iDreamPost
android-app
ios-app

మండలి ప్రాతినిధ్యం.. ఏ జిల్లా నుంచి ఎంతెంత మంది..?

మండలి ప్రాతినిధ్యం..  ఏ జిల్లా నుంచి ఎంతెంత మంది..?

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి రద్దు ఖాయమైన పక్షంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రముఖ నేతల పదవులు కోల్పోనున్నారు. ఇందులో మంత్రులు కూడా ఉండడం విశేషం. మండలిలో టీడీపీ సభ్యులు ఎక్కువగా ఉండడంతో ఆ పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతోంది. అయితే మరో ఒకట్రెండు ఏళ్లలో ఖాళీ అయ్యే పదవులు వైఎస్సార్‌సీపీకి దక్కుతాయని, ఫలితంగా ఆ పార్టీకే నష్టమని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఏది ఏమైనా మండలి రద్దు ప్రక్రియ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో రాజకీయంగా నేతలకు నష్టమనే భావన సర్వత్రా నెలకొంది. జిల్లాల వారీగా పలువురు నేతలు మండలికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పార్టీలు కూడా ఆయా జిల్లాల్లో నేతలకు పార్టీ సేవలు, సామాజిక సమీకరణాల ఆధారంగా ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టాయి. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లా నుంచి అత్యధిక మందికి ఎమ్మెల్సీ పదవులు దక్కగా.. శ్రీకాకుళం జిల్లాకు ఒక్క స్థానమే దక్కింది.

శాసన మండలిలో 58 స్థానాలు ఉన్నాయి. ఇందులో ఐదేసి చొప్పన ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటా పోను 48 సీట్లు మిగులుతాయి. ఇందులో స్థానిక సంస్థల నుంచి 20 మంది, ఎమ్మెల్యే కోటా కింద 20 మంది ఎన్నికవుతారు. మిగిలిన 8 స్థానాలుకు అభ్యర్థులను గవర్నర్‌ నామినేట్‌ చేస్తారు. గవర్నర్‌ కోటా కూడా పూర్తిగా రాజకీయ పార్టీల చేతిలోనే ఉడడం సర్వ సాధారణం. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ తరఫున 8 మంది గవర్నర్‌ కోటాలో మండలికి వెళతారనడంలో సందేహం లేదు.

ప్రస్తుతం మండలిలో నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రకాశం, అనంతపురం, గుంటూరు జిల్లా నుంచి ఒకొక్క స్థానం చొప్పున స్థానిక సంస్థల కోటా ఖాళీగా ఉంది. ఎమ్మెల్యే కోటా కింద మరో స్థానం గుంటూరు నుంచి ఖాళీ అయింది. వీటిని కూడా లెక్కించగా.. రాజకీయపరమైన 48 స్థానాలకు గాను అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి ఏడుగురు మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి ఒక్కరే మండలిలో ఉన్నారు.

జిల్లాల వారీగా మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల సంఖ్య..

1. తూర్పుగోదావరి – 7

2. గుంటూరు – 6

3. కర్నూలు – 5

4. కృష్ణ – 5

5. అనంతపురం – 5

6. పశ్చిమ గోదావరి – 4

7. వైఎస్సార్‌ కడప – 3

8. చిత్తూరు – 3

9. విశాఖపట్నం – 3

10. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు – 2

11. ప్రకాశం – 2

12. విజయనగరం – 2

13. శ్రీకాకుళం – 1