ లోకి వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల్లో లొసుగుల వల్ల ఫార్మా కంపెనీలు అవకవకలకు పాల్పడుతున్నాయని, వీటిని నిరోధించడానికి ఒక పారదర్శక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని పిటిషినర్లు న్యాయమూర్తులను కోరారు. దీనిపై తదుపరి విచారణ సెప్టెంబర్ 29కి వాయిదా పడింది.