iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ.. ప్రకటించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ.. ప్రకటించిన సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మంగళవారం గోల్కొండలో జాతీయ జెండాను ఆవిష్కరించి 77వ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ నగర ప్రజలకు ఓ తీపి కబురును అందించారు. ఆయన ఏమన్నారంటే?.. గత ప్రభుత్వాలు ప్రజలకు చిన్న చిన్న గదులు కలిగి ఉన్న ఇళ్లను ఇచ్చారు. ఆ ఇరుకుల గదుల్లో పేదలు ఉండలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కానీ, మా ప్రభుత్వం ఇందుకు భిన్నంగా ఆలోచించి పేద ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఉచితంగా అందిస్తుందని తెలిపారు.

  హైదరాబాద్ లో నిర్మించిన లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లను అర్హులైన పేదలకు నేటి నుంచే ఉచితంగా పంపిణీ చేయనున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇక ఇదే కాకుండా రాష్ట్రంలో సొంతంగా ఇంటి స్థలం కలిగి ఉండి ఇల్లు నిర్మించుకునే స్థోమత లేని వాళ్లు చాలా మంది ఉన్నారని, వారి కోసం గృహ లక్ష్మి పథకం కింద లబ్ధిదారునికి మూడు విడతలుగా రూ.3 లక్షలు ఇస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే ప్రతీ నియోజకవర్గంలో సుమారు 3 వేల మందిని ఎంపిక చేస్తారని అన్నారు.

ఇక ఈ పథకంలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు కూడా కల్పించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఇదే కాకుండా పంచాయితీల్లో పని చేసే కార్మికులకు సైతం సీఎం గుడ్ న్యూస్ అందించారు. వారు చనిపోతే రూ.5 లక్షల భీమా అందేలా సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నామని కూడా తెలిపారు. రాష్ట్రంలోని రైతులకు ఇటీవల లక్ష లోపు రుణమాఫీ సైతం చేసిన విషయం తెలిసిందే. అయితే నగరంలో నేటి నుంచి లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టడంతో అర్హులైన పేద ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: పంద్రాగస్టు రోజున.. శుభవార్త చెప్పిన CM KCR!