iDreamPost
iDreamPost
2023 జనవరి 12న ఆది పురుష్ విడుదలవుతుందని నిన్న దర్శకుడు ఓం రౌత్ పెట్టిన ట్వీట్ అభిమానులను ఎంత ఆనందంలో ముంచెత్తిందో చూస్తూనే ఉన్నాం. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్నా విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం, డబ్బులు ఖర్చు పెడుతున్న టి సిరీస్ దీన్నో ల్యాండ్ మార్క్ మూవీగా ప్రెజెంట్ చేసే పనులను మొదలుపెట్టింది. అక్టోబర్ 2 టీజర్ లాంచ్ కోసం అయోధ్యలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెదనాన్న కృష్ణంరాజు మరణం వల్ల ప్రభాస్ దీనికి రాలేడేమోనన్న అనుమానాలకు చెక్ పడిపోయింది. ఇది ఎప్పుడో ప్లాన్ చేసిన ఈవెంట్ కావడంతో నిర్మాతలకు ఇబ్బంది కలగకుండా రాబోతున్నాడు.
ఇదిలా ఉండగా ఆది పురుష్ డేట్ మిగిలినవాళ్లకు కొత్త ఇరకాటం తెచ్చి పెట్టింది. అదే సంక్రాంతికి ఆల్రెడీ చిరంజీవి వాల్తేర్ వీరయ్య రావాలని గతంలోనే అఫీషియల్ గా లాక్ చేసుకుంది. ఎప్పుడో ప్రకటన కూడా ఇచ్చారు. అది దృష్టిలో ఉంచుకుని షూటింగ్ వేగంగా చేస్తున్నారు. ప్రస్తుతం వైజాగ్ లో రవితేజ చిరు కాంబోలో కొన్ని ఎపిసోడ్ల చిత్రీకరణ జరుగుతోంది. మరోవైపు విజయ్ దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న వారసుడు కూడా పొంగల్ కె రావాలని ఆ మేరకు ఎప్పుడో లాక్ చేసుకుంది. తమిళులకు చాలా కీలకమైన పండగ కాబట్టి తను సెంటిమెంట్ గా భావించే ఆ అవకాశాన్ని వదులుకునేందుకు విజయ్ సిద్ధంగా లేడు
ఇప్పుడు ఆది పురుష్ రావడం వల్ల ఈ రెండు సినిమాలకు థియేటర్ల కౌంట్ పరంగా బిజినెస్ పరంగా ఇబ్బందులు తలెత్తుతాయి. ఎందుకంటే గ్రాండియర్ పరంగా పోల్చుకుంటే చిరు విజయ్ లవి కేవలం కమర్షియల్ ఎంటర్ టైనర్లు. ప్రొడక్షన్ ఖర్చు మాత్రమే చూసుకుంటే మహా అయితే యాభై నుంచి వంద కోట్లకు అయిపోయేవి. కానీ ఆది పురుష్ కేసు అది కాదు. అయిదు వందల కోట్ల బడ్జెటని ముందు నుంచి చెబుతున్నారు. పైగా ఐమ్యాక్స్, త్రీడి, ఫోర్డిఎక్స్ అంటూ అన్ని రకాల వెర్షన్లు సిద్ధం చేస్తున్నారు. అలాంటప్పుడు దీని పోటీని తట్టుకోవడం అంత సులభం కాదు. మరి తెలుగు తమిళ స్టార్లు వాయిదా వేసుకుంటారా లేక పోటీకి సై అంటారా చూడాలి