షూటింగ్ భయాలు మళ్ళీ మొదటికి

నిన్న నిర్మాత బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్ రావడం ఫిలిం నగర్ లో పెద్ద న్యూసే అయ్యింది. నిజానికి ఈయన నిత్యం వ్యాపార వ్యవహారాల్లో ఉంటూ సినిమా నిర్మాణానికి గత కొంత కాలంగా దూరంగా ఉన్నారు. ఆ మధ్య యాక్టర్ గా సరిలేరు నీకెవ్వరుతో రీ ఎంట్రీ ఇచ్చారు కాని అంతకు ముందు ఇండస్ట్రీతో ఏళ్ళ గ్యాప్ ఉంది. కొత్తగా ఒప్పుకున్న చిత్రాలు కూడా ఏమి లేవు. కరోనా వచ్చినంత మాత్రాన ప్రతి ప్రాణానికి ముప్పుందని చెప్పడానికి లేదు. అది ఇప్పుడు నమోదవుతున్న రికవరీ శాతాన్ని బట్టి చెప్పొచ్చు. శరీరంలోని ఇమ్యూన్ సిస్టంని బట్టి మనం తీసుకునే జాగ్రత్తలు అందుకుంటున్న వైద్యాన్ని బట్టి ఈజీగా బయటికి వచ్చేయొచ్చు.

కాని ఇప్పుడు అది కాదు సమస్య. తెలంగాణా ప్రభుత్వం అనుమతులు ఇచ్చినప్పటికీ చెప్పుకోదగ్గ సినిమాల షూటింగులు ఇంకా మొదలుకాలేదు. ట్రయిల్ వేసి చూద్దాం అనుకున్న ఆర్ఆర్ఆర్ యూనిట్ కూడా డ్రాప్ అయ్యింది. పెద్ద హీరోలు తమ నిర్మాతలకు ఇంకొంత కాలం ఆగమని చెబుతున్నారు. ఇదంతా కొలిక్కి వచ్చేటప్పటికి ఆగస్ట్ దాటడం ఖాయం. టీవీ సీరియల్స్ మాత్రం శుభ్రంగా షూటింగులు చేసుకుంటూ సోమవారం నుంచి బుల్లితెరలను ఎపిసోడ్లతో నింపబోతున్నాయి. అయితే అసలు మొదలు కావలసింది సినిమాల షూట్లు. ఇప్పుడు బండ్ల గణేష్ కు పాజిటివ్ వచ్చింది సెట్ లో ఉండటం వల్ల కాకపోయినా పరిస్థితి ఎంత సున్నితంగా ఉందో అర్థం చేసుకోవడానికి వచ్చిన హెచ్చరికలా ఇండస్ట్రీ జనాలు ఫీలవుతున్నారు.

పొరపాటున ఏ సెట్ లోనూ ఏ స్టూడియోలోనో ఒక్క కేసు నమోదైనా అందరూ గజగజవణికే పరిస్థితి నెలకొంది. జూలై మొదటి వారం అని ప్లాన్ చేసుకున్న టీంలు సైతం గత వారం రోజులుగా భాగ్యనగరంలో పెరిగిపోతున్న కేసులను చూసి ఒక్కొక్కరుగా డ్రాప్ అవుతున్నారట. ఊరట కలిగించే విషయం ఏంటంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మాత్రం ఆగడం లేదు. చివరి దశలో ఉన్నవి, డబ్బింగ్, ఎడిటింగ్ లాంటి పనులు ఉన్నవి మాత్రం చకచకా పూర్తి చేస్తున్నారు. ఏదేమైనా బండ్ల గణేష్ కోలుకోవడం ఖాయమే అయినా ఇప్పుడు వాతావరణం రేపుతున్న భయాలు మాత్రం తారలను గడప దాటనిచ్చేలా లేవు. గణేష్ ఉంటున్న గేటెడ్ కమ్యునిటీలోనే ఉండే నాగ శౌర్య ముందు జాగ్రత్తలో భాగంగా మరో ప్లేస్ కి షిఫ్ట్ అయ్యారన్న వార్త ఇప్పటికే టాక్ గా మారింది. చూడాలి ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో

Show comments