iDreamPost
iDreamPost
తనకు పర్సనల్ గా ఎంతో కనెక్ట్ అయిన గొప్ప కథగా దిల్ రాజు వర్ణించిన థాంక్ యు మరీ దారుణంగా డిజాస్టర్ కావడంతో ఆయన కనీసం మీడియా ముందుకు వచ్చేందుకు కూడా ఇష్టపడటం లేదు. ఏదో యావరేజ్ అనిపించుకున్నా సక్సెస్ మీట్ లంటూ ఏదో హడావిడి చేసేవాళ్ళు. ఇప్పుడా అవకాశం లేకుండా పోయింది. మొదటి వారం గడవకుండానే డెఫిషిట్ లోకి వెళ్లిపోవడంతో సెకండ్ వీక్ నుంచి థియేటర్లను హోల్డ్ చేస్తే నష్టం ఇంకా పెరుగుతుంది తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ నేపథ్యంలో థాంక్ యు అనుకున్న టైంకన్నా ముందుగానే ఓటిటికి ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఆల్రెడీ ప్రైమ్ ను సంప్రదించినట్టు సమాచారం.
ఈ విషయంలోనే దిల్ రాజు ధర్మ సంకటంలో పడ్డారు. ఎందుకంటే మీడియం లేదా పెద్ద సినిమాలకు ఓటిటి గ్యాప్ ఎక్కువగా ఉండాలని ఈ మధ్య కాలంలో ఎక్కువగా నొక్కి చెప్పిన అగ్ర నిర్మాత ఈయన ఒక్కరే. ఇంకెవరు దీని గురించి నోరు విప్పలేదు. ఇప్పుడు దిల్ రాజే దాన్ని మీరి థాంక్ యుని మూడు లేదా నాలుగు వారాలకే ఇచ్చేస్తే లేనిపోని విమర్శలు వస్తాయి. ఆ మధ్య మైత్రి అధినేతలను ఇదే ఇష్యూ మీద మీడియా ప్రశ్నించినప్పుడు అది ప్రాక్టికల్ గా ఆలోచించాల్సిన మ్యాటరని దాటవేశారు. ఇప్పుడు చూస్తేనేమో థియేటర్ల దగ్గర ఫ్లాపుల పరిస్థితి రోజురోజుకి దిగజారుతోంది. లేట్ చేసే కొద్దీ ఓటిటి సంస్థలు బెట్టు చేసి సొమ్ము తగ్గించేందుకు ఎదురు చూస్తున్నాయి
సో చిన్నా పెద్దా అనే తేడాలతో కాకుండా ఫలితాల మీద ఆధారపడి ఓటిటి నిర్ణయాలు తీసుకుంటే నిర్మాతలకు ప్రయోజనకారిగా ఉంటుంది. అంతే తప్ప ఏడు వారాలు మూడు నెలలు అనే కండీషన్ల వల్ల వచ్చే నష్టమే తప్ప ఆ ఒక్క కారణం జనాన్ని థియేటర్లకు పరుగులు పెట్టేలా చేయదు. థాంక్ యుకు ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ నాలుగు వారాలు. ఒకవేళ 21 రోజులకే అడ్వాన్స్ స్ట్రీమింగ్ చేయాలంటే ప్రైమ్ మాములుగా అదనపు సొమ్ములు ఇస్తుంది. కానీ ఆచార్య, రాధే శ్యామ్ లకు ఈ స్ట్రాటజీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అందుకే థాంక్ యుకి ఇలా అడిగినా సారీ చెప్పే ఛాన్స్ ఎక్కువగా ఉంది. చూడాలి మరి ఏం చేస్తారో