iDreamPost
iDreamPost
భారతదేశంలోని డిజిటల్ మీడియా నియంత్రించడానికి మరో చట్టం రానుంది. వచ్చే వారం పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వం తీసుకురానున్న సవరించిన బిల్లు ప్రకారం , ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవచ్చు.
ఇప్పటివరకు ఏ చట్టం, లేదా, ఏ ప్రభుత్వ నియంత్రణ ద్వారా నిర్వచించని మీడియా రిజిస్ట్రేషన్ కోసం, బిల్లు రానుంది. ఇందులో డిజిటల్ మీడియాకూడా భాగమే.
ఇకపై డిజిటల్ మీడియా వార్తలను చట్టంలో చేర్చడానికి ప్రెస్ , పీరియాడికల్స్ రిజిస్ట్రేషన్ బిల్లును సవరించే ప్రక్రియను, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. డిజిటల్ మీడియా రిజిస్ట్రేషన్ ప్రక్రియ, సమాచార, మంత్రిత్వ శాఖ పరిధిలోనే ఉంటుంది.
చట్టం అమల్లోకి వచ్చిన 90 రోజులలోపు డిజిటల్ న్యూస్ పబ్లిషర్లు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ వద్ద డిజిటల్ పబ్లిషర్లు నమోదు చేసుకోవాలి, చట్టలను ఉల్లంఘిస్తే చర్య తీసుకునే అధికారం ప్రెస్ రిజిస్ట్రార్ దే. వాళ్లపై చర్యలు తీసుకోవచ్చు, రిజిస్ట్రేషన్‌లను నిలిపివేయవచ్చు లేదంటే రద్దు చేయవచ్చు. జరిమానాలుకూడా విధించొచ్చు.
ప్రెస్ రిజిస్ట్రార్ తీసుకొన్న చర్యలపై అప్పీల్ చేసుకోవాలనుకొనేవాళ్లకు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ చీఫ్‌గా అప్పీలేట్ బోర్డును ఎర్పాటుచేయనున్నారు.
ప్రస్తుతం భారతీయ చట్టాల ప్రకారం, ఆన్‌లైన్ లో తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం చట్టవిరుద్ధం కాదు. ఇండియన్ పీనల్ కోడ్ (IPC) పరువు నష్టం కోణంలోనే తప్పుడు సమాచారాన్ని చూస్తుంది తప్ప, క్రైమ్ గా కాదు. ఒకరు కావాలనే తప్పుడు సమాచారాన్ని ఇచ్చినా శిక్షించేందుకు ఎలాంటి చట్టాలు లేవు. ఇది నేరమని చెప్పలేం. అదే కొత్త చట్టం ప్రకారం, ఉద్దేశపూర్వక తప్పుడు సమాచారం కూడా నేరమే. ఈ మేరకు సవరణలపై ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.
పరువు నష్టం కేసుల నుంచి, ఉద్దేశపూర్వకంగా ఆన్‌లైన్ తప్పుడు సమాచారం ఇవ్వడాన్ని వేరు చేస్తున్నారు. ఈ రెండు వేర్వేరు నేరాలు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, ముఖ్యంగా ట్విట్టర్, యూట్యూబ్, మెటా వంటి వాటిని సమగ్రంగా పర్యవేక్షించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.
సోషల్ మీడియాలాగే యూజర్లు కూడా చాలా తెలివిమీరిపోయారు. అల్గారిథమ్‌లు కూడా ఉద్దేశపూర్వక తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయాలనుకునే వ్యక్తులకు, సహాయపడేలా ఉన్నాయన్నది ఒక ఆరోపణ. కొన్ని రకాల కంటెంట్ ను సోషల్ మీడియా అల్గారిథమ్ లు ప్రోత్సహిస్తున్నాయి. అంతెందుకు ఎలక్షన్స్ లో ఒక అపవాదు, లేదంటే ఒక తప్పుడు సమాచారం కొద్ది గంటల్లోనే, కొన్ని ప్రాంతాల్లో వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీనికి కారణం సోషల్ మీడియా, వాటి ఆల్టారిథిమ్ లన్నది మరోవాదన. దీనిపై చాలా రుజువులున్నాయికూడా.
కాని, ఈ బిల్లును పిఎంఓ, ఇతర మంత్రిత్వశాఖలు ఆమోదించాల్సి ఉంది. కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనల ప్రకారం, డిజిటల్ మీడియాను నియంత్రించాలన్న ప్రయత్నం 2019లో వివాదానికి దారితీసింది. సోషల్ మీడియాను కట్టడిచేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా భావించారు.
కొత్తగా రానున్న ప్రెస్ , పీరియాడికల్స్ రిజిస్ట్రేషన్ బిల్లు, ప్రస్తుతం అమల్లో ఉన్న బ్రిటిష్ కాలం నాటి ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ చట్టం 1867 స్థానంలో రానుంది.