iDreamPost
iDreamPost
ఏపీ సీఎం జగన్ దూకుడు పెంచారు. ముఖ్యంగా అక్రమార్కుల ఆటకట్టించే పనిలో వేగంగా పెంచారు. దానికి అనుగుణంగా అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. మీ వెనుక నేనున్నా అనే భరోసా కల్పించారు. ఎవరినీ వదిలిపెట్టవద్దని ఆదేశించారు. తాజాగా స్పందన కార్యక్రమం సమీక్షలో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో సీఎం చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
రాజకీయంగా ఇటీవల పెద్ద చర్చకు తెరలేపిన ఇసుక విషయంలో సీఎం దూకుడు విశేషంగా కనిపిస్తోంది. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోకి మరింత ప్రోత్సాహం అందిస్తున్నట్టు కనిపిస్తోంది. విధానపరమైన సూచనలతో పాటుగా అక్రమార్కుల విషయంలో సీఎం అందిస్తున్న తోడ్పాటుతో జిల్లాల్లో మరింత చురుగ్గా కదిలే అవకాశం కనిపిస్తోంది.
ఈ సమీక్షా సమావేశంలో పలు అంశాలు ప్రస్తావించారు. రాష్ట్రంలో 30.3 లక్షలమందికిపైగా జులై 8న ఇళ్లపట్టాలు అందించబోతున్నట్టు ప్రకటించారు. ఉపాధి హామీలో వీలయినంతమందికి పనులు కల్పించాలని సూచించారు. 100 శాతం కచ్చితత్వంతో ఇ– క్రాపింగ్ జరపాలని ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బేకేలు, విలేజ్ క్లినిక్స్ నిర్మాణంపై దృష్టి పెట్టాలని చెప్పారు. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు శిక్షణ అవసరం, దానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. భయాందోళనలు ( స్టిగ్మా) తగ్గించడంద్వారానే కోవిడ్‌కు అడ్డుకట్ట వచ్చని అభిప్రాయపడ్డారు. దానికి అనుగుణంగా చర్యలుండాలన్నారు. ఆమేరకు ప్రచారం, ప్రజల్లో చైతన్యం కలిగించేలా చేపట్టాలన్నారు.
అదే సమయంలో ఇసుక సమస్యను సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. రోజుకు 3 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక ఉత్పత్తి చేయాలని, దానికి తగ్గట్టుగా అన్ని రీచ్‌లు తెరవాలని ఆదేశాలు జారీ చేశారు. సొంత అవసరాలకు 5 కి.మీ. పరిధి వరకూ ఎడ్ల బళ్ల ద్వారా ఉచితంగా ఇసుక తరలించుకునేందుకు అనుమతులు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇసుక, మద్యం అక్రమాలపై ఉక్కుపాదం మోపండి అని చెప్పేశారు. ఇలాంటి వ్యవహారాల్లో ఎవరున్నా ఉపేక్షించవద్దు అని సూటిగా ప్రకటించారు. ఎంతటి వారయినా వదిలిపెట్టవద్దన్నారు. మీ వెనుక నేనున్నా అంటూ అధికారులకు భరోసానిచ్చారు.
సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, ఆదిమూలపు సురేష్, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్ సహా పలువురు అధికారులు హాజరయ్యారు. ఇసుక కోసం గ్రామ సచివాలయంలో బుక్ చేసుకోవచ్చని, దీనికి సంబంధించిన అనుమతులు తీసుకోవచ్చని తెలిపారు. బల్క్ బుకింగ్ అనుమతులు జాయింట్ కలెక్టర్ చూసుకోవాలని తేల్చిచెప్పేశారు. ఇసుక విధానం పారదర్శకంగా ఉండాలని ఆదేశించారు. వర్షాలు వస్తున్నందున.. మళ్లీ ఇసుకకు ఇబ్బందులు రాకుండా ఇప్పుడే చర్యలు తీసుకోవాలని సూచించారు.
లిక్కర్ వినియోగం తగ్గించడానికి అన్నిరకాల చర్యలూ తీసుకున్నాం అన్నారు. 43వేల బెల్టుషాపులు ఎత్తివేసిన విషయాన్ని గుర్తు చేశారు. 33శాతం మద్యం దుకాణాలు తగ్గించామన్నారు. పద్దతి ప్రకారం మద్య నియంత్రణ చేస్తున్నాం అన్నారు. షాక్ కొట్టే రీతిలో రేట్లు పెంచామని తెలిపారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు.. మద్యం అక్రమ రవాణా, తయారీ జరక్కుండా చూడాలన్నారు. బయట రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా జరక్కూడదని తెలిపారు. వీటిపై ఉక్కుపాదం మోపితేనే మంచి భవిష్యత్తును తర్వాత తరాలకు అందించగలుగుతామన్నారు. మద్యం, ఇసుక అక్రమాల్లో ఎవరు ఉన్నా కూడా ఉపేక్షించవద్దని తేల్చిచెప్పేశారు. సీఎం మీతో ఉన్నాడు, దూకుడుగానే ఉండండి…అసుక అక్రమ రవాణాపై కూడా ఉక్కుపాదం మోపాలి అని సీఎం స్పష్టంగా చెప్పేశారు.