iDreamPost
iDreamPost
కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి 80,90 దశకంలోకి తొంగి చూస్తే సుమన్, రాజశేఖర్ లు ఇద్దరూ స్టార్లకు ధీటుగా యాక్షన్ హీరోలుగా మంచి మార్కెట్ కలిగినవాళ్ళే . విలన్ గా కెరీర్ మొదలుపెట్టి తర్వాత సపోర్టింగ్ రోల్స్ లో కనిపించి ఆపై అంకుశంతో తిరుగులేని బ్రేక్ తో పాటు యాంగ్రీ యంగ్ మ్యాన్ అని పేరు తెచ్చుకోవడం రాజశేఖర్ కే చెల్లింది. ఉద్రేకంతో కూడిన ఎమోషన్స్ ని మొహంలోనే చూపించడంలో ఇతను చూపించిన నేర్పు ఎందరో అభిమానులను సంపాదించి పెట్టింది.
ఆ తర్వాత అల్లరి ప్రియుడు లాంటి లవ్ స్టొరీలోనూ అదే స్థాయిలో మెప్పించడం రాజశేఖర్ స్పెషాలిటి. ఒకదశలో వరస విజయాలతో దూసుకుపోతున్న ఇతనికి పోటీ ఎంత తీవ్రంగా ఉన్నా మినిమం గ్యారెంటీ ఉన్న హీరోగా బిజినెస్ పరంగా క్రేజీ ఆఫర్స్ వచ్చేవి. అగ్ర దర్శకులు సైతం సినిమాలు చేసేందుకు పోటీపడే వారు. ఇక సుమన్ విషయానికి వస్తే అమ్మాయిలు చూడగానే మనసు పారేసుకునే అందంతో చాలా తక్కువ టైంలో వెండితెరపై తళుక్కున మెరిశాడు. మొదట తరంగిణి, సితార లాంటి ప్రేమ కథలు చేసినా ఆపై బందిపోటు, ఉగ్రనేత్రుడు లాంటి యాక్షన్ మూవీస్ కూడా చాలా చేశాడు.
ఒక జానర్ కు కట్టుబడకుండా పెద్దింటల్లుడు, దొంగల్లుడు లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తోనూ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కెరీర్ మధ్యలో ఓ వివాదం కారణంగా కొంతకాలం తెరకు దూరమవ్వాల్సి వచ్చినప్పటికీ చాలా తక్కువ టైంలో కం బ్యాక్ ఇచ్చాడు. ఈ ఇద్దరు హీరోలకు ఉన్న సారుప్యత, బలం ఒకటే. తమకు డబ్బింగ్ చెప్పిన డైలాగ్ కింగ్ సాయి కుమార్. పోలీస్ స్టొరీలో సోలో హీరోగా హిట్టు కొట్టే ముందు వరకు సుమన్, రాజశేఖర్ లకు ఇతని గాత్రం చాలా పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచేది. గొంతు ఇవ్వడం ఆపేశాక కొంతకాలం ఈ ఇద్దరికీ ఫ్లాపులు రావడం గమనార్హం. వీరి సినిమాలు చూసేటప్పుడు అది తెరవెనుక సాయి కుమార్ వాయిస్ అనే విషయం చాలా మంది నమ్మలేనంత సహజంగా డబ్బింగ్ ఉండేది. ఇక్కడ చూస్తున్న పిక్ ఈ ముగ్గురు కలుసుకున్న ఓ అరుదైన సందర్భంలోనిది