కళ్ళు తెరిచిన కాంగ్రెస్ అధిష్టానం – ట్రబుల్ షూటర్‌కు బాధ్యతలు

మధ్యప్రదేశ్ సింధియా సృష్టించిన రాజకీయ సంక్షోభంతో నష్ట నివారణ చర్యలను కాంగ్రెస్ అధిష్టానం చేపట్టింది.ఖాళీగా ఉన్న రాష్ట్ర పీసీసీ అధ్యక్ష పదవులకు సమర్థ నాయకులను ఎంపిక చేస్తూ రాష్ట్రాలలో పార్టీ పటిష్టతకు చర్యలు చేపట్టింది.

కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి డీకే శివకుమార్‌ను కాంగ్రెస్ పార్టీ నియమించింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రభుత్వం మరొకసారి ప్రలోభపెట్టి “ఆపరేషన్ ఆకర్ష్” ద్వారా వలవేస్తుందని రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో అధిష్టానం ట్రబుల్ షూటర్‌గా పేరుపొందిన డీకే శివకుమార్‌కు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించింది.

2019 డిసెంబర్ నెలలో 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు కేపీసీసీ పదవికి రాజీనామా చేశాడు.అప్పటి నుంచి ఖాళీగా ఉన్న కేపీసీసీ అధ్యక్ష పదవి కోసం మాజీ సీఎం సిద్ధరామయ్య మద్దతుతో హెచ్‌కే పాటిల్,శివకుమార్‌తో పోటీ పడ్డారు.ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో సమర్థవంతమైన నేతగా, వ్యూహకర్తగా కర్ణాటకలో జేడీయూ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్‌కు కేపీసీసీ పదవిని కాంగ్రెస్ అధిష్టానం కట్టబెట్టింది.

డీకే తో పాటు కార్యనిర్వహక అధ్యక్షులుగా ఈశ్వర్ ఖండ్రే, సతీష్ జార్ఖిహోలీ, సలీమ్ అహ్మద్‌లను నియమిస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం అధికారిక ప్రకటన చేశారు. వీరితోపాటు కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో చీఫ్ విప్‌లను కూడా మారుస్తూ ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. శాసనసభ చీఫ్ విప్ గా అజయ్ సింగ్,శాసనమండలిలో చీఫ్ విప్ గా నారాయణ స్వామిలను నియమించారు. మాజీ సీఎం సిద్ధరామయ్యను కర్ణాటక సీఎల్పీ నేతగా కొనసాగించారు.అలాగే ఢిల్లీ పీసీసీ చీఫ్‌గా సీనియర్‌ నేత అనిల్‌ చైదరీని పార్టీ అధిష్టానం నియమించింది.

Show comments