Idream media
Idream media
కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌కు మరో వారం రోజుల సమయం ఉంది. ఆ తర్వాత ఏమి జరుగుతుంది..? లాక్‌డౌన్ ఎత్తివేస్తారా..? ప్రధాని చెప్పిన దశల వారీ విధానం ఎలా ఉంటుంది..? దుకాణాలు తెరుచుకుంటాయా..? ఆఫీసులకు వెళ్లే పని చేయాలా..? లేదా ఇంట్లో నుంచే చేయాలా..? ఈ ప్రశ్నలన్నింటికీ నిన్న సోమవారం రాత్రి తెలంగాణ సీఎం కేసీఆర్ తెరదించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయం సత్ఫలితాలనే ఇస్తోంది. అయితే కొత్త కేసులు దేశ వ్యాప్తంగా నమోదవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో లాక్‌డౌన్ పొడిగించాలని సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించారు.
ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమవుతోంది. పేదలు మరింత పేదలవుతున్నారు. పైవేటు కొలువులు ఊడిపోయే పరిస్థితి వచ్చింది. పిల్లల చదువులు అటకెక్కాయి. అయినా.. ముందు బతికి ఉంటేనే కదా అవన్నీ. బతికుంటే బలుసాకుతిని బతకొచ్చంటూ సీఎం కేసీఆర్ తన మనసులోని మాటను కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. మూడు వారాల లాక్‌డౌన్ కష్టమో, నష్టమో పడ్డాం.. మళ్లీ వదిలేస్తే.. వైరస్ లేదనుకునే మన జనాలు విచ్చలవిడిగా తిరుగుతారు. తమ పనుల్లో మునుగుతారు. పరిస్థితి మళ్లీ మొదటకొస్తుంది. అందుకే లాక్‌డౌన్‌ను పొడిగించాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు. జూన్ 3వ తేదీ వరకూ లాక్‌డౌన్ కొనసాగించాలని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) నివేదిక చెబుతోందంటూ ప్రస్తావించారు. ఈ సంస్థే.. ఏపీలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణపై జగన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.
కేంద్ర లాక్‌డౌన్ ఎత్తి వేసినా.. దశల వారీగా తొలగించినా.. తాను మాత్రం తెలంగాణలో రెండు వారాల పాటు లాక్‌డౌన్ పొడిగిస్తానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కాకపోతే కేసీఆర్ ముందుగా తన మనసులోని మాటను చెప్పారు. కరోనా వైరస్ వ్యాపిస్తూ.. ప్రతి రోజు కేసులు నమోదవుతున్న తరుణంలో అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను కొనసాగించక తప్పని పరిస్థితి కనిపిస్తుంది . ఎందుకంటే.. కరోన నియంత్రణకు లాక్‌డౌన్‌కు మించిన ఆయుధం, ఔషధం మరేదీ లేదు. కేసులు పెరిగితే వైద్యం అందించేందుకు లాక్‌డౌన్‌కు మించిన కష్టాలు పడాల్సి వస్తుంది. పేదలు(తెల్ల రేషన్‌కార్డుదారులు)కు బియ్యం, పప్పు, ఉప్పు ఇస్తే చాలు మరో నెల రోజులు ఇళ్లలోనే ఉంటారు. వారికి ఇబ్బంది ఉండదు.
తెలంగాణలో ఏప్రిల్ 30వ తేదీ వరకూ లాక్‌డౌన్ కొనసాగుతుందని తేలిపోయింది. అయితే ఆ తర్వాత పరిస్థితి ఏమిటి..? అంటే ఇప్పటికిప్పుడు కేసీఆర్ కూడా ఏమి చెప్పలేరు. ఏప్రిల్ నెలాఖరు లోపు కొత్త కేసులు నమోద కాకపోతే లాక్‌డౌన్ ఎత్తివేతపై ఆలోచన చేస్తారు. అదీ కూడా కనీసం వారం, పది రోజుల పాటు ఒక్క కొత్త పాజిటివ్ కేసు కూడా నమోదు కానప్పుడే లాక్‌డౌన్ ఎత్తివేతపై ప్రభుత్వాలు ధైర్యంగా నిర్ణయం తీసుకుంటాయి. రెండు రోజుల నమోదు కాకుండా.. ఆ తర్వాత రోజు మరికొన్ని కొత్త కేసులు బయటకొస్తే.. మాత్రం కష్టాలు తప్పవు. భవిష్యత్ సంగతి ఏమైనా.. ఏప్రిల్ 30 వరకూ తెలంగాణ ప్రజలకు ఓ క్లారిటీ వచ్చింది. ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఆ దిశలోనే సిద్ధం అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.