iDreamPost
కానీ కొందరు దర్శకులకు మాత్రం హిట్లు ఇచ్చినా అవకాశాలు అంతంత మాత్రంగా ఉంటాయి.
కానీ కొందరు దర్శకులకు మాత్రం హిట్లు ఇచ్చినా అవకాశాలు అంతంత మాత్రంగా ఉంటాయి.
iDreamPost
అదేంటో ఒక్కోసారి ఫ్లాప్ దర్శకులకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తుంటాయి. కానీ కొందరు దర్శకులకు మాత్రం హిట్లు ఇచ్చినా అవకాశాలు అంతంత మాత్రంగా ఉంటాయి. అవకాశం వచ్చినా ఆలస్యమవ్వడమో, ఆగిపోవడమో జరిగిపోతుంటాయి. టాలీవుడ్ దర్శకుడు వేణు శ్రీరామ్ పరిస్థితి అలాగే ఉంది. హిట్ ఇచ్చినా అవకాశం అంత తేలికగా రాదు, వచ్చినా అది పూర్తవుతుందో లేదో తెలీదు అన్నట్లుగా ఆయన కెరీర్ సాగుతోంది.
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఇప్పటిదాకా మూడు సినిమాలు రాగా.. మూడూ కూడా ప్రేక్షకులకు ఆకట్టుకున్నాయి. పైగా ఈ మూడు చిత్రాలను దిల్ రాజు నిర్మించడం విశేషం. 2011 లో విడుదలైన ‘ఓ మై ఫ్రెండ్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు వేణు. ఆ సినిమా వేణుకి మంచి పేరే తీసుకొచ్చినప్పటికీ.. ఆయన దర్శకత్వంలో వచ్చిన రెండో సినిమా ‘ఎంసీఏ'(2017) విడుదల కావడానికి ఏకంగా ఏడేళ్లు పట్టింది. మధ్యలో రామ్ చరణ్ తో ఒక సినిమా ప్లాన్ చేశాడు కానీ పట్టాలెక్కలేదు. అలాగే రవితేజతో ‘ఎవడో ఒకడు’ అనే సినిమాని మొదలు పెట్టగా అది ఆగిపోయింది. ఇక రెండో సినిమా ఎంసీఏ మంచి విజయం సాధించినప్పటికీ మూడో సినిమా ‘వకీల్ సాబ్'(2021) రావడానికి దాదాపు నాలుగేళ్లు పట్టింది. ఈ గ్యాప్ లో అల్లు అర్జున్ తో ‘ఐకాన్’ చిత్రం చేయబోతున్నట్లు ప్రకటన వచ్చింది కానీ.. ‘పుష్ప’ చిత్రం కారణంగా బన్నీ దానిని పక్కన పెట్టాడు.
‘వకీల్ సాబ్’ వచ్చి ఏడాదిన్నర దాటినా ఇంతవరకు వేణు శ్రీరామ్ తదుపరి చిత్రం గురించి ప్రకటన రాలేదు. అయితే ఇప్పుడు ఆయనకు రామ్ చరణ్ తో సినిమా చేసే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. అలాగే ఇటీవల బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇక ఇప్పుడు వేణు శ్రీరామ్ ప్రాజెక్ట్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటిదాకా వేణు చిత్రాలను దిల్ రాజు నిర్మించగా.. ఈ ప్రాజెక్ట్ మాత్రం యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందనుందని అంటున్నారు. ఎందుకంటే యూవీ బ్యానర్ లో గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో చరణ్ ఓ మూవీ అనౌన్స్ చేశాడు. కానీ ఏవో కారణాల గౌతమ్ ని పక్కన పెట్టాడు. ఇప్పుడు గౌతమ్ ప్లేస్ లోకి వేణు శ్రీరామ్ వచ్చాడని టాక్. మరి వేణు.. బన్నీతో చేయాలనుకున్న ఐకాన్ కథని చేస్తాడా? లేక చరణ్ కోసం కొత్త కథని సిద్ధం చేశాడో చూడాలి.