iDreamPost
iDreamPost
రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందాలి అంటే పరిపాలన వికేంద్రికరణ ద్వారానే సాధ్యం అని నమ్మిన జగన్ ప్రభుత్వం ఆ మేరకు రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు జనవరి 2020 న శాసనసభలో పరిపాలనా వికేంద్రికరణ బిల్లుని ప్రవెశ పెట్టీ సుదీర్ఘ చర్చ అనంతరం ఆమోదించుకుంది. అయితే అదే బిల్లు శాసన మండలకి వచ్చేసరికి తెలుగుదేశం తమ సంఖ్యా బలంతో అడ్డుకునే ప్రయత్నం చేసింది.
రాజధానిలో భారీ భూ దోపిడికి పాల్పడ్డారనే నిందని నిజం చేస్తూ మొత్తం రాజధాని అమరావతిలోనే ఉండాలని పట్టుపట్టింది.
వికేంద్రికరణ బిల్లుని అడ్డుకునే శక్తి శాసన మండలకి లేకపొయినా రూల్ 71 ని తెరపైకి తెస్తూ బిల్లుని తాత్కాలికంగా అడ్డుకునే రాజకీయ డ్రామాకి తెరలేపింది. నాడు అర్ధరాత్రి వరకు సాగిన ఈ హైడ్రామాతో చివరికి మండలి చైర్మన్ షరీఫ్ చేత బిల్లుని సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేస్తూ రూల్ పాస్ చేయడం ఈ ప్రక్రియలో తెలుగుదేశం ఇచ్చిన నోటీసు నిబంధనలకు విరుద్దం అయినా నాకున్న విచక్షణ అధికారాలతో నిర్ణయం తీసుకునట్టు చెప్పడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారమే రేగింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు చైర్మన్ కు ఎదురుగా గ్యాలరీలో కూర్చుని ఆయనకి సైగలు చేస్తు సభను ప్రభావితం చేశారని అధికార పార్టి నేతలు మండిపడ్డారు.
అయితే భారత రాజ్యంగంలోని ఆర్టికల్ 197 (1) అధికరణ ప్రకారం ద్రవ్య బిల్లు కాకుండా ఇక ఏ బిల్లు అయినా శాసన సభలో ఆమోదం పొంది మండలిలో ప్రవేశపెడితే ఆ బిల్లు మండలి తిరస్కరించిన, సవరణలు ప్రతిపాదించిన 3నెలల్లో తిరిగి శాసన సభలో ప్రవేశ పెట్టుకోవచ్చనే నిబంధనలు ఉండటం, అలాగే మండలి చైర్మన్ ఒక వేళ బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపి దానికి ఎటువంటి కాల పరిమితి నిర్ణయించకపోతే కౌన్సిల్ రూల్ బుక్ లోని 242 ప్రకారం ఆ కమిటీకి కాల వ్యవధి కేవలం 3 నెలలే ఉండడంతో, ప్రభుత్వం ఆ బిల్లుని రెండవసారి తిరిగి శాసన సభలో ప్రవేశ పెట్టింది.
రెండవ సారి శాసన సభలో 2/3 మెజారిటితో ఆమోదం పొందిన వికేంద్రికరణ బిల్లు తిరిగి శాసన మండలకి వెళ్ళడంతో తెలుగుదేశం యధావిధిగా అడ్డుకునే ప్రయత్నం చేసింది. శాసన మండలి చైర్మన్ దేశంలో ఎక్కడా లేని విధంగా వికేంద్రికరణ బిల్లుతో పాటు కీలకమైన ద్రవ్య బిల్లుని సైతం పాస్ చేయకుండా సభను నిరవధిక వాయిదా వేసి వెళ్ళిపోవడంతో వికేంద్రికరణ బిల్లు ప్రస్తుత పరిస్థితిపై పలు వాదనలు వినపడ్డాయి. అయితే రాజ్యంగంలోని ఆర్టికల్ 197 (2) అధికరణ ప్రకారం శాసన సభలో ఆమోదం పొంది మండలి లో రెండవ సారి ప్రవేశపెడితే ఆ బిల్లు మండలి తిరస్కరించిన, సవరణలు ప్రతిపాదించిన 30 రోజుల కాలవ్యవదిలో సదరు బిల్లు పాస్ అయినట్టే భావించాలని స్పష్టంగా ఉండటంతో తెలుగుదేశం మండలని అడ్డు పెట్టుకుని సృష్టించిన ఈ గందరగోళం కేవలం నాలుగు నెలలు ప్రభుత్వానికి అడ్డు పడటానికేనా అనే భావన ప్రజల్లో కలిగింది.
అయితే తెలుగుదేశం నేతలు మాత్రం ఈ బిల్లు హైకోర్టు పరిధిలో ఉండగా శాసన సభలో ప్రవేశపెట్టడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని, కావున ఈ బిల్లు చెల్లదని ఒక వాదనను తెరపైకి తీసుకుని వచ్చారు. కానీ రాజ్యాంగం ప్రకారం 2/3 నేతలు ఏం కోరుకుంటే అది చేయడం స్పీకర్ విధి. అసెంబ్లీ రూల్స్, రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారమే స్పీకర్ నడుచుకున్నారు తప్ప.. తానే ప్రత్యేక అధికారాలు ఉపయోగించలేదనేది స్పష్టం. గతంలో ఇదే వ్యవహారంపై మండలి చైర్మన్ విచక్షణాధికారాలను ప్రశ్నించే అధికారం కోర్టులకు కూడా లేదని యనమల చెప్పుకోచ్చారు.అలాగే గడించిన ప్రభుత్వం లో కూడా శాసన సభ్యురాలు రోజా విషయంలో నాటి స్పీకర్ కోర్టు ఆదేశాలను పాటించకుండా ఆమెను అనుమతించలేదు. దానిని వారు సమర్ధించుకుంటు శాసన సభ నిబంధనలను, స్పీకర్ అధికారాల విషయంలో కోర్టు జోక్యంతో పనిలేదని స్పష్టం చేస్తూ మహిళా సభ్యురాలు రోజాని అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వలేదు. ఈ ఘటనతో శాసన సభ వ్యవహారాలపై కోర్టుకు ఉండే పరిధి పై ఒక స్పష్టత వచ్చింది. ఇలా ఎటు చూసిన మండలి వికేంద్రికరణ బిల్లు విషయంలో తెలుగుదేశానికి చెక్ పడిందనే చెప్పాలి..