iDreamPost
iDreamPost
ప్రస్తుతం అమరావతిలో జరుగుతున్న పరిణామాలను చూసిన తర్వాత ఇక మీదట రాష్ట్రంలో గానీ దేశంలో గానీ ఏ ప్రభుత్వాన్నైనా నమ్మి రైతులు భూములు ఇచ్చే పరిస్థితి ఉండదు…
ఆంధ్రజ్యోతితో అమరావతి పరిరక్షణ సమితి నేత కార్తీక్ తుమ్మల .
స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత దేశంలో పలు నీటి ప్రాజెక్టుల కోసం , అభివృద్ధి సెజ్ ల పేరిట , పలు ఇండస్త్రీల పేరిట , రాజధానిల పేరిట చాలా రాష్ట్రాల్లో భూసేకరణ జరిగింది . రైతులు అంగీకరించి ఇచ్చినవి ఉన్నాయి , అంగీకరించకుండా పోరాడి కోల్పోయినవి ఉన్నాయి , కాల్పులు సైతం జరిగినా ఎదురొడ్డి నిల్చి తమ భూములు కాపాడుకొన్న ఘటనలూ ఉన్నాయి .
ఉదాహరణకు బెంగాల్ లోని నందిగ్రామ్ , సింగూర్ భూ పోరాటాలు చెప్పుకోవచ్చు . బుద్ధదేవ్ భట్టాచార్య నందిగ్రామ్ లో ఇండోనేషియా కంపెనీ సారథ్యంలో 27000 ఎకరాల్లో 48000 కోట్లతో సెజ్ ఏర్పాటుకు భూసేకరణకు ప్రయత్నించినప్పుడు అక్కడి రైతుల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది . పలు ఆందోళనలు చేసిన రైతుల్ని అదుపు చేయటానికి ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో ఏకంగా 14 మంది దుర్మరణం పాలయ్యారు . ఆ తర్వాత బెంగాల్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుని రద్దు చేసుకొంది . ఈ రెండు పోరాటాల్లో రైతుల పక్షాన నిలిచి పోరాడి విజయం సాధించిన మమతా బెనర్జీని ప్రజలు బ్రహ్మరధం పట్టి ముఖ్యమంత్రిని చేశారు .
బుద్ధదేవ్ భట్టాచార్య ప్రభుత్వం సింగూర్ లో వెయ్యి ఎకరాల భూమి రైతుల నుండి బలవంతంగా సేకరించి టాటా సంస్థకు ఇచ్చింది . దీనితో తిరగబడి పోరాటం సాగించిన రైతులకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అండగా నిలిచి సాగించిన పోరాటానికి చివరికి ప్రభుత్వం , టాటా కంపెనీ తలొగ్గి పనులు ప్రారభించిన ఫ్యాక్టరీని కూడా ఖాళీ చేసి రైతుల భూమి తిరిగి అప్పచెప్పారు .
ఈ సంఘటనల దరిమిలా యుపిఎ 2 ప్రభుత్వం బ్రిటిష్ కాలం నాటి భూసేకరణ చట్టాన్ని మార్చి 2013లో సరికొత్త భూసేకరణ చట్టాన్ని ఏర్పాటు చేసింది . ఈ చట్టం ప్రకారం ఎంత గొప్ప ప్రజా ప్రయోజన ప్రాజెక్టు కోసమైనా సరే రెండు మూడు బహుళ పంటలు పండే సారవంతమైన భూములు రైతుల నుండి బలవంతంగా సేకరించరాదు . తర్వాత వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం ఈ చట్టాన్ని సవరించ పూనుకొని కాంగ్రెస్ , కమ్యూనిస్టులు రాజ్యసభలో అడ్డుకోవడంతో తాత్కాలికంగా నిలిచిపోయింది .
అవన్నీ ప్రభుత్వాలు ఆయా కాలాల్లో ఉన్న భూసేకరణ చట్టాన్ని అనుసరించి చేసినందువలన రైతులు చట్టప్రకారం పరిహారాన్ని, ప్రత్యామ్నాయాల్ని పొంది ఇవ్వటమో ,ఇష్టంలేకపోతే లేదా పరిహారం సరిపోదు అనిపిస్తే ప్రతిఘటించటమో చేశారు .
అయితే అమరావతి విషయంలో మాత్రం రైతులు ఈ పరిస్థితులకు భిన్నంగా త్రిశంఖు స్వర్గంలో నిలిచారు .ఎందుకు ఈ దుస్థితి అని ఆలోచిస్తే కనపడే కారణమొక్కటే భూసేకరణ ( land acquisition ) చట్టాన్ని అనుసరించకుండా భూసమీకరణ ( land pooling ) విధానానికి తెర తీయటమే .
చట్టాన్ని అనుసరించకుండా ఇరు కంపెనీల మధ్య ప్రయివేటు వ్యవహారంలాగా టీడీపీ నేతలు చేసిన సమీకరణ పలు ప్రలోభాలతో సాగింది అనటంలో సందేహం లేదు . నన్ను చూసి వివాదాల్లేకుండా 33000 ఎకరాల భూమి ఇచ్చారు అని చెప్తున్న బాబు గారి మాటలు సత్య దూరం అని చెప్పటానికి పలు దృష్టాంతాలు ఉన్నాయి . భూములివ్వని వారున్నారు , కోర్టుకి వెళ్లిన వారున్నారు , ఇవ్వము అని మీడియా సాక్షిగా చెప్పి తర్వాత అధికారానికో ప్రలోభాలకో లొంగిన వారున్నారు .
భూమి తీసుకొని అభివృద్ధి చేసిన ప్లాట్స్ ఇస్తామని చెప్పిన బాబు గారు ఐదేళ్లలో కాగితాల మీద ఇచ్చారే కానీ ఆ ప్లాట్స్ ఎక్కడున్నాయో ఇచ్చిన ప్రభుత్వానికీ తెలీదు , తీసుకొన్న రైతుకూ తెలీదు . పోనీ తాను చెప్పిన ప్రపంచస్థాయి రాజధాని సగం నిర్మించినా ఈ రోజు తరలించే అవకాశం ఉండేది కాదు . కేవలం కొన్ని తాత్కాలిక ప్రభుత్వ కార్యాలయాలు , కొన్ని ఎంప్లాయి క్వార్టర్సు నిర్మిస్తూ అంతర్జాతీయ స్థాయి అని భ్రమలు కల్పిస్తూ వచ్చారు .
ఐదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అంతా డొల్ల . కొత్త ప్రభుత్వం వచ్చింది . రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతల ఇంసైడర్ ట్రేడింగ్ చేశారని , ఇప్పుడున్న ఆర్ధిక పరిస్థితిలో 33000 ఎకరాల్లో అంత ఖర్చుతో రాజధాని నిర్మించలేమని , రాష్ట్రాన్ని మరింత అప్పుల పాలు చేసి ప్రజలందరి మీద భారం మోపటం కన్నా రాజధాని వికేంద్రీకరించి అన్ని ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేయటం తమ అభీష్టమని తేల్చి చెప్పిన జగన్ , ఆ దిశగా కార్యక్రమాలు కూడా చేపడుతున్నట్టు సూచనలు అందుతున్నాయి .
చంద్రబాబు నాయుడుకి భూమి ఇచ్చి ప్లాట్స్ పత్రాలు , గత నాలుగేళ్లుగా కౌలు పొందుతున్న రైతులు , పలువురు టీడీపీ నేతలు , మీడియా సంస్థలు , టీడీపీ అనుకూల విశ్లేషకులు ఈ హఠాత్పరిణామానికి ఉలిక్కిపడ్డారు . ముఖ్యంగా కొందరు టీడీపీ నాయకులు తమ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడతాం అంటుంటే ఇతర పార్టీల నాయకులు , ఇతర ప్రాంతాల టీడీపీ నాయకులు కొందరు రాజధాని వికేంద్రీకరణను స్వాగతిస్తున్నారు .
ముఖ్యంగా ఇంసైడర్ ట్రేడింగ్ ఆరోపణలు ఉన్న బాబు అండ్ కో రాజధాని వికేంద్రీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ రైతులలో కలిసిపోయి పోరాటం చేస్తూ అత్యంత తీవ్ర పదజాలంతో ప్రభుత్వాన్ని , జగన్ ని నిందించటం ఆరంభించారు. అయితే ఈపోరాటం మొదట్లో ఇరవై తొమ్మిది గ్రామాలలో సాగి నేటికి నాలుగైదు గ్రామాలకి పరిమితమైంది .
ఇందుకు కారణం కూడా టీడీపీనే , ఆ పార్టీని , బాబు గారిని నమ్మని రాష్ట్రప్రజానీకం , పలు ప్రజా సంఘాలు రాజధాని రైతుల పక్కన బాబు ఉండటం వలన వారి సమస్య పట్ల కూడా సానుకూలత వ్యక్తం చేయకుండా మిన్నకుండిపోయారు .
ఇప్పటికైనా రైతులకు మేలు జరగాలంటే బాబు గారు ఈకుహానా పోరాటాలు ఆపి నిజాలు మాట్లాడాలి . భూమి ఇచ్చిన రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించాలి , ఒకవేళ తరలిస్తే రైతులకు ఏ విధమైన పరిహారం అందించాలి లాంటివి చర్చించాలి . ఆ మేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి సమస్య పరిష్కారానికి కృషి చేయాలి .
ఈ విధంగా కృషి చేస్తే అయినా 29 గ్రామాల రైతులకు బాబు గారు చేసిన అన్యాయానికి కొంతైనా పరిహారం చేసుకున్నట్లు అవుతుంది . లేదూ ఇలాగే అల్లర్లు రెచ్చగొడుతూ విద్వేష కార్యక్రమాలలో రైతుల్ని భాగస్వాముల్ని చేసి మళ్లీ ఇక్కట్లు పాలు చేస్తే వారికి మరింత తీవ్ర అన్యాయం చేసినవారుగా చరిత్రలో నిలిచిపోతారు అనటంలో సందేహం లేదు .